బౌద్ధం సనాతనం
బౌద్ధం సనాతనం
మానవులు, జంతువులు ఆక్సిజన్ ను పీల్చి బ్రతుకుతారు. కాబట్టి "ఆక్సిజన్ని పీల్చి బ్రతకడం" మానవులు, జంతువుల"ధర్మం". సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది. అది దాని ధర్మం. కుక్క విశ్వాసంగా ఉంటుంది అది దాని ధర్మం.అంటే ధర్మాలు సహజాతాలు. అవి మనకి మనుగడ నిస్తాయి.
తోటి మనిషిని తనతో పాటు సమానంగా చూడడం నేటి సామాజిక విలువ. ఇలా చూడడం అనేది పూర్వం జరిగేది కాదు .అది ఆనాటి సామాజిక విలువ. ఈ సామాజిక విలువలు మానవ సమాజం మారే క్రమంలో మారిపోతూ ఉంటాయి. ధర్మం అలా కాదు.
సామాజిక 'విలువకు', 'ధర్మా'నికీ ఉన్న తేడా ఇది. మనం, ఒక ఆహార పదార్ధాన్ని అనేక రకాలుగా, అనేక రూపాలుగా తయారు చేసుకొని తింటాం. ఎన్ని రూపాలుగా తిన్నా ఆ ఆహార పదార్థం మనకి అందించే శక్తి. విటమిన్లు మాత్రమే మనల్ని బ్రతికిస్తాయి. "సామాజిక విలువలు,కట్టుబాట్లు" అనేవి ఆహార పదార్థాల రూపాలు మాత్రమే! దానిలోని శక్తి, విటమిన్లే దాని "ధర్మం", ఆ శక్తి, విటమిన్లు అందితేనే మనకు సుఖం. బ్రతుకు, మనుగడ, "ధర్మం" అనేది కూడా అంతే..!
మొన్నటి వరకూ వెయ్యి రూపాయిల నోటుకి విలువ ఉంది. కానీ ఆ వెయ్యి రూపాయిల నోటుకి ఇప్పుడు విలువ లేదు. ఆ నోటు తీసుకువెళ్తే, ఆ నోటుకి అదే సైజు తెల్లకాగితం కూడా రాదు. ఎందుకని? ఆ నోటు ఈ రోజున చెలామణిలో లేదు. సమాజం గుర్తింపు లేదు. మరి, ఒక బంగారు నాణెం వుందనుకోండి. ఆ నాణెం కూడా ఈ రోజున చెలామణిలో లేదు. కానీ ... ఆ నాణేనికి విలువ పోదు. ఎందుకని? అది బంగారు నాణెం కాబట్టి.
సామాజిక నియమాలు, విలువలు అనేవి కాగితం నోటులాంటివి. ధర్మం అనేది బంగారు నాణెం లాంటిది. ధర్మానికి రూపం కంటే "సారం" ముఖ్యం. బౌద్ధం కూడా అంతే బౌద్ధం అనేది ఒక "ధమ్మసారం".
బౌద్ధం సనాతనమైనది. ఇది తెలియాలంటే "సనాతనం" అంటే ఏమిటో తెలియాలి.
సనాతన అనే పదానికి అర్ధం ఇది:
"శాశ్వతస్థుదువో నిత్య నూతన సనాతనా" అంటే ద్రువము (స్థిరము), నిత్యము, ఎప్పుడూ ఉండేది, నాశనంలేక ఎల్లప్పుడూ ఉండేది సనాతనం. ఒక్క ముక్కలో చెప్పాలంటే "సదా ఉండేది" సనాతనం. అంటే భూత, భవిష్యక్స్, వర్తమానాల్లో ఉండగలిగినది సనాతనం. అలాంటి జీవన విధానం, అలాంటి పాటించవలసిన నియమం ఏదైతే ఉందో అది సనాతనం. ఆ ధర్మం సనాతన ధర్మం.
సనాతన అనే పదం క్రీ.శ. 8వ శతాబ్దం తర్వాతే వైదిక సాహిత్యంలోకి చేరింది. తొమ్మిదో శతాబ్దం తర్వాత రాయబడిన మనుస్మృతిలో మొట్టమొదట కన్పిస్తుంది. ఇందులోని నాల్గవ అధ్యాయంలో 138వ శ్లోకంలో ఇలా ఉంది.
"సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ సబ్రూయాత్ సత్య మప్రియం ప్రియంచ అనృతం బ్రూయాత్-ఏష ధర్మం: సనాతన."
