చిరునవ్వుతో గమనించడమే ధ్యానం
చిరునవ్వుతో గమనించడమే ధ్యానం
మనం మన శరీరాన్ని సాక్షిగా గమనించాలి. "సాక్షి" తన "స్వంత" అభిప్రాయానికి ప్రాధాన్యత నివ్వకుండా సత్యంగా అక్కడ జరిగినది జరిగినట్టుగా లేక చూచిన దానిని చూచినట్లుగా చెప్పే అవకాశం ఉంటుంది. బుద్ధుడు ఏది చెప్పినా ప్రకృతి యొక్క ధర్మాన్నే చెబుతాడు. ప్రకృతి ధర్మాలలోని ఒక ధర్మమేమిటంటే మనం మనలోని రాగద్వేషాలను గమనిస్తూ పోతే అవి తగ్గుతూ పోతాయి. అలాగాక అనుభవిస్తూ పోతే అవి పెరుగుతూ పోతాయి. అందువల్లనే రాగ ద్వేషాలను చిరునవ్వుతో సాక్షి లాగా గమనించమన్నాడు.
మనం ధ్యానం చేసే సమయంలో వెన్నుపూసను నిటారుగా చేసికొని, ముఖంలో చిరునవ్వును కలిగి ఉండాలి. ."ఆ చిరునవ్వే" మనలో "సాక్షి భావాన్ని" పెంచటానికి అత్యంత ఆవశ్యకం. అంతేకాదు అది మన "జీవన కళ" కు అంటే ఆనందమయ జీవితానికి కూడా బహుళ ప్రయోజనకారి. బుద్ధుడు మనలో సాక్షీ భావాన్ని ఎలా పెంచుకోవాలో మధ్యమనికాయలో వివరించాడు.
1. సాధకుడు "ధీర్ఘంగా శ్వాస" ను తీసి కొనేటప్పుడు (ఇది ప్రథమ స్థాయి) దీర్ఘంగా శ్వాసను తీసుకొంటున్నట్లు, శ్వాసను వదిలేటప్పుడు కూడా దీర్ఘంగా విడిచిపెడుతు న్నట్లు గమనిస్తాడు.
2. సాధకుడు" కురచగా శ్వాస" ను తీసుకొనే సమయములో కురచగా తీసుకొంటున్నట్లు, అలాగే శ్వాసను వదిలేటప్పుడు కురచగా విడిచి పెడుతున్నట్లు గమనిస్తాడు.
3. సాధకుడు శ్వాస రాక పోకలను ఒక సాక్షిగా చిరునవ్వుతో గమనిస్తూ ఉండటం చేస్తాడు.
ధ్యానాన్ని నవ్వుతూ చేయాలి. సీరియస్ గా లేదా వత్తిడితో చేసే ధ్యానం కాదు. మనస్సులో ధ్యానం పట్ల ఉండే అన్ని రకాల భయాలు, అభిప్రాయాల నుండి ముందుగా బయటకు రావాలి. ఏదో సాధించాలనే ఆవేశం లేదా తొందర పాటు పనికి రాదు. ఇది మనస్సును శుద్ధి చేసికొనే మార్గము. అంటే అన్ని రకాల వత్తిళ్ళ నుండి బయట పడాలనే కృషే ఇది.
కాబట్టి రిలాక్స్డ్, ఫ్రీగా, ధ్యానంలో కూర్చోవాలి. చిరునవ్వు మాత్రము తప్పనిసరి. వీలైనంత వరకు నిటారుగా వెన్నెముకను తిన్నగా ఉండేలా కూర్చోవాలి .మధ్యలో పొజిషన్లో మార్పు చేసికోవాల్సి వస్తే అతి నిదానంగా ఆ మార్పును కూడా గమనిస్తూ మార్పు చేసుకోవచ్చు. మన శరీరం లోని ప్రతి చిన్న కదలిక కూడా మన ఎరుకలో ఉండాలి. మొదటి సారిగా ధ్యానంలో కూర్చొనే వారు మనస్సును ధ్యానం పై నిలపటం కష్టంగా ఉంటుంది. అది అతి సహజం. మనస్సు ఒక చోట స్థిరంగా ఉండలేదు. ఏదో ఒకటి ఆలోచిస్తుంది.మనస్సును ఒక్క సారిగా సాక్షీ భావము పైకి తీసికొని రావటము సరిగా జరగదు. అందుచేత శ్వాస పైనే (మొదటి రెండు మెట్లు) మనస్సు స్థిరపడే వరకు ధ్యానం కొనసాగిస్తారు.
తొందరపడి ఒకే సారి ఎక్కువ మెట్లు, ఎక్కాలని ప్రయత్నం చేయటం కంటే ఒక్కొక్క మెట్టుపై మంచి పట్టును సాధించుకొంటూ మాత్రమే చేయటం మంచిది. మన ప్రగతి అనేది మన కృషి మీద ఆధారపడి ఉంటుంది.
