గౌతమబుద్ధ



  గౌతమబుద్ధ

   ప్రపంచంలోని  తాత్వికులలో  గౌతమబుద్ధునికి విశిష్టమైన స్థానముంది. కొందరు ఆయనను ఆసియా జ్యోతిగా వర్ణిస్తే, మరికొందరు  ప్రపంచజ్యోతిగా భావిస్తున్నారు.
        బుద్దుడు   క్రీ.పూ.563లోవైశాఖ పూర్ణిమలో నేటి నేపాల్ దేశంలోని కపిలవస్తు నగరానికి సమీపంలో లుంబినీ గ్రామంలో జన్మించారు. అతని జన్మస్థలంలో అశోకుని రుమ్మిండి స్థంచశాసనంలో 'శాక్యమునియైన బుద్ధుడు ఇక్కడ జన్మించాడు' అని రాయబడివుంది. 
        ‌   బుద్ధునికి చిన్న తనంలో సిద్దార్థ్ అనే పేరు పెట్టారు.    సిద్ధార్థ్ శుద్దోధన్, మాయాదేవిల కుమారుడు. అప్పటికాలంలో గణ సమాజాలుండేవి. శాక్య గణానికి చెందిన శుద్దోధన్ కపిలవస్తు నగరానికి అధినేత.గణ సంఘ సభ్యుల సమిష్టి నిర్ణయాల మేరకు పరిపాలన సాగేది. మాయాదేవి దేవోదహ రాకుమార్తె. మాయాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టింటికి వెళుతూ మార్గ మధ్యంలో లుంబినీ వనంలో సిద్ధార్థునికి జన్మనిచ్చింది. కాని ఆమె  వారం రోజులకే  కన్ను మూసింది. దాంతో ఆమె పినతల్లి  గౌతమి ప్రజాపతిసిద్ధార్థుని పెంచి పెద్దచేసింది. అందువల్ల సిద్దార్థ ను గౌతం అని కూడా పిలిచారు.
                     సిద్దార్థ చాలా తెలివైనవాడు. చిన్నతనంలోనే సిద్ధార్థుడు సమస్త క్షత్రియ విద్య లను నేర్చుకున్నాడు.సిద్దార్థ కు ఏ కష్టం రాకుండా పెంచారు. కానీ చిన్నప్పటి నుంచి సిద్ధార్థగౌతముని కి ప్రాపంచిక సుఖాల పట్ల మోజుండేది కాదు. 
               
             ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది.ఉద్యానవనాలలో ధ్యానంచేస్తూండేవాడు. జంతువుల పట్ల,పక్షుల పట్ల  కరుణ, జాలి. ప్రేమ అధికంగా చూపేవాడు. ఆ రోజుల్లో చాలా మంది సన్యసించి అడవుల్లోకి వెళ్లే వారు.ఆ విధంగా గౌతమ్ కూడా సన్యసిస్తాడేమోన్న భయంతో  శుద్దోధనుడు సిద్ధార్థునికి యశోధరతో వివాహం చేశాడు.   
            కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు.అతనికి  రాహుల్  అని నామకరణం చేశారు. సిద్దార్థుని సవతి తల్లి కుమారుడు దేవదత్తుడు.
          ఒకరోజు కపిలవస్తు పురవీధులలో ఒక వృద్ధుని, వ్యాధి గ్రస్తుని, మృతదేహాన్ని,  సన్యాసిని చూసిన సిద్ధార్థుని మనస్సు కలవరం చెందింది. మానవ జీవిత బంధాలను మానవుని దుఖమును గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. ప్రపంచంలోని దుఖమునకు కారణం ఏమిటి అనే ప్రశ్న అతనిని వేధించింది.  

