బౌద్ధ తాత్వికచింతన
బౌద్ధ తాత్వికచింతన
ప్రతి వ్యక్తి ఈ ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తాడు.ఈ ప్రపంచం ఎలా వచ్చింది? సృష్టి ఎలా వచ్చింది? సృష్టికర్త ఎవరు? మనిషి మరణించిన తర్వాత ఏమవుతాడు? స్వర్గం నరకం ఉన్నాయా? అదే సమయంలో దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చ నిరంతరం సాగుతూ ఉంటుంది. అయితే బుద్ధుడు వీటి గురించి చర్చించవద్దన్నాడు. ఎంతకు సమాధానం రాని తేలని అంశాలపై చర్చ వద్దన్నాడు.
బుద్ధుడు మౌలికమైన విషయాలను చెప్పినాడు. వాటిల్లో ముఖ్యమైనవి ప్రకృతి చలనం, క్షణిక వాదం, అనాత్మవాదం, కార్యకారణ సంబంధం,శూన్యవాదం, ప్రతీత్య సముద్పాద సూత్రం, ఆచరణ.
విశ్వంలో ప్రతిదీ అశాశ్వతం. శాశ్వతంగా ఉన్నది ఏదీ లేదు. చలనం లేకుండా ఉన్నది ఏదీ లేదు. ప్రకృతి నిరంతరం మారుతూ ఉంటుంది ఇప్పుడున్న ప్రకృతి మరుక్షణంలో మారిపోతూ ఉంటుంది. కాబట్టి మనిషి దుఃఖం శాశ్వతం కాదు. అది కూడా మారుతూ ఉంటుంది. మనిషి కూడా మారుతూ ఉంటాడు. సమాజం మారుతూ ఉంటుంది. దీన్నే క్షణిక వాదం అన్నారు.
"ఆత్మ నాశనం లేనిది. దాన్ని నిప్పు కాల్చలేదు. నీరు తడపదు. కత్తి కోయలేదు. ఆత్మ శాశ్వతమైనది. అది ఏ రూపంలోకి మారదు" అని ఉపనిషత్తులు చెప్పినాయి.
ప్రతిదీ అశాశ్వతమైనప్పుడు ఆత్మ కూడా అశాశ్వతమే కదా! అది కూడా నాశనం కావడమో మారడమో జరగాలి కదా! ప్రతిదీ నిరంతరము మారుతున్నప్పుడు ఆత్మ కూడా మారాలి కదా! మరి ఆత్మ నాశనం లేనిది అని ఎలా చెబుతారు? అందువల్ల ఆత్మే లేదన్నాడు బుద్ధుడు. దీన్నే అనాత్మవాదం అన్నారు.
ప్రతిదీ చలనం లో ఉంటుంది. ఆత్మ ఉందని చెప్పేవారు కూడా కనిపించే ఈ ప్రపంచం చలనశీలమైంది అన్నారు. కానీ ఆ చలనం లోపల శాశ్వతంగా ఉన్నది ఏదో ఒకటి ఉందన్నారు. దానినే బ్రహ్మ అన్నారు. ఆ బ్రహ్మ అంటే ఏమిటి అని ఉపనిషత్కారులు కొంతమంది బ్రహ్మ అంటే అన్నం అన్నారు. అందువల్ల అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఇంకొంతమంది బ్రహ్మ అంటే ఆనందం అన్నారు. అందువల్ల ఆనందోబ్రహ్మ అని కూడా అన్నారు. ఇంకొంతమంది అర్థంకాక ఈ బ్రహ్మ అంటే ఏదో కాదు అది పరమాత్మ అని కూడా అన్నారు. ఆ తర్వాత చాలామందికి అర్థం కాక తలలు బ్రద్దలు కొట్టుకున్నారు. అందువల్ల దాన్ని బ్రహ్మ పదార్థం అన్నారు. బుద్ధుడు మాత్రం మనిషిలో అటువంటిది, అంతర్గతంగా ఉన్నది, ఏదీ లేదని చెప్పినాడు.
అరటిబోదెలో ఒక్కొక్క పొరను తొలగించుకుంటూ పోతే చివరకు ఏమీ ఉండదు అలాగే ఏ వస్తువునైనా విడగొట్టుకుంటూ పోయినా చివరకు ఏమీ ఉండదు. శూన్యం మిగులుతుంది దీన్నే శూన్యవాదం అన్నారు. దీని ఆధారంగానే శంకరుడు మిథ్యా వాదాన్ని ప్రవేశపెట్టాడని కొంతమంది భావించారు.
