రాగద్వేషాలను అధిగమించకుండా మనుషుల్లో సమిష్టితత్వం పెరగదు
రాగద్వేషాలను అధిగమించకుండా మనుషుల్లో సమిష్టితత్వం పెరగదు
బాలగోపాల్ మార్క్సిస్టు సిద్ధాంతానికి అదనపు చేర్పుగా ఫ్రాయిడ్ మనస్తత్వశాస్త్ర సిద్ధాంతాన్ని జోడించాలని ప్రతిపాదించాడు తన 'మనిషి మార్క్సిజం' వ్యాసంలో. మానవ ప్రవృత్తికి బయట ప్రపంచానికి మధ్యనున్న ఘర్షణకు ఫ్రాయిడ్ మనస్తత్వశాస్త్ర సిద్ధాంతంలో కేంద్ర స్థానం ఉంది. మనిషి వ్యక్తిత్వ వికాసానికి వైఫల్యానికి ఈ ఘర్షణే మూలమని ఫ్రాయిడ్ అభిప్రాయం. సమాజిక వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడల్లా మనిషి ప్రవర్తనలో కూడా దానికి తగినట్లుగా మార్పు అనివార్యంగా వస్తుందని , దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించనవసరం లేదని గతితార్కిక భౌతిక వాదం చెప్తుందని, ఇది నిజం కాదని బాలగోపాల్ వాదిస్తాడు. దీన్ని సాహిత్యకారులు తప్పకుండా గుర్తించి ఉంటారని ఆయన భావిస్తాడు. రాగో నవల మీద వ్యాఖ్యానిస్తూ ఈ విషయాలను చెప్తాడు ప్రస్తావించాడు.
రాగో స్త్రీలను స్త్రీల వ్యక్తిత్వాలను కించపరిచే ఆచారాలు పట్ల వ్యతిరేకంగా తమకు అందుబాటులో ఉన్న ఉద్యమాలకు వస్తుంది. ఆ ఉద్యమాలు పరిమితమైనవి. కానీ ఆ ఉద్యమాల లక్ష్యం మాత్రం అపరిమితం కాకపోతే కమ్యూనిస్టు ఉద్యమాలు లేదా ఆదర్శల పట్ల విశ్వాసం బలపడి ఆ ఉద్యమంలోనే కొనసాగే అవకాశం ఉంది. ఇలా వచ్చిన వాళ్ళు కమ్యూనిస్టు ఉద్యమంలోనే ఎందుకు కొనసాగ లేకపోతున్నారు మధ్యలో ఆ ఉద్యమం నుంచి వాళ్ళు ఎందుకు తప్పుకుంటున్నారు? దీన్ని వైఫల్యంగా గుర్తించడమే గాక ఆ వైఫల్యం ఎక్కడుందో సరిగ్గా గుర్తిస్తున్నారా లేదా అని ప్రశ్నిస్తాడు బాలగోపాల్. అట్టడుగు వర్గాల కోసం పనిచేసిన కమ్యూనిస్టు పార్టీలు ఆ వర్గాలకు కూలినట్లు పెరిగేందుకు వారికి భూమిని దొరికేటందుకు వారి పట్ల సమాజంలో ఉన్న వివక్షను తొలగించేటందుకు పోరాడాక వాటిని ఆ వర్గం అధిగమించాక వారంతా కమ్యూనిస్టులను కాదని ఇతర ఏ తెలుగుదేశం కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల వైపు అలాగే బాబాలవైపు సినిమాలు వైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారని బాలగోపాల్ ప్రశ్నిస్తాడు? దీని గురించి మరింత లోతుగా విశ్లేషించాలని ఆయన కోరినాడు. మానవ ప్రవృత్తికి తాత్వికతకు మధ్య ఉన్న అవగాహన, అవినాభావ సంబంధాన్ని సరిగ్గా గుర్తించనంత కాలం ఈ విషయం మనకు అర్థం కాదని ఆయన తేటతెల్లం చేస్తాడు.
తమకు కనీస హక్కులు కావాలని తక్షణ పీడన తొలగిపోవాలని ప్రతి మానవుడి సహజ లక్షణం అయితే సమాజాన్ని మొత్తం విముక్తం చేయాలన్నది రాజకీయ విలువగా ఉన్నప్పుడు అది సామాజిక చైతన్యంలో ఓ ప్రధానమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఈ సామాజిక చైతన్యమే ఉద్యమాలను పోరాటాలను ముందుకు తీసుకెళ్తాయి ఈ చైతన్యం గరిష్ట స్థాయికి చేరినప్పుడు విముక్తి సాధ్యమవుతుంది. ఈ చైతన్యం ఏ ఒక్క వర్గానికో ఉంటుందని భావించడం భ్రమవుతుందని చెప్తాడు బాలగోపాల్. మానవ ప్రవృత్తిని అధిగమించే విధంగా కొన్ని వర్గాల ప్రవృత్తి ఉంటుందని భావించడం కూడా ఒక భ్రమవుతుందని మన గుర్తు చేస్తాడు. సమ సమాజం అన్నది కొన్ని వర్గాలలో అనివార్యంగా పుట్టే అసంకల్పితమైన ఆకాంక్షగా అర్థం చేసుకోవడం మార్క్సిజం మొరటుపారడానికి అనేక కారణాల్లో ఒకటిగా చెప్తాడు బాలగోపాల్ సమ సమాజాన్ని సమాజంలోని వ్యక్తుల పరిణితితో చారిత్రకంగా ముడిపడి ఉన్న చైతన్యవంతమైన ఆకాంక్షగా నిర్వచిస్తాడు బాలగోపాల్.
కార్మిక వర్గం శ్రమదోపిడి నుంచి పూర్తి సాధించాలంటే మొత్తంగా సమాజాన్ని విముక్తి చేయాలని మార్క్స్ భావించాడు. కానీ మొత్తంగా శ్రమదోపిడి నుండి విముక్తం అయ్యేంతవరకు కమ్యూనిస్టు ఉద్యమాన్ని కార్మిక వర్గం అంటిపెట్టుకొని ఉండడం లేదు. తమపై జరుగుతున్న దోపిడీని భరించదగ్గ స్థాయికి చేరుకున్నాక కార్మిక వర్గంలోని ఒక్కొక్క విభాగం దూరం అవుతూ వస్తోంది కొందరు మాత్రమే మిగులుతున్నారు.
అణచివేతకు గురయ్యే వారు తమకు సమానత్వం కావాలని కోరుకుంటారు కానీ అందరికీ సమానత్వం కావాలని కోరుకుంటారని నమ్మకం ఏమీ లేదు అలాగే ఇతరుల సమానత్వ ఆకాంక్షను కొంచెం సులభంగా అర్థం చేసుకుంటున్నారన్న గ్యారెంటీ కూడా లేదు. ఎందుకంటే అది చైతన్యవంతంగా ఎంచుకునే రాజకీయ విలువ తప్ప ఒకరి వర్గ స్వభావం కాదు. అందువల్లనే పేదమగవాళ్లు తమ భార్యలను హింసించే అవకాశం ఉంది. కార్మికులు హిందూత్వ భావజాలంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఆదివాసులు మాలమాదిగలను అంటరాని వారిగా చూసే అవకాశం ఉంది. దళితులు హిందూత్వలో భాగస్వాములు అయ్యే అవకాశం ఉంది. వీరంతా తమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పటికీ తగినంత చైతన్యం లేకపోవడం వల్ల వీరు పైన చెప్పిన విధంగా చేసినా మనం ఏమి ఆశ్చర్యపోనక్కర్లేదు.
పేదవాళ్లంతా మంచివాళ్లు ధనికులు దుర్మార్గులు అనే సెంటిమెంట్ భావన సరైంది కాదు. అలాగే కమ్యూనిస్టు పార్టీలో ఉండేవాళ్లంతా మంచివాళ్లు ఇతర పెట్టుబడిదారీ పార్టీలో ఉన్న వాళ్లంతా చెడ్డవాళ్ళు అనే సెంటిమెంట్ భావన సరైంది కాదు. కమ్యూనిస్టు పార్టీలో ఉండే వాళ్లు కూడా అనేక మూఢనమ్మకాలతోనూ దోపిడీ భావజాలంతోనూ ఉండి ఉండొచ్చు. అలాగే పెట్టుబడిదారీ పార్టీలో ఉన్నవాళ్లు కూడా చాలామంది సోషలిస్ట్ భావాలతో ఉన్న వాళ్ళు కూడా ఉండవచ్చు. ఈ రకమైన సెంటిమెంట్ భావనలను మార్క్స్ తీవ్రంగా వ్యతిరేకించాడు. ప్రౌడాన్ వంటి వాళ్లను ఈ కారణంగానే గట్టిగా విమర్శించాడు.
దీన్నిబట్టి మనకు అర్థమయ్యేది ఏమంటే సమ సమాజాన్ని కాంక్షించబోయేది దాన్ని తీసుకురావడానికి కృషి చేసేది చైతన్యవంతమైన వ్యక్తులే తప్ప కార్మికులుగా ఆదివాసులుగా స్త్రీలుగా దళితులుగా కాదు. కానీ వీరంతా ఆ చైతన్యవంతమైన వ్యక్తుల వెనుక తమ ఆర్థిక సామాజిక అణిచివేతకు వ్యతిరేకంగా నిలబడతారు. ఈ చైతన్యమైన వ్యక్తులు చైతన్యాన్ని ఎలా పొందుతారు అన్నదే ప్రశ్న.
ఈ చైతన్యం పొందాలంటే మనుషులలో జరిగే అణచివేతకు వ్యతిరేకంగా పోరాటంతో పాటు సమిష్టితత్వం, సహజీవన సంస్కృతి పెరగాలి. ఇందులో మొదటిది సాధిస్తే సరిపోదు. రెండోది దానంతట అది సాధ్యం కాదు. రెండోది సాధ్యం కావాలంటే మానవ ప్రవృత్తిలో ఉన్న అనేక రాగద్వేషాలను తొలగించుకోవలసి ఉంటుంది. అందులో ప్రధానమైనది అహంకారం, అసూయ, బంధుప్రీతి,కులప్రీతి మొదలైన అవలక్షణాలను వికారాలను పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి పోగొట్టుకోవాలంటే తగినంత లేదా దీనికి సంబంధించిన తాత్విక అవగాహన ఉండాలి. ఈ తాత్విక అవగాహన కల్పించగలిగేది భౌతిక వాద పునాదులపై ఏర్పడిన తాత్విక భావాలు. అవి బౌద్ధంలో పుష్కలంగా ఉన్నాయి. భౌతికవాద పునాదుల పైన నిర్మించబడిన పంచశీల, అష్టాంగ మార్గాలు అనుసరించడం ద్వారా వాటిని అధిగమించడానికి అలాంటి తాత్విక అవగాహన పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయి.
Comments
Post a Comment