              మహాభినిష్క్రమణం     
              Great departure 
సిద్ధార్థుడు సకల వైభోగాలను త్యజించి, రాజ్యాన్ని భార్యా బిడ్డలను వదిలి సత్యాన్వేషణ కోసం అడవులకు బయలుదేరాడు.తన ప్రియసహచరి మాయాదేవి తో చర్చించిన తర్వాతే బయలుదేరాడని అంబేద్కర్ భావించాడు. దీనిని మహాభినిష్క్రమణం అంటారు.అప్పుడతని వయస్సు 29సంవత్సరాలు.
   ‌‌ ‌‌        రాజగృహ సమీపంలో ఉన్న అడవుల్లో  బ్రాహ్మణ సన్యాసులవద్ద సర్వశాస్త్రాలను అధ్యయనం చేశాడు. కొంతకాలం యోగాభ్యాసం చేశాడు. శరీరాన్ని కృశింపజేసు కున్నాడు. కఠిన నియమాలను పాటించాడు. కాని అతనిని వేధించిన ప్రశ్నలకు సమాధానం లభించలేదు. 
            సత్యాన్వేషణలో దాదాపు ఆరు సంవత్సరాలు విఫల ప్రయత్నం చేసి, చివరకు గయకు వెళ్లి అక్కడ రావి వృక్షం  కింద 49 రోజులు ధ్యానంలో నిమగ్నుడైన తరువాత సిద్ధార్థునికి ఒక రోజు వేకువజామున  తన ప్రశ్నలకు సమాధానం తెలియజేసే అత్యున్నత  జ్ఞానం అతని మదిలో తటిల్లతలా మెరిసింది. సిద్ధార్థ గౌతముడు బుద్ధుడు అయ్యాడు. బుద్ధుడనగా మనోవికాసం కలిగినవాడని అర్థం.నాటి నుంచి గౌతమ్ తనను బుద్ధునిగా పిలుచుకు ఉన్నన్నాడు.ఆ తరువాత బుద్దుని తధాగతుడని శాక్యముని అని కూడా పిలిచారు.రావి చెట్టును బోధివృక్షం అన్నారు.
          సిద్ధార్థునికి కలిగిన జ్ఞానాన్ని మహాసంబోధి అంటారు. అతనికి జ్ఞానోదయమైన గయ బుద్ధగయగా ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. జ్ఞానోదయాన్ని పొందినప్పుడు బుద్ధుని వయస్సు 35 సంవత్సరాలు.

           జ్ఞానోదయం పొందిన తరువాత బుద్ధుడు కాశీనగరంచేరాడు. అక్కడికి సమీపంలో ఉన్న సారనాథ్ లోనిమృగదావనంలో తొలిసారిగా ఐదుగురు శిష్యులకు ధర్మబోధ చేశాడు. వీరు కొండన్న(కౌండిన్య),అశ్వజిత్,కాశ్యప,మహానామ,
భద్రక.దీనినే "ధర్మచక్ర ప్రవర్తన "అంటారు. దీనిని జూలై5న  నిర్వహించారు.వారికి అష్టాంగ మార్గాలు బోధించాడు. విపశ్యనా ధ్యాన పద్ధతులను చెప్పారు.

బుద్ధుడు దుఃఖం, దుఃఖ సముదాయం, దుఃఖనిరోధం, దుఃఖనివారణ అనే నాలుగు ఆర్య సత్యాలను బోధించాడు.వీటిని అష్టాంగ మార్గాల ద్వారా సాధించాలన్నాడు. అవి:
సమ్యక్ దృష్టి, 
సమ్యక్ సంకల్పం, 
సమ్యక్ వాక్కు, 
సమ్యక్ కర్మ, 
సమ్యక్ జీవనం, 
సమ్యక్ వ్యాయామం, 
సమ్యక్ స్మృతి, 
సమ్యక్ సమాధి 
     ఈ ఎనిమిది  మార్గాలతో  బౌద్ధ ధర్మం ఏర్పడింది. ఇవన్నీ బౌద్ధ భిక్షువు లైన వారందరూ తప్పని సరిగా పాటించాలి. 
       గృహస్తుల కోసం పంచశీల బోధించాడు.
వీటిని పాటించేవారిని ఉపాసకులు అన్నారు. బుద్ధుని ఆశ్రయించిన వారిని బౌద్ధులన్నారు. బుద్ధుని ధర్మాచరణ, సమత అన్నివర్గాల వారిని ఆకర్షించింది. బుద్ధుడు కులవ్యవస్థను నిరాకరించాడు. ధర్మాన్ని, జ్ఞానాన్ని పొందడానికి అందరూ అర్హులేనని ప్రకటించాడు. అన్ని ప్రాంతాలకు పాదచారియై ప్రయాణిస్తూ చెట్లకింద నివాసం ఉంటూ, రోజూ భిక్షాటన చేసి, ఒక పూట మాత్రమే భోజనం చేసి, జీవితాన్ని, ధర్మాన్ని నియమబద్ధంగా నడిపాడు.

