బౌద్ధ ధర్మాన్ని ఎలుగెత్తి చాటిన *కొడవలి*
బౌద్ధ ధర్మాన్ని ఎలుగెత్తి చాటిన *కొడవలి*
కొడవలి అనగానే పంటకోసే పనిముట్టు గుర్తుకొస్తుంది. కానీ ఈ కొడవలి ఒక పురాతన బౌద్ధ క్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండల కేంద్రానికి 15 కి. మీ. దూరంలో, పిఠాపురం నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.
కొడవలి బౌద్ధ స్థూపం ప్రాచీన భారత బౌద్ధ సంస్కృతి, చరిత్రకు ఒక అపూర్వ ఉదాహరణ. ఈ స్థూపం సామ్రాట్ అశోకుని కాలమైన క్రీ.పూ. 3-2 శతాబ్దాలకు చెందింది. ఇది బౌద్ధ ధర్మ ప్రచారానికి, ప్రాచీన భారత పురావస్తు సంపదకు అద్భుతమైన సాక్ష్యంగా ఉంది.
కత్తిపూడి-రాజమండ్రి జాతీయ రహదారి సమీపంలో, కొడవలి జంక్షన్ నుండి 3 కి.మీ. దూరంలో ఇది ఉంది. ఇదొక మహాస్థూపం. దీని చుట్టుకొలత 12 మీ. దీన్ని తెల్లని సున్నపు రాయితో నిర్మించారు.1880లో పురావస్తు శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. ఈ స్థూపంలోని రాతి కట్టడాల్లో బ్రాహ్మి లిపిలో శాసనాలు ఉన్నాయి. ఇందులో శాతవాహన రాజు వశిష్టపుత్ర శిరి చందసాత గురించి ప్రస్తావన ఉంది. ఈ శాసనం బౌద్ధ ధర్మానికి ఆ రాజు చేసిన ప్రోత్సాహాన్ని సూచిస్తోంది. 2008-2011 మధ్య కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ తవ్వకాలు జరిపారు. బుద్ధుని ధాతువులతో కూడిన ధాతు కరండం లభించింది.
దీని చుట్టుపక్కల ఉన్న కొండల్లో కూడా చిన్న పెద్ద బౌద్ధ నిర్మాణ అవశేషాలు ఉన్నాయంటే, ఈ ప్రాంతం బౌద్ధ సాంప్రదాయానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని స్పష్టమవుతోంది. ఇది కేవలం పురావస్తు సంపద మాత్రమే కాకుండా, బౌద్ధ ధర్మ ప్రచారం జరిగిన ప్రదేశంగా కూడా ప్రత్యేక స్థానం కలిగిఉంది.
కొడవలి బౌద్ధ స్థూపం ఒక గుండ్రటి ఆకారంలో ఉండే పవిత్ర స్మారక చిహ్నం, ఇది ముఖ్యంగా బుద్ధుని ధాతువులను (భౌతిక అవశేషాలు) లేదా పవిత్ర వస్తువులను నిల్వచేసేందుకు నిర్మించబడేది. ఇది 25×25 మీటర్ల వేదికపై నిర్మించబడింది. దీన్ని సామ్రాట్ అశోకుని పాలనలో క్రీ.పూ. 3-2 శతాబ్దాలలో నిర్మించారు.12 మీటర్ల వ్యాసంతో వలయాకారంలో తెల్లని సున్నపు రాయితో నిర్మించారు.తూర్పుదిశలో రాతి మెట్లు ఉన్నాయి.
ఈ స్థూపంలో ప్రధానంగా కనిపించే నిర్మాణ భాగాలు: 1.హర్మిక (Harmika) – స్థూపం పైభాగంలో ఉండే ఒక చిన్న కంచె ఆకారపు నిర్మాణం ఉంది.ఇది ఆకాశాన్ని సూచిస్తూ, స్థూపాన్ని దేవతామయమైన స్థలంగా గుర్తించేందుకు ఉపయోగిస్తారు. 2.ఛత్రము (Chatra) –హర్మిక మీద ఉండే గొడుగు ఆకారపు నిర్మాణం ఉంది.ఇది బుద్ధుని కరుణను, అహింసను, బోధిని సూచిస్తుంది. అవి బుద్ధుడు బోధించిన త్రిరత్నాలను (బుద్ధ, ధర్మ, సంగ) సూచిస్తాయి.3.ధాతుగర్భం (Dhatu Garbha) – స్థూపం గుండ్రటి భాగం, దీనిని అండభాగం (Anda) అని కూడా అంటారు. ఇందులో బుద్ధుని అవశేషాలు (ధాతువులు) లేదా పవిత్రంగా భావించే వస్తువులు ఉంటాయి. ఇది స్థూపంలో అత్యంత పవిత్రమైన భాగం. తవ్వకాలలో చిధ్రమైన ధాతు కరండం (ధాతువులను భద్రపరిచే పాత్ర) లభించింది.4.ప్రదక్షిణా మార్గం (Pradakshina Patha) – స్థూపం చుట్టూ ఉండే ఫుట్‌పాత్ లేదా మార్గం. భక్తులు ఇందులో ప్రదక్షిణలు చేస్తారు, అంటే, కుడివైపునుంచి (సూర్యుడి దిశలో) స్థూపాన్ని చుట్టూ తిరుగుతూ ప్రార్థనలు చేస్తారు.
ఈ నిర్మాణ లక్షణాలు బౌద్ధ శిల్పకళా వైభవాన్ని కూడా చూపుతాయి.
మహా స్థూపం నుండి తూర్పు దిక్కున
చైత్యహాల్ (సభామందిరం) 20×20 మీటర్ల విస్తీర్ణంలో 16 రాతి స్తంభాలతో నిర్మించబడింది.దీనిని
భిక్షువుల ధ్యానం, సమావేశాలు, వర్షావాసం కోసం ఉపయోగించేవారు. ఈ హాలుకు మూడు వైపులా (తూర్పు, ఉత్తరం, దక్షిణం) 13 గదులు ఉన్నాయి.
ఒక్కో గది 6×4 మీటర్ల విస్తీర్ణంతో ఉంది. వీటికి ప్రత్యేక శౌచాలయం కూడా నిర్మించారు.
ప్రతి గది ద్వారం మహాస్థూపం వైపుకు తెరుచుకునేలా రూపొందించారు. ఇక్కడి శాసనాల ఆధారంగా వీటిని క్రీస్తు శకం 210 డిసెంబర్ నెలలో నిర్మించినట్లు తెలుస్తోంది.
చైత్యహాల్ కు పడమర వైపు 5 పారిభోజిక స్థూపాలు ఉన్నాయి . వీటిని ప్రముఖ భిక్షువుల ధాతువులపై నిర్మించారు. అక్కడే 3 ఉద్దేశిక స్థూపాలు ఉన్నాయి . వీటిని ఉపాసకుల జ్ఞాపకార్థం నిర్మించారు.
స్థూపానికి దక్షిణ దిశలో నాలుగు రాళ్లతో నిర్మించిన బావులు ఉన్నాయి.ఇవి భిక్షువుల నీటి అవసరాల కోసం నిర్మించారు. ఒక పెద్ద బావిలో రాతి గోడలపై బ్రాహ్మి శాసనం ఉంది. దగ్గర లో 80 ఎకరాల చెరువు కూడా ఉంది. ఇది భిక్షువుల నీటి అవసరాలు తీర్చేది. చెరువు నుండి కత్తిపూడి వరకు
8 అడుగుల వెడల్పున్న పురాతన రహదారి ఇప్పటికీ ఉంది.
"కొడవలి" అనే పేరు ఖడ్గవల్లుడు (క్రీ.శ. 7వ శతాబ్దం) అనే యోధుని ద్వారా వచ్చింది.ఇతను
బౌద్ధ ధర్మాన్ని రక్షించిన వీరుడు. స్థూపం పై వీరశైవులు దాడి చేసినప్పుడు వారిని అడ్డుకున్నాడు. వారితో పోరాడి స్థూపాన్ని రక్షించాడు. తర్వాత కాలంలో స్థూపం ధ్వంసమైంది.
దాంతో మొదట ఈ గ్రామాన్ని ఖడ్వలి అన్నారు. తరువాత కాలంలో కొడవలి అయింది.
కొడవలి గ్రామం బౌద్ధ ధర్మానికి మద్దతుగా నిలిచింది.
మరొక కథనం ప్రకారం శాతవాహనుల కాలంలో ఆనాటి కొడవలిసిరి అనే పేరు గల రాణి ఈ స్థూపాన్ని ఆధునీకరించి 600 ఎకరాల భూమిని దానం ఇచ్చినట్లు ఒక శాసనంలో ఉంది. ఈ శాసనాన్ని రాతిబావి పైన చెక్కించారు. ఆమె పేరు మీదే ఈ గ్రామం కొడవలిగా మారిందని కొందరి అభిప్రాయం.నేడు 400 ఎకరాల "సేరిభూములు" ఉన్నాయి . ఇవన్నీ గతంలో బౌద్ధ స్థూపాలకు విరాళంగా ఇచ్చినవి.
ఏలూరు జిల్లాలో ఉన్న మహా నాగపర్వతం గుర్రపు నాడా కృతి(ఇంగ్లీషు అక్షరం యు ఆకారం)లో ఉంది. ఇది ఒక పెద్ద బౌద్ధారామం.ఇచట ఉన్న తురకల కొండ, వీరల కొండ లపై బౌద్ధ నిర్మాణాలు ఉన్నాయి. వీటిని కొడవలితో కలుపుకుని చూస్తే ఈ మూడు పర్వతాలు యు ఆకారం లో ఉంటాయి. ఆ రకంగా నలంద బౌద్ధ విహారం తర్వాత, కొడవలి రెండవ అతిపెద్ద బౌద్ధారామంగా అంతర్జాతీయ గుర్తింపు పొందే అవకాశం ఉంది.
కొడవలి అష్టాంగమార్గం బోధించి, బౌద్ధ సన్యాసులను తీర్చిదిద్దిన ప్రదేశంగా చరిత్ర చెబుతోంది. చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు స్వయంగా స్థూపాలను నిర్మించుకోవడం ఈ ప్రాంత బౌద్ధ వారసత్వాన్ని తెలియజేస్తుంది.
1958లో పురావస్తు శాఖ కొడవలిని రక్షిత స్థలంగా గుర్తించింది. 2008-2011లో తవ్వకాలు జరిగినప్పటికీ తగిన సంరక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.తురకల కొండ, వీరల కొండపై 17 మైనింగ్ కంపెనీలు అనుమతి పొందినట్లు సమాచారం. ఈ స్థూపం ఉన్న సర్వే నంబర్ 133/1లో 2021లో మైనింగ్ అనుమతులు మంజూరయ్యాయి. అయితే దీనిపై
స్థానికులు కోర్టుకు వెళ్లి నిలిపివేశారు.మైనింగ్ ముప్పు, ప్రభుత్వాల నిర్లక్ష్యం దీని భవిష్యత్తును ప్రశ్నార్థకంగా నిలిపుతున్నాయి. పురావస్తు శాఖ ప్రత్యేకంగా సంరక్షణ చర్యలు తీసుకోవాలి. కొడవలిని అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి.భారతదేశ చరిత్ర, సంస్కృతిని కాపాడే బాధ్యత ప్రభుత్వాలు, ప్రజలు, చరిత్రస్నేహితులందరికీ ఉంది. కొడవలి బౌద్ధ మహాక్షేత్రం లాంటి విలువైన వారసత్వాన్ని స్వలాభం కోసం మైనింగ్ మాఫియాకు అర్పించడం అనాగరిక చర్య.
ఈ స్థూపానికి గల ప్రాముఖ్యతను గుర్తించి, భారత తపాలా శాఖ 2022 మే 25న ఒక ప్రత్యేక తపాలా కవర్‌ను విడుదల చేసింది.
కొడవలి బౌద్ధ సంపదను వెలికితీయాలి. మ్యూజియంలా అభివృద్ధి చేయాలి.
✔ ప్రాచీన గుహారామాలు, స్థూపాలు, చైత్యాలు, విహారాలు కనుగొని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి.
✔ శాస్త్రీయ తవ్వకాలు చేసి, పురావస్తు శాఖ బౌద్ధ సంపదను రక్షించాలి.
✔ బౌద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే – స్థానికులకు ఉపాధి, దేశానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది.
కత్తిపూడి బౌద్ధ స్థూపాలు (ఎర్రదిబ్బ, వల్ల దిబ్బ),
తిమ్మాపురం బౌద్ధ స్థూపం.ప్రత్తిపాడు మండలం లోని పి. జగన్నాథపురం (భూతాల గుహలు, మూడు స్థూపాలు, వజ్రకూటం)ను,పెద్దనాపల్లి, గెద్దనాపల్లి – స్థూప, చైత్య సముదాయాలను అభివృద్ధి చేసి తగిన ప్రచారం కల్పించాలి.
అమరావతి, నాగార్జునకొండ, కొడవలి, గుంటుపల్లి లను బౌద్ధ పర్యాటక సర్క్యూట్ గా ఏర్పాటు చేయాలి. ప్రత్యేక నిధులు మంజూరు చేసి, UNESCO వారసత్వ ప్రదేశంగా గుర్తింపుపొందేలా చర్యలు తీసుకోవాలి.కొడవలి బౌద్ధ స్థూపం, మన పురాతన వారసత్వానికి నిదర్శనంగా నిలిచే అపూర్వ సంపద. దీని రక్షణ, ప్రచారానికి ప్రభుత్వం, పురావస్తు శాఖ, ఇతర బౌద్ధ సంస్థలు, ఇంటాక్ కలిసి కృషి చేయాలి. ఈ స్థూపం భవిష్యత్ తరాలకు ఒక విలువైన వారసత్వంగా నిలిచేలా మనందరం కలిసి పరిరక్షించాలి.
స్థానికులు, పర్యాటకులు సహకరించి ఈ ప్రదేశాన్ని మరింత అభివృద్ధి చేయగలిగితే బౌద్ధ వారసత్వం భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంటుంది.
__ పిళ్లా కుమారస్వామి,9490122229
ఆధారం:
1.కొడవలి బౌద్ధ స్థూప చరిత్ర_ పిల్లి రాంబాబు
2. వికీపీడియా
3.ది హిందూ దినపత్రిక
Comments
Post a Comment