కార్యాకారణ సంబంధం ప్రకారం ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఒకటి కాదు అనేకం. అనేక కారణాల వలన ఒక కార్యం ఏర్పడుతుంది. ఏ ఒక్క కారణం లోపించినా కార్యం ఫలవంతం కాదు. విత్తనం మొలకెత్తడం గ్రుడ్డు పిల్లగా మారడం గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారడం ఇవన్నీ వీటికి ఉదాహరణలు. కారణం కన్నా కార్యం కొత్తగా ఉంటుంది. దీన్నే పరిమాణాత్మక మార్పు గుణాత్మక మార్పుకు దారి తీస్తుంది అన్నారు
ఆత్మ సత్యం బ్రహ్మసత్యం.అవి మార్పు చెందవు.అంటే శాశ్వతమైనది, చలనం లేనిది, మార్పు లేనిది సత్యం అని భావించారు ఉపనిషత్తు తత్వవేత్తలు . మార్పు చెందేది, చలనం ఉన్నది అసత్యం అన్నారు ఉపనిషత్తు తత్వవేత్తలు. కానీ అశాశ్వతం గా ఉండేది, మార్పు చెందేది సత్యం అంది బౌద్ధం. శాశ్వతంగా ఉండేది, మార్పు లేనిది అసత్యం అంది బౌద్ధం.
సత్యానికి గీటురాయి ఆచరణే అంది బౌద్ధం. భౌతిక కార్యాచరణ ద్వారానే సత్యాన్ని కనుగొనగలమని చెప్పింది బౌద్ధం. అందువలన ఆచరణకు ప్రాధాన్యత నిస్తుంది బౌద్ధం . ఉదాహరణకు రొట్టె లడ్డు మనకు ఆకలని తీరుస్తాయి శక్తినిస్తాయి ఇవే కలలో కనిపిస్తే అవి ఎలాంటి ఆకలిని శక్తిని తీర్చవు అందువల్ల భౌతికంగా ఉండి ఆచరణకు ఉపయోగపడేదే సత్యం అన్నారు బౌద్ధులు. ఉపనిషత్తుల దృష్టిలో ఇవన్నీ అసత్యం. ఉపనిషత్తులు చెప్పిందేమంటే బ్రహ్మను ప్రత్యక్ష కార్యాచరణ ద్వారా చూడలేం. బుద్ధితో పరోక్షంగా కూడా నిరూపించలేమని.
ఆచరణే సత్యానికి గీటురాయి. నేడు సైన్స్ కూడా ఇదే చెప్తుంది. అప్పటికి సైన్స్ అభివృద్ధి చెందకపోవడం వల్ల ఆ సూత్రాన్ని వినియోగం లోకి రాలేకపోయింది.
పదార్థం(వాస్తవ ప్రపంచం) నుంచి భావం(ఆలోచన) వస్తుందన్నారు భౌతిక వాదులు. భావం(ఆలోచన) నుంచి పదార్థం(చుట్టూ ఉన్న ప్రపంచం) వస్తుందన్నారు భావవాదులు. కానీ పదార్థం భావం అనేవి రెండు కర్రలు. ఒకదానికొకటి పోటు ద్వారా పరస్పర సహకారంతో నిలబడినట్లు పరస్పరం ఆధారపడి ఉంటాయని బౌద్ధం మధ్యే వాదాన్ని ప్రతిపాదించింది.
ఈ ప్రపంచం దేవుని సృష్టి అయితే మార్పు చెందరాదు.నాశనం చెందరాదు. దుఃఖం కష్టం ఉండరాదు . తప్పు ఒప్పు ఉండరాదు. మంచి చెడు ఉండరాదు. ఇవి ఉన్నాయంటే ఇవన్నీ దేవుని నుంచి వచ్చి ఉండాలి అంటే దేవునికి ఆ లక్షణాలు ఉండి ఉండాలి . అప్పుడతను సర్వసద్గురు సంపన్నుడు ఎలా అవుతాడు? అని ప్రశ్నించింది బౌద్ధం. దేవుని భావనను, ఆత్మలను, ఆత్మ భావనను పక్కనపెట్టింది. వేదాలను తిరస్కరించింది.
బుద్ధుని కాలం రాచరిక వ్యవస్థ కాదు. అదొక గణ సమాజ వ్యవస్థ. గణ సమాజం వర్గ సమాజం కాదు. అప్పుడు వర్గాలు లేవు. అందరూ సమిష్టిగా పనిచేసే వాళ్లు. సమిష్టి జీవితం ఉండేది. సొంత ఆస్తి లేదు. గణ సమాజాన్ని ఆదిమ కమ్యూనిస్టు సమాజం అన్నారు చరిత్రకారులు. ఎప్పుడైతే సొంత ఆస్తి పెరిగిందో అప్పుడు ఇతరుల సొమ్ము దోచుకునే దోపిడీ పెరిగింది. కుటుంబం దైవ భావన పెరిగాయి.
గణ సమాజం మారుతూ వర్గ సమాజం వచ్చింది. బుద్ధుడు గణ సమాజాన్ని ఇష్టపడ్డాడు.
బౌద్ధం అర్థం కావాలంటే ప్రతీత్య సముద్పాదం అర్థం కావాలి అన్నాడు. ప్రతీత్య సముద్పాదం అర్థమైతే బౌద్ధం అర్థమయినట్లే అన్నాడు బుద్ధుడు. ప్రతీత్య సముద్పాదం ప్రకారం ఒకదాని నుండి మరొకటి పుడుతుంది, పాతది నశిస్తూ దాని నుండి మరొకటి పుడుతుంది. ఏది తనంతట తాను ఉనికిలో ఉండదు. ఏది అఖండము కాదు. శాశ్వతం కాదు. ప్రతిదాన్ని ఆచరణలో చూడాలి అని చెప్తుంది ఈ సిద్ధాంతం.
బుద్ధుడు సమాజాన్ని అధ్యయనం చేశాడు సమాజంలో మనిషి పడే కష్టాలను గుర్తించాడు ఈ కష్టాలకు కారణమేంటి దానికి పరిష్కారం ఏందీ అని తీవ్రంగా ఆలోచించాడు అతను సమాజాన్ని అర్థం చేసుకోవడం ద్వారా కొన్ని సూత్రాలను పరిష్కార మార్గాలను ప్రతిపాదించాడు. సత్యాన్ని సమాజాన్ని అర్థం చేసుకొని సత్యాన్ని కనుగొనడమే జ్ఞానం. అదే బౌద్ధం అన్నాడు. అందుకని బుద్ధం శరణం గచ్చామి అనే నినాదాన్ని ఇచ్చాడు. సమాజం చక్కగా నడవడానికి వ్యక్తి తన సామాజిక ధర్మాన్ని సజావుగా నిర్వహించడానికి ధర్మం సరైనదని చెప్పినాడు. అందుకనే ధర్మం శరణం గచ్చామి అనే నినాదాన్ని ఇచ్చాడు. వీటిని మనిషి తన దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి ఒక సంఘంలో ఉండి సంఘ నియమాలను పాటిస్తూ ఆయన సూచించిన అష్టాంగ మార్గాలను అవలంబిస్తే తప్పకుండా దుఃఖం నుంచి విముక్తి పొందుతాడు అన్నాడు . దాన్నే నిర్వాణం అన్నాడు.
సమాజంలో మనిషికి దుఃఖం ఉంది. ఈ దుఃఖానికి కారణం ఉంది. ఈ దుఃఖానికి నివారణ కూడా ఉంది. దుఃఖ నివారణ మార్గం ఉంది. ఇవి ప్రధానమైన సత్యాలు అని అన్నాడు. ఆనాటి సమాజం గణ సమాజం నుండి వర్గ సమాజంలోకి మారుతున్న దశలో నైతికత పతనం అవుతోంది. దోపిడీ మోసం దౌర్జన్యం అణిచివేత కొల్లగొట్టడం మొదలైన అవలక్షణాలన్నీ ఆనాటి సామాజిక విలువలుగా చలామణి అవుతున్నాయి. వాటి స్థానంలో ఆధునిక మానవవాద విలువలను బుద్ధుడు ప్రతిపాదించాడు. దుఃఖ నివారణ మార్గాన్ని కనిపెట్టాడు. ఈ దుఃఖాన్ని నివారించడానికి ఆయన పంచశీల అష్టాంగ మార్గాలు బోధించాడు. ఆయన చెప్పిన పంచశీల ప్రధానంగా మనసుకు సంబంధించినవే. మనసును కట్టుదిట్టం చేసుకుంటే వీటిని పాటించడానికి వీలవుతుంది.
పంచశీల చెప్పే ధర్మాలు: దొంగతనం చేయరాదు, మద్యం సేవించరాదు ,అబద్ధం చెప్పరాదు ,హింస చేయరాదు, వ్యభిచారం చేయరాదు. ఈ పంచశీలే కాకుండా అష్టాంగ మార్గాలు కూడా చెప్పాడు. ఇవి 8 మార్గాలు. మంచి దృక్పథం, మంచి ఆలోచన, మంచి నిర్ణయం, మంచి జీవనం, మంచి సంభాషణ, మంచి పనులు, మంచి సాధన, మంచి ధ్యానం ( ధ్యానం అంటే రాగద్వేషాలకు అతీతంగా స్థితప్రజ్ఞత కలిగి ఉండడం)
_____పిళ్లా కుమారస్వామి,9490122229
Comments
Post a Comment