నిమ్నవర్గాలకు చెందిన ఉపాలి, సోపాకుడు, సుప్పియుడు, సుమంగలుడు, శకటాలుడు, డంకుడు, పృథక్కుడు తదితరులను తన శిష్యులుగా చేసుకున్నాడు. వారందరికీ ఒక సంఘాన్ని  ఏర్పాటు చేశాడు.
              బుద్ధుడు అహింసను,శాంతిని బోధించాడు. ఒకరోజు ఒక వ్యక్తి  బుద్ధుని వద్దకు వచ్చి ‘నాకు సంతోషం కావాలి’ అని కోరాడు. అప్పుడు బుద్ధుడు ,”నీ వాక్యంలోని ‘నాకు’ అనే మాటను తొలగించు, అది అహంకారానికి సంకేతం.అలాగే ‘కావాలి’ అనే మాటను తొలగించు. అది కోరికలకు చిహ్నం .అవి తొలగించిన తర్వాత నీకు (అందరికీ) మిగిలేది సంతోషం “అని చెప్పాడు .ఒక జీవిని చంపడమే కాదు, దాన్ని బంధించినా, పక్షుల్ని బోనులో పెట్టి  పెంచుకున్నా అది కూడా హింసే అన్నాడు బుద్ధుడు .చేతలతోనే కాదు, మాటల ద్వారా దూషించినా, బాధపెట్టినా దాన్ని కూడా ‘జీవహింస’ గానే  చెప్పాడు.బౌద్ధానికి ముందు మన సంప్రదాయంలో పౌర్ణమికి ప్రాధాన్యత లేదు. బుద్ధుని తర్వాత చాంద్రమానం ప్రాముఖ్యత హెచ్చింది. పౌర్ణమికి ప్రాధాన్యత పెరిగింది.

బౌద్ధానికీ, పౌర్ణమికీ అవినాభావ సంబంధం ఉంది. బుద్ధుడు జన్మించిందీ , ఇల్లు విడిచిందీ, జ్ఞానోదయం పొందిందీ, పరినిర్వాణం పొందిందీ వైశాఖ పూర్ణిమ రోజే. బుద్ధుడు తొలిగా పరివ్రాజకుడైనదీ, ధర్మప్రచారం ప్రారంభించిందీ, తొలి బౌద్ధసంఘం ప్రారంభించినదీ ఆషాఢ పూర్ణిమ నాడు. బుద్ధుడు తన తల్లికి భిక్షుణిగా దీక్ష ఇచ్చినది ఆశ్వయుజ పౌర్ణమి నాడు.ఫాల్గుణ పౌర్ణమి బుద్ధుడు తన ఏడేళ్ల కుమారుడు రాహులునికి భిక్షు దీక్ష ఇచ్చిన రోజు.
 బుద్ధుడు ఇలా చెప్పాడు:
“ఒక గొప్ప వ్యక్తికంటే సంఘమే గొప్పది,ఉన్నతమైనది.వ్యక్తి సేవ కంటే సంఘ సేవ ఉన్నతమైనది"
బుద్ధుడు నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడు. మానవజీవితాన్ని అర్థం చేసుకోమనే అందరూ చెప్తారు. చెప్పే విధానాలు మాత్రమే వేరు. ‘దయగా ఉంటే మంచిది’ అని మిగతా సంప్రదాయాలు చెబితే, ‘దయతో ఎలా ఉండాలో’ బౌద్ధం చెబుతుంది. ఎవరి పట్ల ఎంత కృతజ్ఞతగా ఉండాలో నేర్పుతుంది.ఆయన మాటలకన్నా ఆచరణే ప్రాధాన్యమన్నాడు.