ఇంద్రియాల అనుభవాలను సాక్షిగా ఉన్నది ఉన్నట్లుగా, ఆ అనుభూతికి ఏ పాత అనుభవాలను జోడించకుండా, దేనిని తిరస్కరించకుండా, దేని పట్ల అనురక్తి లేకుండా, సమతా భావంతో, ఉన్న దానిని ఉన్నట్లు ఇది బాగుంది,ఇది బాగా లేదు అనుకోకుండా గమనించాలి.అదే "యథాభూత జ్ఞాన దర్శనం". అంటే ఉన్న దానిని ఉన్నట్లుగా చూడటం.
ఇదే మనసులో దాగి ఉన్న మలినాలను తొలగించుకొనే ఏకైక మార్గము.
మన అనుభూతిలోనికి వచ్చే దుఃఖాన్ని గాని, సుఖాన్ని గాని, ఒక తామరాకుపై నీటి బొట్టులాగా అంటీ అంటనట్లుగా, (అంటే ఎలాంటి రాగ ద్వేషాలకు ఆస్కారంలేని విధంగా) గమనించండి మే మనం చేయాల్సింది. అప్పుడే అంటే ఆస్థితిలోనే మనం మన మలినాలను సాక్షిగా గమనించే వీలు కలుగుతుంది. మన మలినాలను మనం గ్రహించగలిగినప్పుడే గదా, వాటి నుండి బయట పడగలిగేది.
ఇలా కొంతసేపు ధ్యానం చేయడంతో మన మనస్సు ఎంతో కొంత శాంతి సామరస్యాలతో నిండి ఉంటుంది. అలాంటి శాంతి సామరస్యాలను ఈ విశ్వంలో గల తక్కిన జీవరాశులన్నిటికీ పంచాలి. దీన్ని మైత్రీ ధ్యానం అంటారు.
సమస్త ప్రాణులు సుఖంగా ఉండునుగాక!. అన్నిటికీ నిర్వాణ సుఖం లభించునుగాక!". ఈ విధంగా మన మనో తరంగాలను విశ్వంలోకి వదుల్తాము. దీని వల్ల మనలో సంకుంచిత తత్వం పోయి విశాల తత్వం ప్రవర్ధమానం అవుతుంది.
ఇతను లేదా ఈమే తన అజ్ఞానం కారణంగా నాపట్ల చెడుగా ప్రవర్తించి యుండ వచ్చు. లేదా తనకు తానే అజ్ఞానంలో కొట్టు మిట్టాడుకొంటూ ఉండవచ్చు. అందుచేత, అతనికి / ఆమెకు/ దానికి నాకు లభించిన విధముగానే ఈ ధర్మ మార్గం లభించు గాక! అతను / ఆమె/ దాని లో గల చెడు భావాలన్నీ తొలగి పోవు గాక!. అతను / ఆమె / అది సుఖంగా ఉండుగాక! సుఖంగా ఉండుగాక! ఈ రెండవ రకమైన మైత్రిని మన కొరకే, అంటే ఎదుటి వారి పట్ల మనలో ఏర్పడుతూ ఉన్న చెడు భావం యొక్క స్థానంలో మంచి భావాన్ని మొలకెత్తింప జేయటమే దీని అంతర్యం. ఎందుకంటే 'పగ' ని 'పగ' తో గాని లేక 'అగ్ని'ని 'అగ్ని'తో గాని ఆర్పలేమనేది ప్రకృతి సత్యం. బుద్దుడు ఉ పదేశించిన వాక్కు కూడా ఇదే!.
బౌద్ధంలోకి అడుగుపెట్టే ఏ వ్యక్తి అయినా ఇతర వ్యక్తిని గాని, ఇతర కులాన్ని గాని, ఇతర మతాన్ని గాని, ఇతర దేశాన్ని గాని ద్వేషంచటంగాని లేక విమర్శించటంగాని మంచి పనిగా బౌద్ధం (బుద్దవచనం) ఒప్పుకోదు. అందుకే మంచి బుద్దిస్టుగా ఉండు!. మనస్సునిండా ప్రేమతో ఉండు!. ఆనందాన్ని అనుభస్తూ ఉండు.
ఈ ధర్మమార్గం మీ అందరకూ లభించుగాక ! మీ, మీ మనోమాలిన్యాలు తొలగిపోవు గాక ! తామెల్లరూ నిర్వాణానికి చేరుకొందురు గాక !
మీలో ఎవరికైనా ఈ ధ్యానం పట్ల లేక ఈ జ్ఞాన విస్తరణ పట్ల మక్కువ కలిగితే, తమరే ఈ చిన్న సాధనా పుస్తకాన్ని ముద్రించి పంచగలిగితే, అది మీ లోని "ధమ్మ దానాన్ని" ఇనుమడింప జేయగలదు.
సుఖీభవ, సుఖీభవ,సుఖీభవ,
____భంతే అనగారిక కుశలో
Cell: 9652534537
చీమకుర్తి, ప్రకాశం జిల్లా.
Comments
Post a Comment