అంటే.... "ఉన్నది ఉన్నట్లు చెప్పడం సత్యం. ఎదుటి వారి మనస్సుకి తగినట్లు నొప్పించకుండా చెప్పడం ప్రియం. సత్యమే అయినా అప్రియంగా చెప్పరాదు. ఇదే సనాతన ధర్మం" ఇదీ దీని అర్ధం.
క్రీ.శ. 8.9 శతాబ్దాలకు చెందిన పురాణాలలో ఒకటైన శివపురాణంలో ని 20వ అధ్యాయం 25వ శ్లోకం - బ్రహ్మ ఉవాచలో.....
"లోకాంతకా దీపాత్మా తథా వైత్యాంతకః ప్రభుః
అశనిర్భాదుక చతుష్టయ సనాతనః" అలాగే
భగవద్గీతలో 1వ అధ్యాయంలో 40వ శ్లోకం ఇలా చెపుతుంది. "కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాస్పనాతనా:"
అంటే "కులం (వంశం) నశించడం వల్ల అనాదియైన కులాచారాలు నశించిపోవును"(ఇది మళయాల స్వాములవారి అనువాదం). ఇక్కడ సనాతనం అంటే అనాది అనే అర్ధాన్ని చెప్పారు.
భగవద్గీత 2వ అధ్యాయం 24వ శ్లోకంలో కూడా "సనాతన:" అనే పదం ఉంది. ఇందులో ఇలా ఉంది.
"నిత్యస్సర్వగతస్థాణు రచలో అయం నసాతన:" అంటే ఆత్మ నిత్యం, సర్వవ్యాపకం, నిశ్చలం, చలించనిది. పురాతనమైనది." అని అర్థం .
ఇలా భగవద్గీత కూడా సనాతనం అంటే పురాతనం అనే చెప్పింది.
ఇలా శైవ, వైదిక మత గ్రంథాలన్నీ కొద్దిగా అటూ ఇటూ... 8వ శతాబ్దం తరువాతే ఈ "సనాతన" పదాన్ని ఉపయోగించాయి. వీటి అన్నింటి అర్థం సనాతనం అంటే "పురాతనం" అని మాత్రమే.
ఇస్లాం ,క్రైస్తవం కంటే మా మతమే పురాతన మతం" అని గట్టిగా చెప్పుకోడానికి ఈ "సనాతన" అనే పదాన్ని విస్తృతంగా ఉపయోగించారు వైదికులు.
దీనికి ప్రత్యక్ష సాక్ష్యం 1860లో దక్షిణాఫ్రికాలో ఏర్పడ్డ భారతీయ ధార్మిక సంస్థలే మంచి ఉదాహరణ. 1875లో "ఆర్య సమాజాన్ని" స్థాపించారు. స్త్రీ విద్యను, స్త్రీ పునర్వివాహాన్ని ప్రోత్సహించారు.
వారు వేదాల్నే ప్రామాణికంగా తమ సంస్థని స్థాపించారు. ఆ రోజుల్లో ఈ ఆర్య సమాజం ప్రధాన శాఖ దక్షిణాఫ్రిణాలో ఉండేది. వారిలోంచి కొందరు వేరుపడి "సనాతన ధర్మ రక్షణ సభ" అనే సంస్థను స్థాపించారు. అలా ... 1880 తర్వాత వైదిక మతంలో "సనాతన" అనే పదం ప్రముఖంగా ప్రచారం అయ్యింది. ఇక అక్కడి నుండి వైదిక మతాన్ని "సనాతన మతం" అంటూ ప్రచారంలో పెట్టారు. క్రీ. శ. 8వ శతాబ్దానికి ముందున్న వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు వీటిలో ఏ ఒక్క దానిలో, ఏ ఒక్క చోట కూడా "సనాతన" అనే పదం లేదు.
వైదిక యుగధర్మాలు :
వైదిక పురాణాల్లో గానీ, వేదాల్లో గానీ ఉంది యుగ ధర్మాలే! ఆ తర్వాత వచ్చిన పరాశర, యాజ్ఞవల్క్య స్మృతుల దగ్గర నుండి చివరిగా వచ్చిన మనుస్మృతి వరకూ కూ స్మృతులన్నీ ఈ చాతుర్వర్ణ వ్యవస్థని పదిల పరచడానికే కృషిచేశాయి. వర్ణ, కుల వ్యవస్థని మరింత కట్టుదిట్టం చేయడానికే వచ్చాయి. అంటరానితనం, బానిసత్వం, విద్యకు దూరంగా ఉంచడం, ఆర్థిక స్వావలంబన లేకుండా చేయడం, గౌరవ హీనంగా బ్రతకడం ఇలాంటి అమానవీయ పద్ధతులన్నీ యుగ ధర్మాలుగా, అవే మానవాళి పాటించాల్సిన పవిత్ర నియమాలుగా వేల సంవత్సరాలు చెలామణీ అయ్యాయి. సమాజంలో నూటికి తొంభైఐదు శాతంగా ఉన్న శూద్రులను (పంచములతో సహా) స్త్రీలనూ (అన్ని వర్గాల స్త్రీలు) పశు వులుగా పరిగణించాయి.