       బుద్ధుడి కాలం నుంచే స్త్రీలకు ప్రాధాన్యత ఉంది. భారతదేశంలో స్త్రీలకు మొట్టమొదటగా సంఘాన్ని ఏర్పాటు చేసింది బుద్దుడే.
బుద్ధుని పెంచి పెద్ద చేసిన తల్లి గౌతమి ప్రజాపతి బౌద్ధమతాన్ని అవలంబించింది. అలాగే అశోకుడి కుమార్తె!లోకానికి మార్గదర్శకులుగా ఉండే మహనీయులందరూ నిరాడంబర జీవితాన్నే గడిపారు. స్వంత పనులకోసం మరొకరిపై ఆధారపడటం కూడా బుద్ధుడికి ఇష్టం ఉండేది కాదు. ఓపిక ఉన్నంత వరకు ఎవరి పని వారు చేసుకోవాలని చెప్పేవాడు. ఎనభైఏళ్ల వయసులో కూడా ఆయన పనులను ఆయనే చేసుకునేవాడు. ఆయన భోజనం చేసిన తర్వాత భిక్షాపాత్రను కడగటానికి ఆయన ప్రియశిష్యుడు ఆనందుడు ఎంత అడిగినా ఇచ్చేవాడు కాదు. నేను అన్నం తింటున్నాను గదా నా పాత్రను నేనే కడుక్కోవడం న్యాయం అనేవాడు. బుద్ధుడు స్వయంగా తాను ఆచరిస్తూ, నిరాడంబరత ప్రాముఖ్యాన్ని లోకానికి చాటి చెప్పాడు.

ఇతరుల గురించి ఈర్ష్య పడకుండా, తమను తాము మంచివారిగామలచుకోవాలని, మనకు ఉన్న అతి పెద్ద సంపద అయిన మేధస్సును సక్రమంగా వాడుకోవాలని బౌద్ధం బోధిస్తుంది. అలాగే మానవ అభివృద్ధికి అవసరమైన ఆధ్యాత్మికతను వయసుతో సంబంధం లేకుండా అందరూ అలవరచుకోవాలని  చెబుతుంది.” ఒకసారి శుద్దోధనుడు బుద్ధుడిని కపిలవస్తుకు వచ్చి తన బోధలు వినివించవలసిందిగా కోరాడు.  బుద్ధుడు తన పరివారంతో కపిలవస్తుకు చేరాడు. తండ్రిని సమీపించి రాహుల్  తనను ఆయన కుమారుడిగా పరిచయం చేసుకొని,ఆయన వారసత్వ సంపదను తనకు అందచేయమని వేడుకున్నాడు.అందుకు బుద్ధుడు చిరునవ్వుతో అంగీకరించి, పక్కనే  ఉన్న ధర్మసేనాపతి సారిపుత్రుణ్ణి పిలిచి, రాహుల్ కు భిక్షు దీక్ష ఇవ్వమని చెప్పాడు. “ఇదొక ధర్మ సామ్రాజ్యం,ఇదే నా ఆస్తి”అంటూ రాహులుడికి ఒక భిక్షాపాత్రను అందించాడు బుద్ధుడు. అప్పుడు రాహులుడి వయసు ఏడు సంవత్సరాలు.రాహులుడు బౌద్ధమతంలో తొలి బాల బిక్షువుగా మారాడు.బౌద్ధమతంలో బాలభిక్షువుల్ని శ్రామణేరులు అంటారు.ఆ విషయం తెలిసిన  శుద్ధోధనుడు చాలా దు:ఖించాడు.ఆ దు:ఖంతోనే,”ఇక నాకు ఈ రాజ్యం ఎందుకు, నన్నుకూడా నీ సంఘంలో చేర్చుకో!” అని బుద్ధుడిని కోరి అతను కూడా బిక్షువుగా మారాడు . బుద్ధుని సవతి తల్లి గౌతమి, తండ్రి శుద్ధోధనుడు, భార్య యశోధర కూడా భిక్షు సంఘంలో చేరారు.

బౌద్ధ ధర్మంలో రాహులుడు ఎంతో నిష్ణాతుడయ్యాడు. బుద్ధుడు అతనికిచ్చిన ప్రబోధాలు బౌద్ధ సారస్వతంలో  ‘రాహులో వాద సుత్త’గా ప్రసిద్ధి చెందాయి . ఆయన ఎక్కువకాలం ఆమ్రరత్న వనంలో జీవించాడు. రాహులుడు   చిన్నవయసులో యువకునిగా ఉన్నప్పుడే మరణించాడు. పూర్వజన్మలు,మరు జన్మలు లేవన్న బుద్ధుడిని గురించి బౌద్ధ గ్రంధాలలో విచిత్రంగా ‘బుద్ధుని జాతక కధలు’ఎలా వచ్చాయో అంతుబట్టదు.’బుద్ధుని జాతక కధలు’ ప్రకారంగా సిద్ధార్ధ గౌతముడు బుద్ధుడు కాకముందు ఐదువందల నలభై ఏడు జన్మలు ఎత్తినట్లు బౌద్ధగ్రంథాలు చెప్పాయి .అయితే ఈ కధలు– మనలో ఉండాల్సిన ప్రేమ, కరుణ, సహనం, మైత్రీభావాల గురించి స్పష్టంగా తెలియచేస్తాయి.

