అజంతా చిత్రాలు — బౌద్ధ ధర్మానికి ప్రతిబింబాలు
అజంతా చిత్రాలు — బౌద్ధ ధర్మానికి ప్రతిబింబాలు
అజంతా గుహలు భారతీయ బౌద్ధ శిల్పకళకు, బౌద్ధ చిత్రకళకు,బౌద్ధ ధర్మానికి చిరస్మరణీయమైన వారసత్వం. ఈ గుహలు మనకు బౌద్ధ జీవన విధానంపై విలువైన సమాచారాన్ని అందిస్తాయి.ఈ గుహలు మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో వేరూలా నదికి సమీపంలో ఉన్న ఒక పర్వత శ్రేణిలో ఉన్నాయి. అజంతా గుహలను UNESCO ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది.భారతీయ కళా చరిత్రలోనే కాక, ప్రపంచ కళా చరిత్రలోనూ అజంతా గుహలు ఒక అపూర్వ అద్భుతం. ఇవి బౌద్ధ ధర్మంలోని కరుణ, త్యాగం, జ్ఞానం, అనిత్యత వంటి శాశ్వత విలువలకు ప్రతిబింబాలు.
అజంతా గుహలను మొదట క్రీస్తుపూర్వ 2వ శతాబ్దంలో థేరవాద (హీనయాన)
సంప్రదాయంలో 9 నుండి 12 వరకు ఉన్న గుహలు నిర్మించబడినాయి. ఈ గుహలు బౌద్ధ భిక్షువులు, వ్యాపారులు, మద్దతుదారుల విరాళాల ఆధారంగా నిర్మించబడ్డాయని తెలుస్తోంది.. ఆ కాలంలో సన్యాసులు ధ్యాన–విద్యా కేంద్రాలుగా, ప్రార్థన మందిరాలుగా వీటిని ఉపయోగించారు. తర్వాత మహాయాన కాలంలో, క్రీస్తుశకం 5వ–6వ శతాబ్దాలలో,
1 నుండి 8 గుహలను 13 నుండి 30 వరకు ఉన్న గుహలను హరిషేణుడు అనే వాకాటక రాజు (సుమారు క్రీస్తుశకం 460–478) నిర్మించారని చరిత్రకారులు భావిస్తున్నారు.
16, 17, 19, 26 గుహలు అతని కాలంలో లేదా అతని అనుయాయుల కాలంలో నిర్మించబడ్డాయని శాసనాల ద్వారా తెలుస్తోంది.ఈ గుహలలో విహారాలు (మఠాలు), చైత్యాలు (ఆరాధనా మందిరాలు), శిల్పాలు, చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. తొమ్మిది శతాబ్దాల పాటు బౌద్ధ సన్యాసుల ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లిన ఈ గుహలు, బౌద్ధ ధర్మం ధ్వంసం చేయబడిన తర్వాత అవి అడవి కాచిన వెన్నెల లా ఉండిపోయాయి.
అజంతాలో మొత్తం 30 గుహలు ఉన్నాయి. వీటిలో:
• చైత్య గృహాలు (బౌద్ధ ప్రార్థనా మందిరాలు): --9, 10, 19, 26 గుహలు
• విహారాలు (బౌద్ధ మఠాలు): 1, 2, 4, 6
-----గుహలు
• చిత్రకళ: 1, 2, 16, 17 లోని చిత్రాలు ప్రఖ్యాతి గాంచాయి. ఈ చిత్రాలలో గోడలపై బుద్ధుని జీవితం, జాతక కథలు, ధార్మిక దృశ్యాలు ఉన్న చిత్రాలను నేచురలిస్టిక్ శైలిలో వేసినారు.
• శిల్పకళ: ఈ గుహల్లో ఉన్న బుద్ధుని విగ్రహాలు, రాతి స్తంభాలు, కమానులు, శిల్పాలు ఎంతో రమణీయంగా ఉంటాయి.