అలాంటి యుగ ధర్మాల కారుచీకటిలో వెదుకులాడుతున్న
భారతీయ సమాజానికి వెలుగు రేఖలా ప్రభవించాడు బుద్ధుడు.
తనది యుగధర్మం కాదు, "సనాతన ధర్మం"- సనాతనం:
'సనాతనం అంటే సదా నిలిచి ఉండేది, అని ఈ వ్యాసం
మొదట్లో విశ్లేషించుకున్నాం.
ఒక జాతిని వేరొక జాతి.... ఒక కులాన్ని మరొక కులం... ఒక దేశాన్ని మరొక దేశం... ఒక భాషని మరొక భాష...
ఒక వ్యక్తిని మరొక వ్యక్తి... పీడించని, పీడించకూడదని చెప్పే సాంఘిక ధర్మమే బౌద్ధం!
" అంటే... అది సర్వ మానవ సమానత్వం! అలాంటి సర్వ మానవ సమానత్వం ఎల్లకాలాల్లో మనుగడ సాగించాలని కోరుకుంటాం. వర్ధిల్లాలని ఆకాంక్షిస్తాం. అందు కోసం కృషి చేస్తాం. ఎందుకంటే... సనాతనం అంటే అన్ని కాలాలకీ వర్తించేది. అకాలికం కాబట్టి,
• బౌద్ధం అంటరానితనాన్ని వ్యతిరేకించింది. ఇది సనాతన ధర్మం. వైదికం అంటరాని తనాన్ని అంగీకరించింది. కాబట్టి అది వైదిక యుగధర్మం.
• బౌద్ధం మనుషులంతా సమానమే అంది ఇది సనాతనం. వైదికం మనుషులంతా సమానం కాదు అంది కాబట్టి అది వైదిక యుగధర్మం.
• బౌద్ధం స్త్రీలతోపాటు అందరూ విద్యకు అర్హులే అని చెప్పింది. * ఇది సనాతనం. వైదికం స్త్రీలతోపాటు అందరూ
• విద్యకు అర్హులు కాదు అని చెప్పింది. కాబట్టి అది వైదిక యుగధర్మం.
• బౌద్ధం శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాల్సిందే అంది. ఇది సనాతనం, శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాల్సిన పనిలేదు. కులాన్ని బట్టి పని, దాన్ని బట్టి ఫలితం ఇవ్వాలి అంది. కాబట్టి అది వైదిక యుగధర్మం,
• బౌద్ధం మోసము మాటలు వద్దు అని చెప్పింది ఇది. సనాతనం. వైదికం మోసము మాటలు తప్పుకాదు అని చెప్పింది. అవసరమైతే అబద్దాలు అనివార్యం అంది. కాబట్టి అది వైదిక యుగధర్మం.
* బౌద్ధం మత్తు పానీయాలు సేవించకూడదు అని చెప్పింది. "ఇది సనాతనం. వైదికం మత్తుపదార్థ సేవనం తప్పుతాడు అని చెప్పింది. కాబట్టి అది వైదిక యుగధర్మం,
* జీవహించ తగతు అని చెప్పింది - ఇది సనాతనం, వైదకం హింస తప్పుకాదు అని చెప్పింది. కాబట్టి అది వైదిక్ యుగధర్మం.
* బౌద్ధం దొంగతనం, దోపిడీలు నేరం అని చెప్పింది- ఇది సనాతనం. వైదికం దొంగతనం తప్పుకాదు అని చెప్పింది. కాబట్టి అది వైదిక యుగధర్మం.