            సుమారు 45 సంవత్సరాలు దేశ సంచారం చేసి బుద్ధుడు ధర్మప్రబోధం చేశాడు. ప్రభువులు, సామాన్య ప్రజలు అతని బోధనలకు ఆకర్షితు లయ్యారు. మగధ ప్రభువులు, ఉంటసార,అజాత శత్రువులు అతని శిష్యులయ్యారు.

ఒక దీపంతో వేల దీపాలను వెలిగించవచ్చు. అలాగే ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటే ఏ మాత్రం తగ్గిపోదని బుద్ధుడు చెప్పినాడు. తనకున్న దాంట్లో సంతృప్తి చెందనివాడు ఏనాడూ సంతోషంగా ఉండలేడన్నాడు.ఆనందమంటే పుష్కలంగా ఉండటం కాదని పుష్కలంగా ఇవ్వటమని ఆయన బోధించాడు.

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోకుండా మనస్సును పరిశుభ్రంగా దృఢంగా ఉంచుకోవడం సాధ్యం కాదన్నాడు. గతాన్ని తలపోస్తూ భవిష్యత్తుపై
బెంగ పెట్టుకొని కష్టాలొస్తాయోమోనని భయపడుతూ ఉంటే మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఉండలేమన్నాడు.వర్తమానం పై దృష్టి పెట్టి, ఆనందంగా జీవిస్తూ ఉంటే ఆరోగ్యంగా జీవించవచ్చునని ఆయన బోధించాడు.

బుద్ధుడు బోధించిన అష్టాంగమార్గాలన్ని మన ఆలోచనల్ని సరైనదారిలో ఉంచేందుకు తోడ్పడేవే. బుద్ధుడు కేవలం విజ్ఞానాన్ని బోధించే వ్యక్తికాదు. ఆయన ఆచరణకు మార్గదర్శి. ఆచరణే ప్రధానమని పలుమార్లు హెచ్చరించాడు.
ఎంత మంచి విషయాలు చదివినా, ఎంత గొప్ప విషయాలు మాట్లాడినా, ఎంత మంచి ఆలోచనలు చేసినా వాటిని ఆచరించకపోతే ఏమి ప్రయోజనమని ఆయన సమాజాన్ని హెచ్చరించాడు. ఆలోచనలను అదుపులో ఉంచుకోమన్నాడు. ఒకసారి ఆలోచనలపై అదుపు సాధించగల శక్తి సంపాదిస్తే అప్పుడు నీకెవరి సహాయం, అవసరం ఉండదన్నాడు. చెడు ఆలోచనలను నియంత్రించుకోవడానికి అష్టాంగ మార్గాలు తోడ్పడతాయి.  అతని బోధనలు విన్న వ్యాపారస్తులు అతని శిష్యులయ్యారు.
గౌతమ బుద్ధుని బోధనలు హేతుబద్ధమైనవి. ఇప్పటి వరకు సైన్స్ చెప్పిన, చెప్పని అనేక అంశాలను బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితమే చర్చించాడు. 

ఆయన ప్రతిపాదించిన శాస్త్రీయభావనలలో ప్రధానమైనవి:

అనాత్మ సిద్ధాంతం 

 ఆత్మ లేదు అని బుద్ధుడు స్పష్టం చేశాడు. ఆత్మ ఉన్నదని చెప్పే ఏ మతమైన అది అనుసరణీయం కాదు అన్నాడు... అలా చెప్పడం మూఢత్వమే అన్నాడు.

అనిత్య సిద్ధాంతం

నిత్యమైనది ఏది ఉండదు అని చెప్పాడు. ప్రతీది అనిత్యమై మార్పు చెందుతుంది అన్నాడు.