• నిర్మాణ పద్ధతి:
ఈ గుహలను నేరుగా కొండను చెక్కి నిర్మించారు. ఇదొక రాక్-కట్ ఆర్కిటెక్చర్.
అజంతా గుహలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాక, విద్యా కేంద్రాలుగా కూడా ఉండేవి. దేశ విదేశాల నుంచి భిక్షువులు ఇక్కడికి వచ్చేవారు.
1819లో బ్రిటిష్ అధికారి జాన్ స్మిత్ అనే వ్యక్తి ఈ గుహలను కనిపెట్టేదాకా వీటి గురించి ప్రపంచానికి తెలీదు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ ఆర్కియాలజిస్టులు, ముఖ్యంగా జేమ్స్ బర్జెస్, ఫెర్గూసన్, అజంతా గుహలను అధ్యయనం చేసి వాటి చిత్రాలు, ఆకృతులు, శిల్పాలు, గుహల సంఖ్య గురించి ఆధునిక ప్రపంచానికి పరిచయం చేశారు.
చైనా బౌద్ధ యాత్రికులు ఫాహియెన్ (Faxian), హ్యూయెన్ త్సాంగ్ (Xuanzang) భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఇతర బౌద్ధ కేంద్రాల గురించి తమ డైరీలలో అజంతా గుహల గురించి నేరుగా ప్రస్తావించకపోయినా అజంతా కు దగ్గరగా ఉన్న ఇతర బౌద్ధ కేంద్రాల ప్రాముఖ్యతను వివరించారు.
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) మరికొన్ని పరిశోధనలు చేసి అజంతా గుహల కాలాన్ని, నిర్మాణ శైలిని వివరించింది.చిత్రాలను, శిల్పాలను రక్షించేందుకు కృషి చేసింది.
అజంతా చిత్రకళ అత్యంత పురాతన పద్ధతులలో ఉన్న కళ. ఇది ప్రపంచంలో ఫ్రెస్కో టెక్నిక్‌తో పోల్చదగిన కళ. యూరోపియన్ ఫ్రెస్కోలలో తడి ప్లాస్టర్ మీద చిత్రాలు వేస్తే, అజంతా చిత్రకారులు పొడిగా ఉన్న ప్లాస్టర్‌పై చిత్రాలను వేసేవారు. మొదట గోడలపై బంకమట్టి, ఆవు పేడ, బియ్యంపొట్టు కలిపి పూసి బలమైన ఉపరితలం సృష్టించేవారు. దాని మీద సున్నపు తేట పూత వేసి మృదువైన వర్ణచిత్రం వేయబడేది. ఈ పూత కేవలం రంగు స్థిరత్వానికి ప్రకాశవంతమైన నిగారింపు కోసం ఉపయోగపడేది.
చిత్రాల్లో వాడిన ప్రధాన వర్ణాలు — రెడ్ ఓచర్, పసుపు ఓచర్, బ్రౌన్ ఓచర్, లాంప్ బ్లాక్, వైట్, లాపిస్ లాజులీ. లాపిస్ లాజులీని పసుపుతో కలిపి ఆకుపచ్చ రంగు తయారు చేయడం ఆ కాలపు శాస్త్రీయ సృజనాత్మకతకు నిదర్శనం. ఈ రంగులు ఉత్తర భారతదేశం, మధ్య ఆసియా, పర్షియా ప్రాంతాల నుండి దిగుమతి చేయబడ్డాయి.
అజంతా చిత్రాల ప్రత్యేకత ఏమిటంటే —ఇవన్నీ బౌద్ధ ధర్మంలోని జాతక కథలు, బుద్ధుని జీవన ఘట్టాలు, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే దృశ్యాలు.ఇందులో ప్రతి పాత్ర, ప్రతి నేపథ్యం సప్తవర్ణ రంజితమై వర్ణ సమతుల్యతతో కాంతి వంతంగా సహజత్వంతో ఉట్టి పడుతూ ఉంటుంది. పైకప్పులు, గోడలు, స్తంభాలు అన్నీ చిత్రభంగిమలతో అలరాలుతున్నాయి.