జీవ అజీవ ప్రపంచంపట్ల కరుణ, మైత్రి, దయ, ప్రేమ, జాలి ఉండాలని చెప్పింది. ఇది సనాతనం. వైదికం యజ్ఞంలో, యుద్ధంలో ఇవేవీ ఉండవలసిన పనిలేదు అని చెప్పింది. కాబట్టి అది వైదిక యుగధర్మం,
ఇలా మానవీయ ధర్మాలతో నడిచే నడక, నడత మాత్రమే సనాతనం! అంటే ఎల్లప్పుడూ అవసరమే! బౌద్ధంలో 'సనాతన' పదం:
ఇక, బౌద్ధంలో అనేక చోట్ల "సనాతన" అనే పదం ఉంది. మనం ముందే చెప్పుకున్నట్లు- అసలు 'సనాతన' అంటే ఎల్లప్పుడు, సదా, ఎటర్నల్, అన్ని కాలాల్లో ఉండేది లేదా అకాలికం అని, అవి కొన్నింటిని చూద్దాం:
"అవేరాన చ సమ్మంతి, ఏసధమ్మో సనంతనో" (వినయ పిటకం-4 కోసంబిక ఖందక), (మధ్యమ నికాయ - 3.3. శూన్యతా వర్గ), (ఖుద్దక నికాయ ధమ్మపదం యమక వర్గ 2.1), (జాతక కథ - కోసల జాతకం), (కోసంబియ జాతకం - 428)
"తతో మే బహ్మా, పాతురాహు బ్రహ్మలోకా సనంతనో" (దీర్ఘనికాయ- 2-6 - మహా గోవిందసుత్త)
'అప్పస్మిమ్ యే పవెచ్చంతి, ఏసధమ్మో సనంతనో" (సం.ని: 1-1, దేవతా సంయుక్తం)
"సచ్ఛం వే అమతా వాచా, ఏసధమ్మో సనంతనో" (సం.ని: 1-8, వంగిస సంయుత్త), (ఖు,ని: 3. మహావగ్గ,
(ఖ. ని: థేరగాథ -21. మహానిపాతం) "పరిసంఖుపథ్ నామ, గిజ్జపంతో సనంతనో" (గిజ్జ (427)
"జెత్థా చ సెత్తో చ సనంత నో చ, ఉజ్జాహి జెట్టన్స కనిట్ట మగ్గా" (ధమ్మ దేవపుత్త జాతకం- 457) ""నమేనర్థం తమేవతం పటిపజ్ఞ - ఏసధమ్మ సనంతనో"
(విదుర జాతకం - 546లో ఘరావాస ప్రశ్న) "తస్మాహి దూతం న హంతి, ఏసధమ్మో ననంతనో"
(వెస్సంతర జాతకం - 547, జూజికపబ్బం)
పాలీ గాథల అర్థాలు ఇమ్మీ
• వైరం వైరంతో శాంతిచదు. అవైరంతోనే వైరం శాంతిస్తుంది. ఇదే సనాతన ధర్మం,
* అతి కోర్కెలు వద్దు అతి విసాలూ వద్దు. కొద్దిపాటి ఆహార వసతులతో సుఖంగా జీవించాలి. అదే సనాతన ధర్మం. • సత్యమే అమృత మార్గం. ఆ మార్గమే సనాతనం.
పై విధంగా ఈ ధమ్మం (బౌద్ధం) సనాతనం (అకాలికం, సర్వ కాలాలకూ వర్తించేది) అని బౌద్ధ సాహిత్యంలో చూడగలం.
కానీ... పరలోకం కోసం యజ్ఞంలో వేలాది జీవుల్ని తెగనరికి చంపి నెత్తుటేరులు పారించిన హింస ఎలా సనాతనం అవుతుంది? మనిషిని మనిషిగా చూడకుండా, అంటరాని తనాన్ని పరమ ధర్మంగా పాటించిన అమానవీయ ధర్మం ఎలా సనాతనం అవుతుంది? స్త్రీలకు సర్వ హక్కుల్నీ హరించి, బానిస కంటే హీనంగా చూసిన క్రూర ధర్మం ఎలా సనాతనం అవుతుంది?
హైజాకర్లు:
ఇప్పటికి నాలుగు వేల సంవత్సరాల నాడు మన దేశాన్ని ఆక్రమించిన ఆర్యులు, సంస్కృతినీ, నాగరకతల్ని హైజాక్ చేస్తూనే ఉన్నారు. సింధూ నాగరికతని ధ్వంసం చేశారు. కానీ వారి విజ్ఞానాన్ని వాడుకుని... కొన్నాళ్ళకి ఆ విజ్ఞానం తమదే అని చెప్పుకున్నారు. అలాగే... బౌద్ధ, జైన శ్రమణ సంప్రదాయాల సంస్కరణల్ని తొలుత తీవ్రంగా వ్యతిరేకించి, ఆ తర్వాత వాటిని తమ ధర్మాలుగా చెప్పుకున్నారు. ఈ వైదిక ఆర్య సాంస్కృతిక దొంగలు ఎంతటి గొప్ప వారంటే... హైజాక్ చేయటమే కాకుండా... చివరికి మనతోనే మన ధర్మాల్ని తూలనాడిస్తారు!
రెండు మూడు ఉదాహరణలు చూద్దాం: అందులో "హిందూ" అనే పదం ఒకటి. హిందూ అనే పదం సింధూ నది పేరు మీదుగా వచ్చిన పదం. సింధూ పదాన్ని మధ్య ఆసియా పర్షియన్లు 'స'కారాన్ని 'హ'కారంగా పలికి 'సింధు'ని, "హిందు"గా పిలిచారు. ఐరోపా వాసులు ఈ "హిందు" పదాన్ని "ఇందు"గా పలికారు. అంతేకాదు వారు 'ద'కారాన్ని 'డ' కారంగా ఉచ్చరిస్తారు. దానితో హిందూని "ఇండూ" గా పలికారు. అందుకే మెగస్తనీస్ మన దేశం గురించి "ఇండికా" అనే గ్రంథం రాశాడు. "ఇండియా" అనేది విదేశీ పదం కాదు. "సింధూ" అనే పురాతన భారతీయ పదానికి, ఐరోపా వారి ఉచ్ఛారణ మాత్రమే, అది సింధూ ప్రజలు, సింధూనది పేరు మీద వచ్చిందే! మరి భారత దేశం, భరత వర్షం అనే పదాలు - ఆర్య తెగల పేరు మీదో, ఆర్య
పురాణ పురుషుల పేరు మీదో వచ్చింది.
చూశారా ఇటీవల ఈ పేరు మార్చు విషయంలో ఆర్య భావజాల లేదా వైదిక భావజాల పార్టీలు- "ఇండియా అంటే విదేశీ నామం అని, భారత్ అంటే స్వదేశీ నామం అని ఎలా ప్రచారం చేస్తూ మనల్ని నమ్మించడానికి ప్రయత్నించాయో అంటే... మన వ్రేలితోనే మన కన్ను పొడుచుకునేలా చేయడమే
వైదికార్య నీతి! మన సంస్కృతిలోకి మనం మన భాషలోకి మనం: అలాగే ఈ నేలపై బౌద్ధం విరాజిల్లినంత కాలం బౌద్ధాన్ని
సనాతన ధర్మం అనేవారు. అంటే. సదా ఆచరించాల్సిన ధర్మం అని. బౌద్ధం బలహీనం పడ్డాక ఈ సనాతన పదాన్ని పురాతన అనే అర్ధంతో వైదిక గ్రంథాలు తమ గ్రంథాల్లోకి తీసుకున్నాయి. ఈశ్వరుడు, విష్ణువు సనాతనాలు అని తొలుత ఉటంకించాయి. ఆధునిక కాలంలో అర్య సమాజం వారు, వారి శాఖలు ఈ పదాన్ని తీసుకుని తమ సంస్థలకు "సనాతన" అనే పేరు పెట్టుకున్నాయి. సనాతనమైన బౌద్ధం వెనుక పట్టుపట్టడంతో ఆధునిక కాల మేధావులు, సంస్కరణ వాదులు కూడా "సనాతనం" అంటే పురాతనం అనే అనుకుంటూ వైదిక భావజాలంలో బందీలైపోయారు. దీనితో... వైదిక మతం వారు "హిందూ అంటే ద్వేషం, సనాతనం అంటే ద్వేషం" అని ...
పదాల్ని మనమే ద్వేషించుకునేలా చేశారు. చేయ గలిగారు. అలా... మన సంస్కృతిని హైజాక్ చేశారు వైదిక మతాల వారు, ఈ మోసాన్ని గ్రహించాలి. బాబాసాహెబ్ చెప్పినట్లు, మార్గం చూపినట్లు.. ఆ బాటలోనే నడవాలి. మన సాంస్కృతిక వారసత్వాన్ని మనం కాపాడుకోవాలి. సాంస్కృతిక పునరుజ్జీవం, అంటే... ఇదే... మన వారసత్వాన్ని మనదిగా రక్షించుకోవడం. మనది నూటికి నూరు పాళ్ళూ బౌద్ధ వారసత్వం. బౌద్ధ సంస్కృతి. బౌద్ధ సామాజిక జీవనం,
మన ధర్మం బౌద్ధం.
అదే సనాతనం!
మన మార్గం బౌద్ధం... అదే సనాతనం...!! అది.... సర్వకాల సమానత్వ సద్దమ్మ కేతనం....!!! మూలవాసుల నిజ నికేతనం...!!!
రచయిత,
బొర్రా గోవర్ధన్
93906 00157
Comments
Post a Comment