కార్యకారణ సిద్ధాంతం 

 ప్రతి కార్యానికి కారణం ఉంటుంది అన్నాడు. ప్రతిదానికి హేతువు ఉంటుంది అన్నాడు. హేతువు లేకుండా ఉన్న దేనిని నమ్మకూడదు అన్నాడు. ప్రతీది పరిశీలించి, చూసి, మీ పరిశీలనలో నిజమని తెలితేనే నమ్మండి అన్నాడు. ఎవరో చెప్పినది నమ్మడానికి వీలులేదు అన్నాడు.

ప్రతిత్యాసముత్పాద సిద్ధాంతం

 దేవుడు ఉన్నాడా లేడా అన్నది ఇక్కడ ప్రదానం కాదు. 
        ఈ సృష్టి శూన్యం లో నుండి నిర్మించబడింది అనడం సహేతుకమైనది కాదు. అది అబద్దమే అవుతుంది. అలా కాకుండా ఏదో ఒక పదార్థం నుండి సృష్టిని సృజిస్తే దేవుడు సృష్టికర్త కానట్లే. ఎందుకంటే తను సృష్టించడానికంటే ముందే ఒక పదార్ధం ఉంది కాబట్టి. కనుక సృష్టికర్త అంటూ ఎవరు లేరు (ఇంతవరకు ఎవరు చూడలేదు) కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్మడం మూఢత్వమే అవుతుంది.

చేతన సిద్ధాంతం

            విద్యుత్తు ఎక్కడ ఉంటుందో అక్కడ అయస్కాంత శక్తి కూడా ఉంటుంది. విద్యుత్తుని వెన్నంటి అయస్కాంత శక్తి ఉన్నట్టే శరీరం రూపుచెందడంతో పాటు చేతనత్వం కూడా ఏర్పడుతుంది.

"నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా నీ స్వబుద్ధితో నీకు నీవుగా బుద్ధుడిగా మారడమే బౌద్ధం.సృష్టి నియమాన్ని అర్ధంచేసుకొని సత్యాన్ని గ్రహించి ఆ ధమ్మం లో నడవడమే బౌద్ధం.
సత్యాన్ని గ్రహించినవాడిగా అనేకులకు ఆ సత్యాన్ని తెలియజేస్తూ, ధమ్మాన్ని ఆచరిస్తూ సంఘంలో జీవించడమే బౌద్ధం."అని అన్నాడు.

ఇలా బుద్ధుడు ధర్మప్రచారం చేస్తూ 80 ఏళ్ళు జీవించాడు. చివరికికుశీనగరం(ఉత్తరప్రదేశ్)లో బుద్ధుడుమహాపరినిర్వాణం చెందాడు. బుద్ధుని బోధనలు దేశ విదేశాల ప్రజలెందరినో ఆలోచింపచేసేలా చేశాయి. ఫలితంగా చాలామంది బౌద్ధం స్వీకరించే విధంగా ప్రేరేపించాయి. భారతదేశానికి బౌద్ధం ఇప్పుడు మరింత అవసరం. ఈ విషయాన్ని  బి.ఆర్. అంబేద్కర్  గుర్తించే బౌద్దం విస్తరణ కోసం ప్రయత్నించాడు. కానీ ఆయన అనుకోకుండా గుండె పోటుతో మరణించారు.
పదిమందికి పంచేకొద్దీ తనలో ప్రావీణ్యతను పెంచేది విద్య.పదిమందిలో మెలిగేకొద్దీ తనలో సంస్కారాన్ని పెంచేది శుద్ది.పదిమందితో తిరిగేకొద్దీ తనలో సమయస్ఫూర్తిని పెంచేది బుద్ది.ఇదంతా కూడా సజ్జనుల సాంగత్యం వలనే సాధ్యపడుతుంది.

బౌద్ధం మూలాలు రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా ఉన్నాయి. నాగార్జునసాగర్ నంది కొండ ఖమ్మంలో నేలకొండపల్లి కరీంనగర్ ధూళి కట్టి, వైజాగ్ తొట్లకొండ, తూర్పుగోదావరి జిల్లా ఆదుర్రు కోరుకొండ కొడవలి రంప యెర్రంపాలెం పశ్చిమగోదావరి జిల్లా గుంటుపల్లి గుహలు జీలకర్ర గూడెం కృష్ణాజిల్లా ఘంటసాల కర్నూలు జిల్లా సింగరాయకొండ శ్రీకాకుళం జిల్లా శాలిహుండం విజయనగరం జిల్లా రామతీర్థం గుంటూరు జిల్లా ధాన్యకటకం ఇలా చెబుతూ పోతే అనేక చారిత్రక ఆధారాలు అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో అనేకం ఎన్నో ఉన్నాయి. అమరావతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కానీ నేడు తెలుగునేలపై బౌద్ధం ఇప్పుడిప్పుడే మళ్లీ చిగురిస్తోందని చెప్పాలి.