అజంతా చిత్రాలు కేవలం కళా ప్రతిభ కాదు; అవి బౌద్ధ తాత్విక సూత్రాల ప్రతిరూపాలు. కరుణ, త్యాగం, జ్ఞానం, ప్రతీత్య సముత్పాదం (పటిచ్చ సముప్పాదం) వంటి సిద్ధాంతాలు ప్రతి చిత్రంలో నిశ్శబ్దంగా పలుకరిస్తాయి. జీవితం అనిత్యమని, దుఃఖానికి మూలం తృష్ణేనని, జ్ఞానమే విముక్తికి మార్గమని బౌద్ధ బోధ ప్రతీ గీతలో, ప్రతి ముఖకవళికలో ప్రతిధ్వనిస్తుంది.
బౌద్ధ ధర్మంలో బోధిసత్వుడు కరుణామూర్తి. తన నిర్మాణాన్ని (విముక్తిని) వాయిదా వేసి ఇతరుల విముక్తికి కృషి చేసే ఆదర్శవంతుడు. పద్మపాణి బోధిసత్వుని కనులలో కరుణ, ముఖంలో ప్రశాంతత, చేతిలో కమలంతో ధ్యానంలో నిలిచిన రూపం — అజంతా కళకు ఉన్నతమైన ప్రతీకగా నిలిచింది. అతని పక్కనే వజ్రపాణి — శక్తి, ధైర్యం, దృఢత్వానికి చిహ్నం. ఈ రెండు రూపాలు కలిపి బౌద్ధ ధర్మంలోని “కరుణా–ప్రజ్ఞా సమన్వయాన్ని” సూచిస్తాయి.
అజంతా గుహల చిత్రాలన్నీ ప్రధానంగా బుద్ధుని జీవిత ఘట్టాలతో , జాతక కథలతో ఉన్నాయి. మహాయాన బౌద్ధులు
బౌద్ధ ధర్మంలోని నైతిక విలువల్ని ప్రజలకు బోధించడానికి జాతక కథలను రాశారు. ఈ కథల్లో బుద్ధుడు బోధిసత్వునిగా జన్మించి వేరు వేరు జన్మల్లో చేసిన త్యాగాలు, సేవలను వర్ణించారు.
సిభి జాతక కథలో రాజు సిభి ఒక పావురం ప్రాణాన్ని రక్షించేందుకు తన మాంసాన్ని కొలిచి ఇచ్చిన త్యాగగాథ. ఇది కరుణ, త్యాగానికి చిహ్నం.
విశ్వంతర జాతకంలో రాజు విశ్వంతరుడు తన పిల్లలనే దానం చేసిన కథ ఉంది. ఇది త్యాగంలో పరాకాష్ఠ.
సింహళ జాతకంలో బోధిసత్వుడు ఏనుగుగా పుట్టి ఒక వేటగాడికి తన దంతాలను స్వయంగా ఇచ్చిన సంఘటన ఉంది . ఇది స్వార్థరహిత దానానికి ఉదాహరణ.
ఈ చిత్రాల్లో కేవలం కథనం కాకుండా మనిషి మనస్సులోని భావప్రకటనలే కనిపిస్తాయి. పాత్రల కళ్లలో కరుణ, చేతుల భంగిమల్లో సమాధానం, శరీర కదలికల్లో ఆధ్యాత్మిక స్పర్శ కనిపిస్తుంది.
ఇక్కడున్న 30 గుహలలో ఒకటవ గుహ అత్యంత ప్రసిద్ధి పొందిన విహారం. ఇక్కడ పద్మపాణి, వజ్రపాణి చిత్రాలు సజీవంగా ఉన్నాయి. ఇందులో “మారుని విజృంభణ” దృశ్యం కనిపిస్తుంది. గౌతముడు బోధి వృక్షం కింద ధ్యానంలో ఉండగా మారుడు తన కుమార్తెలను ఆకర్షణకు పంపిన ఘట్టమిది.
రెండవగుహ లో మాయాదేవి స్వప్నం, బుద్ధుని జననం చిత్రాలు ఉన్నాయి. మాయాదేవి నిద్రలో తెల్ల ఏనుగు తన గర్భంలో ప్రవేశించిన దృశ్యం, తర్వాత లుంబినిలో బుద్ధుని జననం, బాల్యం లో సిద్ధార్థుని ఏడు అడుగులు — అన్నీ బుద్ధుని జీవిత గాథలను కళాత్మకంగా చిత్రీకరించారు.
4వ గుహ అతిపెద్ద విహారం. దీని ప్రధాన ద్వారం అద్భుతంగా అలంకరించబడి ఉంటుంది. లోపల ఇరవై ఎనిమిది స్తంభాలున్న మందిరం ఉంది. ద్వారం కుడివైపున బోధిసత్వుని భక్తులు "ఎనిమిది భయాల" నుండి విముక్తి కోసం ప్రార్థిస్తున్న దృశ్యం ఉంది. గవాక్షాలు , ద్వారాల అంచుల్లో ఎంతో శిల్పకళా నైపుణ్యంతో చెక్కబడిన ప్రతిమలు వున్నాయి. ఒక పిచ్చి పట్టిన ఏనుగు బారి నుండి స్త్రీ, పురుషులిద్దరు పారిపోతూ ఉన్న దృశ్యం, ఒక స్త్రీ చెట్టు కొమ్మకు ఆనుకొని ఉన్నప్పుడు దగ్గరలో ఒక కుందేలు ఆడుతున్న దృశ్యం, ఒక సౌందర్యవతి చూసి మోహితుడైన పురుషుడు అయోమయంగా చూస్తున్న దృశ్యం చెక్కబడి ఉన్నాయి. మందిరంలో 28 స్తంభాలు ఒక చతురస్ర ఆకృతిలో ఏర్పాటుచేయబడ్డాయి, ఇవి వరండాలో ఉన్న స్తంభాలకు సమానంగా ఉంటాయి. మందిరం మూడు వైపులా అనేక గదులు చెక్కబడ్డాయి. మందిరానికి ఒక ప్రధాన ద్వారం మరియు రెండు పక్క ద్వారాలు ఉన్నాయి, వాటి మధ్య వెడల్పైన కిటికీలు ఉన్నాయి. మధ్య ద్వారం చుట్టూ ఎగిరుతూన్న దేవతా రూపాలు, బుద్ధుని చిత్రాలు, చెట్లను పట్టుకున్న యువతులు మొదలైన చిత్రాలు ఉంటాయి.
కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత, 5 వ గుహ ప్రవేశ ద్వారం రెండు వైపులా సాలభంజికల విగ్రహాలు కనిపిస్తాయి.
అజంతాలో రెండు అంతస్తుల విహారంగా (two-storeyed Vihara). ఉన్న ఏకైక గుహ 6 వ గుహ. దీన్ని గృహ నిర్మాణ శైలిలో (domestic architecture) నిర్మించారు. అలాగే ఇందులో వివిధ భంగిమల్లో ఉన్న అనేక బుద్ధ విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి.
ఇతర గుహలతో పోల్చితే వేరుగా, ప్రత్యేక శైలితో ఉన్న గుహ 7 వది. దీని నిర్మాణ నమూనా, స్తంభాల ఆకారం వేరుగా
ఉంది.
8 వ గుహ లో విద్యుత్ వెలుగుల ఏర్పాట్లు చేయబడ్డాయి.
9 మరియు 10 గుహలు మొదటి దశలో నిర్మించబడిన రెండు చైత్యగృహాలు.
కానీ రెండవ దశ చివర్లో, ఇవి మళ్లీ మార్పులు లేదా పునర్నిర్మాణం జరుగుతున్న సమయంలో అసంపూర్తిగా మిగిలిపోయాయి.
10వ గుహ బహుశా క్రీపూ 1వ శతాబ్దంలో, 9వది దాని కంటే సుమారు వంద సంవత్సరాల తరువాత నిర్మించబడిందని భావిస్తున్నారు. చిన్నచిన్న “శ్రైన్‌లెట్లు”(మినీ విహారాలు) (shrinelets) గా పిలువబడే 9A నుండి 9D మరియు 10Aగుహలు రెండవ దశలో భక్తులు వ్యక్తిగతంగా నిర్మించినవని భావిస్తున్నారు.
11వ గుహలో కొద్ది చిత్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇది వాస్తవానికి ఐదవ శతాబ్దం ఆరంభం లో గానీ, అంతకంటే ముందుగానీ ప్రారంభమైన నిర్మాణమైన తొలి కట్టడం. ఇక్కడొక మండపం ఉంది. దీన్ని చేరుకోవడానికి మెట్లు ఉన్నాయి. మండపంలో ఉన్న స్తంభాలు కింద నుంచి పైకి వెళ్లే కొద్దీ ఆకారం మారుతూ, అందంగా అలంకరించబడ్డాయి.
చివరలో రెండు గదులు ఉన్నాయి, వీటిలో బయటి గదులు కూలిపోయాయి.
మండపం పైకప్పు నాలుగు స్తంభాలపై ఆధారపడి ఉంది, వీటి అడుగుభాగం ఎంతగానో తీర్చిదిద్దారు. అష్టభుజాకారంలో ఉన్న ఈ స్తంభాల పైభాగపు తలాలు తామరరేకుల ఆకారంలో ఉన్నాయి. వెనుక మరియు ఎడమ గోడలలో మూడు గదులు ఉన్నాయి, ఈ గుహలో బుద్ధుడు బోధనా భంగిమలో ఉన్న విగ్రహం ఉంది. అసంపూర్ణ నిర్మాణం తో ఉంది.
12 వ గుహలో థేరవాద(హీనయాన) విహారం ఉంది. గుహకు మూడు వైపులా బౌద్ధ భిక్షువుల నివాసాలున్నాయి. ఇందులో ఇప్పటి విపాసనా కేంద్రాలలో ఉన్నట్లు, ఆరోజుల్లో వారు పండుకోవడానికి రాతి మంచాలు కూడా ఉన్నాయి.
13 వ గుహను భారత పురాతత్వ శాఖ (Indian Archaeological Department) తమ నిల్వగా (స్టోర్‌గా) ఉపయోగిస్తోంది.
18వ గుహ అజంతాలోని చిన్న గుహలలో ఒకటి. ఇక్కడ ఒక నీటి తొట్టె (ట్యాంక్) ఏర్పాటుచేయబడి ఉంది.
బౌద్ధం అంతిమ దశలో ఉన్నప్పుడు నిర్మించినది 19 వ గుహ. ఇది మహాయానానికి సంబంధించినది. ఈ గుహ ముఖభాగం ఎంతో అందంగా చెక్కబడి ఉంది, అందులో పెద్ద పెద్ద బుద్ధ విగ్రహాలు ఉన్నాయి.దాని పైభాగంలో ఉన్న పెద్ద అర్చ్ ఆ గుహకు మరింత గంభీరతను ఇస్తుంది.
అద్భుతంగా చెక్కిన ఈ ప్రార్థనా మందిరం బౌద్ధ కళ కు ఉత్తమ ఉదాహరణగా నిలుస్తుంది. ఇందులో రాతితో చేసిన అనేక విగ్రహాలు ఉన్నందున, దీన్ని “శిల్పుల రత్నభాండాగారం” (sculptor’s treasure chest) అని అంటారు.
20వ గుహ కూడా ఒక ఉత్తమ కళాత్మక నిర్మాణానికి ఉదాహరణ.ఇక్కడి మెట్లు అందంగా చెక్కిన బలస్ట్రేడ్ (రైలింగ్) తో ఉంటాయి. వరాండా లోని స్తంభాల తలభాగాలపై ఆకర్షణీయమైన స్త్రీ ప్రతిమలు చెక్కబడి ఉన్నాయి.
21వ గుహను సభామండపం (Audience Hall)గా పరిగణిస్తారు.
వేదికలో అందమైన శిల్పాలు చెక్కబడి ఉండగా, లోపల కొన్ని మంచి చిత్రాలు కూడా కనిపిస్తాయి.
24 లో గుహ అజంతాలోని రెండవ అతిపెద్ద గుహ. ఈ గుహ పూర్తిగా పూర్తైయి ఉండి ఉంటే, అది ఇక్కడి అత్యంత అద్భుతమైన గుహల్లో ఒకటిగా ఉండేది.
వేదిక స్తంభాల కపోతాల ఆకారపు మథనాలు (bracket capitals) మరియు తలుపు పైన ఉన్న లింటెల్ మీద అందమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి.
26 వ గుహ 19వ గుహ లాగే శిల్పాలతో నిండి ఉంది ఇది కూడా చాలా పెద్ద చైత్య గుహ. ఇందులో ఇది పరినిర్వాణ దేశంలో ఉన్న బుద్ధుని విగ్రహం ఉంది, ఆ విగ్రహం చుట్టూ రాజులు, రాణులు మరియు భిక్షువుల సమూహాలు ఉంటాయి.
అదే గోడపై బుద్ధుని పరీక్ష (Temptation of the Buddha) అనే శిల్పచిత్రం ఉంది.
ఈ విషయం 1వగుహలోని గోడచిత్రాలలో కూడా కనిపిస్తుంది — ఎడమవైపు మార (Mara) ఏనుగుపై కూర్చొని, తన దెయ్యాల గుంపుతో గౌతముడి పై దాడి చేస్తున్నట్లుగా ఉంది . కుడి వైపు మారుడు పరాజయంతో వెనక్కి తగ్గడం చూపించబడింది.
ముందుభాగంలో, మార కుమార్తెలు బుద్ధుని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న దృశ్యం చెక్కబడి ఉంది.
గర్భగుడిలో బుద్ధుని విగ్రహం ఉపదేశ భంగిమలో అంతర్గృహ గోడలపై భారీగా నిలబడి ఉన్న ఆరు బుద్ధ చిత్రాలు ఉన్నాయి, వాటిలో రెండూ పూర్తిగా పూర్తి కాలేదు. వీరిలో బుద్ధుని కుడి చేయి అభయముద్రలో ఉండగా, ఎడమ చేయి వస్త్రపు అంచును పట్టుకొని ఉంటుంది. గుహ మొత్తం ఒకప్పుడు రంగులతో అలంకరించబడింది, దాని అవశేషాలు ఇప్పటికీ కనిపిస్తాయి.
మందిరపు పైకప్పులో లావా ప్రవాహం (lava flow) వల్ల ఏర్పడిన ఒక ప్రత్యేక భౌగోళిక లక్షణం ఇప్పటికీ సురక్షితంగా ఉంది.
16వగుహలో “డైయింగ్ ప్రిన్సెస్” చిత్రం ప్రసిద్ధి. కన్నీరు రాల్చే కన్నులు, అణుకువ భంగిమ, జీవనవేదన — ఈ చిత్రంలో మానవ భావాల సున్నితత్వం అజంతా కళాకారుల ప్రతిభను తెలిపింది.
17వగుహలో జాతక కథల పరంపర కనిపిస్తుంది. ఇక్కడ “ బుద్ధుని సన్నిధిలో మాతాశిశువులు” చిత్రం బౌద్ధ కరుణాతత్వానికి ప్రతీక. బుద్ధుడు రాహులుడిని దర్శించే దృశ్యం మానవ ప్రేమ, త్యాగం, ఆధ్యాత్మికతను ఒకే స్రవంతిలో చూపుతుంది.
19, 26గుహలు చైత్యాలు అంటే ప్రార్థన మందిరాలు. ఇక్కడ స్తూపాల ముందు బుద్ధుని శిల్పాలు ఉన్నాయి. 26వగుహ లోని “పరినిర్వాణ బుద్ధుడు” — బుద్ధుని చివరి క్షణాల్లోని ప్రశాంతతను ప్రతిబింబించే అపూర్వ శిల్పం. అది మనిషి నశ్వర దేహానికి మించి ఉన్న శాశ్వత ధర్మాన్ని సూచిస్తుంది.
సాంస్కృతిక ప్రభావం మరియు కళా సౌందర్యం
27, 28, 29, 30 గుహలు చాలా వరకు అసంపూర్తిగా ఉన్న గుహలు. వీటిని పూర్తి చేయలేదు.
అజంతా చిత్రాలు మానవ జీవితాన్ని బౌద్ధ దృష్టితో చూశాయి. మహిళా రూపాలు ఇక్కడ కళాత్మకంగా, కరుణతో నిండిన సౌందర్య ప్రతీకలుగా నిలిచాయి. అప్సరసలు, గంధర్వులు, సంగీతకారులు, నర్తకులు — ఇవన్నీ కేవలం అలంకారాలు కాదు; అవి బౌద్ధ ధర్మంలో కళ–ఆనందం–ధ్యానంల సమన్వయాన్ని సూచిస్తాయి.
ఈ చిత్రాల్లో దుస్తులు, నగలు, వస్త్రాల మృదుత్వం, ముఖ కవళికల చైతన్యం, కదలికల సౌందర్యం — ఇవన్నీ మనకు ఆ కాలపు సామాజిక జీవనాన్ని చూపిస్తాయి. ఆ గోడలపై బౌద్ధ ధర్మం మాత్రమే కాదు, మానవ జీవితపు మొత్తం వైభవం ఆవిష్కృతమైంది.
ఎల్లోరా గుహలు
అజంతా తర్వాత ఎల్లోరాలో బౌద్ధ, హిందూ, జైన గుహలు ఒకే చోట చెక్కబడ్డాయి. ఇది భారత సాంస్కృతిక సమన్వయానికి ప్రతీక. ఎల్లోరాలోని విశ్వకర్మ గుహ అజంతా శైలికి సహజ కొనసాగింపుగా ఉంది. అజంతా కళలోని శిల్పకళ, చైత్యాల గంభీరత, విహారాల సమతుల్య నిర్మాణం ఎల్లోరాలోనూ ప్రతిధ్వనిస్తుంది.
అజంతా గుహలు భారతీయ కళ, తత్వం, ఆధ్యాత్మికతల సమ్మేళనం. ఇవి కేవలం బౌద్ధ కళా కట్టడాలు కావు — ఇవి మానవ ఆత్మ యొక్క కరుణామయ ప్రతిరూపాలు. ప్రతి చిత్రం ఒక ధర్మోపదేశం, ప్రతి శిల్పం ఒక జ్ఞానదీపం, ప్రతి గోడ ఒక ధ్యాన స్తూపం.
అజంతా మనకు నేర్పే ప్రధాన సత్యం ఏమిటంటే — కళ ధర్మానికి రూపం. ధర్మం మానవత్వానికి ఆత్మ.
బుద్ధుని కరుణ, జ్ఞానం, త్యాగం, అనిత్యత — ఇవన్నీ అజంతా గోడలపై శాశ్వతంగా చిత్రించబడ్డాయి.
ప్రతి గీత, ప్రతి వర్ణం, ప్రతి కాంతి నెరె మనసును శాంతితో నింపుతుంది.
అజంతా గుహల గోడలు మనకు మౌనంగా చెబుతున్న సందేశం —
“కళ ద్వారా ధర్మం వ్యక్తమవుతుంది; ధర్మం ద్వారా మానవతా సౌందర్యం వికసిస్తుంది.”
___ పిళ్లా కుమారస్వామి,9490122229
Comments
Post a Comment