వారణాసి నగరంలో ఒక గొప్ప పండిత కుటుంబంలో బోధిసత్వుడు జన్మించాడు. అతడు యుక్త వయస్కుడయ్యేనాటికి సర్వ శాస్త్రాలూ అభ్యసించి, పండితులందరితోనూ గొప్పవాడనిపించుకున్నాడు. ఆ కారణంగా ఆ దేశరాజు చిన్న వయసైనప్పటికీ బోధిసత్వుని తన ఆస్థానంలో ప్రధాన పురోహితునిగా నియమించాడు. బోధిసత్వుడు తాను శాస్త్రగ్రంథాలు చదివే సమయంలో, ఒక అద్భుతమైన వశీకరణ మంత్రాన్ని కనుగొన్నాడు. దాని ప్రభావంతో ఇతరుల మీద సర్వాధికారాలు చలాయించవచ్చు. ఆ మంత్రం ఒక్కసారి చదివితే, ఎంతటి వాళ్ళయినా దాసోహం అనాలసిందే! ఆ మంత్ర ప్రభావంతో ఎవరిపైనా అధికారం నెరపాలని బోధిసత్వుడికి ఆశలేదు కాని, దాన్ని మరిచిపోకుండా జాగ్రత్తపడాలన్న ఆలోచన కలిగింది. అరణ్యంలో ఒక ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకుని,అక్కడ వున్న ఒక ఎత్తయిన రాతిపై కూర్చుని, ఆయన పరిసరాలను ఒకసారి చూశాడు. ఎక్కడా మనిషిగానీ, జంతువుగానీ ఆయన కంటబడలేదు. బోధిసత్వుడు ఆ అద్భుత మంత్రాన్ని గొంతెత్తి చాలాసార్లు చదివి, సూర్యాస్తమయం అవుతూండగా, రాతి మీది నుంచి లేచి నగరానికి బయలుదేరాడు. ఆ సమయంలో ర...