అయితే భారతదేశంలో బౌద్ధం తిరిగి కొంతమేరకు మళ్ళీ పునరుజ్జీవనానికి ప్రధాన కారణం  అంబేద్కర్ .1956 అక్టోబర్ 14న ఆయన హిందూ మతాన్ని విడిచిపెట్టి ఐదున్నర లక్షల మందితో నాగపూర్ దీక్ష భూమి వద్ద బౌద్ద మతం స్వీకరించడం తో ఇది ప్రారంభమైంది.
 అంబేద్కర్  బౌద్ధ జీవన విధానాన్ని స్వీకరిస్తూ   ఐదున్నర లక్షల మంది చేత చేయించిన ప్రతిజ్ఞ ను ఇలా చేయించారు.

 ప్రతిజ్ఞ 

1. నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవుళ్ళుగా భావించను,వాళ్ళను పూజించను.
2. నేను రాముడు, కృష్ణుణ్ణి దేవుళ్ళు అనను, వారిని పూజించను.
3. నేను గౌరీ,గణేశులను మరి ఏ ఇతర హిందూ దేవుళ్ళను పూజించను.
4. నాకు దేవుని అవతారం మీద నమ్మకం లేదు.
5. బుద్ధుడు విష్ణువు యొక్క అవతారం అనడం తప్పు, ద్వేషపూరితం.
6. నేను శ్రార్థ కర్మలు గానీ పిండ ప్రదానం గానీ చేయను.
7. నేను బుద్ధుని బోధనలకు విరుద్ధంగా ఉండే ఏ ఒక్క అంశాన్ని పాటించను.
8. నేను బ్రాహ్మణుల ఆచారాలను పాటించను.
9. నేను మానవులంతా సమానమని నమ్ముతాను.
10. నేను సమానత్వ స్థాపనకు కృషి చేస్తాను.
11. నేను అష్టాంగ మార్గాన్ని ఆచరిస్తాను.
12. నేను బుద్ధుడు చెప్పిన దశ పారమితులను ఆచరిస్తాను.
13. నేను సమస్త జీవుల పట్ల దయ కలిగి ఉంటాను.
14. నేను దొంగతనం చేయను.
15. నేను అబద్ధాలు చెప్పను.
16. నేను ఎటువంటి లైంగిక దుర్మార్గాలకు పాల్పడను.
17. నేను మద్యం సేవించను.
18. నేను జ్ఞానం,నీతి,దయలపై  ఆధారపడిన సూత్రాలతో జీవిస్తాను.
19. మనుషులను సమానంగా చూడని, నా ఎదుగుదలకు హానికరమైన హిందూ మతాన్ని బహిష్కరించి,బుద్ధుని ధర్మాన్ని అనుసరిస్తాను.
20. నేను బుద్ధుని ధర్మం మాత్రమే సరైనదని ఒప్పుకుంటున్నాను.
21. నేను కొత్తగాజన్మిస్తున్నానని నమ్ముతున్నాను.
22. నేను ఇప్పటి నుండి బుద్ధుని బోధనలకు అనుగుణంగా నడుచుకుంటాను.

భారతదేశంలో తొలి సంఘ సంస్కర్త. సామాజిక విప్లవకారుడు. ప్రజలకు ప్రేమ శాంతి సమానత్వం సౌభ్రాతృత్వాలు తన బోధనల ద్వారా ఆనాటి కాలపు అజ్ఞానాన్ని అంతంచేసి  జ్ఞానాన్ని భారతీయుల కందించడమేగాక  విశ్వమంతా విస్తరించిన గొప్ప వ్యక్తి.ఇతనిబాటలో నడిచిన క్రీస్తు కూడాఅంతే ప్రసిద్ధుడైనాడు.

Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు