బౌద్ధమతం ఎందుకు క్షీణించింది



బౌద్ధమతం ఎందుకు క్షీణించింది?
.

ఆర్కియాలజీ, సాహిత్యాల ఆధారంగా బౌద్ధం భారతదేశ నలుమూలలా బలంగా విస్తరించిందని తెలుస్తుంది. ఆరవశతాబ్దపు చైనా యాత్రికుడు హ్యుయాన్ త్సాంగ్ రాతలలో ఆనాటి బౌద్ధ ఆరామాల విస్తరణ, ఇతర ఆరాధనా పద్దతులతో  తులనాత్మక వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి
 
• నేటి ఉత్తరప్రదేశ్ లోని కానౌజ్/కన్యాకుబ్జ లో బౌద్ధులు, ఇతర విశ్వాసులు సమాన సంఖ్యలో ఉన్నారు; వెయ్య ఆరామాలు, పదివేల బిక్షుకులు, 200  దేవాలయాలు, కొన్ని వేలమంది దేవభక్తులు ఉన్నారు.

• వారణాసిలో ముప్పై ఆరామాలు 3000 మంది భిక్షుకులు, 100  దేవాలయాలు పదివేలమంది భక్తులు ఉన్నారు,  వీరిలో ముఖ్యంగా పశుపతులు, జైనులు ఎక్కువ. 

• మగధలో 50 ఆరామాలు, పదివేలమంది భిక్షుకులు ఉన్నారు. 

• వైశాలి లో కొన్ని వందల ఆరామాలు ఉన్నాయని కానీ అవన్నీ శిథిలమైపోయాయని, బౌద్ధ భిక్షుకులు కొద్దిమంది మినహా చాలామంది వైశాలిని విడిచివెళ్ళిపోయారని, కొన్ని పదుల దేవ ఆలయాలు ఉన్నట్లు తెలిపాడు.

• పుండ్రవర్ధన (బెంగాల్)  లో 3000 భిక్షకులతో ఇరవై ఆరామాలు, కొన్ని వందల ఆలయాలు ముఖ్యంగా జైనులు ఉన్నారు.

• సముద్రతీర పట్టణమైన Samatata లో 30 ఆరామాలు, 2000 మంది భిక్షకులు ఉన్నారు. 

• తామ్రలిప్తి లో 10 ఆరామాలు, 50 దేవ ఆలయాలు ఉన్నాయి.

• ఓడ్ర (ఒరిస్సా) దేశంలో బౌద్ధులు ఎక్కువగా ఉన్నారని, 100 ఆరామాలతో 10 వేల భిక్షుకులు నివసిస్తున్నారని చెప్పాడు

• కోశల (ఉత్తరప్రదేష్) లో 100 ఆరామాలు 10 వేలమంది భిక్షుకులు, 70 దేవ ఆలయాలు ఉన్నాయని చెప్పాడు. 

• పిఠాపురం (వేంగి?) 30 కి పైగా బౌద్ధారామాలు, చాలామట్టుకు శిథిలస్థితిలో ఉన్నాయి.  3000 మంది భిక్షుకులు, 100 కు పైగా దేవ ఆలయాలు ఉన్నాయని వాటికి శైవ, జైన విశ్వాసులు ఉన్నారు. 

• తమిళనాడు కాంచిపురంలో 100 కు పైగా ఆరామాలు, 10 వేలకు పైగా భిక్షుకులు ఉన్నారని, 80 కి పైగా దేవ ఆలయాలు అసంఖ్యాకంగా జైనులు ఉన్నట్లు చెప్పాడు.

• మహారాష్ట్రలోని కొల్లాపూర్ లో వందకు పైగా సంఘారామములు పదివేల భిక్షుకులు ఉన్నట్లు చెప్పాడు. 

• నాసిక్ లో 100 ఆరామాలు, 5000 మంది భిక్షుకులు, 100 కు పైగా దేవ ఆలయాలు ఉన్నాయని చెప్పాడు.  అజంతా గుహలగురించి కూడా వర్ణించాడు.

• మాలవా (మాళ్వా) పంజాబ్ లో 100 ఆరామాలు, 2000 భిక్షుకులు ఇంకా ఎక్కువసంఖ్యలో ఇతర విశ్వాసులు ఉన్నారు ముఖ్యంగా శైవులు.

• వలాభి (గుజరాత్ ) వంద వరకూ ఆరామాలు, 6000 మంది భిక్షకులు ముఖ్యంగా థెరెవాద బౌద్దులు. అనేక వందల దేవ ఆలయాలు ఉన్నాయి.

• గుర్జర (రాజస్థాన్) లో ఉన్న ఆరామాలు శిథిలస్థితిలో ఉన్నాయని, శైవం ప్రముఖంగా ఉందని చెప్పాడు. 

• సింధ్ (పాకిస్తాన్) లో వందలకొలదీ ఆరామాలు ఉన్నాయని 10000 మంది భిక్షక పూజారులున్నారని. వీరు ఎక్కువగా థెరెవాద బౌద్ధులని చెప్పాడు. శైవులు కూడా గణనీయంగా ఉన్నారు .

పై వివరాల ద్వారా ఒకనాటి అఖండ భారతదేశంలో బౌద్ధం ఏమేరకు విస్తరించిందో స్పష్టంగా అర్ధమౌతుంది.  పై వివరాలను గమనిస్తే బౌద్ధానికి ప్రత్యామ్నాయంగా అప్పట్లో జైనం, శైవం ఉన్నట్లు కనిపిస్తుంది. వీటినే దేవాలయాలుగా హ్యుయాన్ త్సాంగ్ చెప్పాడు. 

ఆరామాలు ఆధ్యాత్మిక బోధనలేకాక వ్యాపార, బాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే కేంద్రాలుగా, వైద్యం  , విద్య (ఒకనాటి విశ్వవిద్యాలయలు బౌద్ధులని) అందించే ఉన్నత స్థానాలుగా ఉండేవి. 

 పై జాబితాలో ఎక్కడా వైష్ణవాలయాలు లేకపోవటాన్ని బట్టి  వైష్ణవం ఇంకా వెలుగులోకి వచ్చినట్లు అనిపించదు.  భారతదేశ జనాభాలో ఎంతమంది బౌద్ధాన్ని ఒక ధార్మిక జీవన విధానంగా చేసుకొన్నారో అనేదానికి స్పష్టమైన లెక్కలు లేకపోయినప్పటికీ, పై వివరాలను బట్టి  సగానికి పైగా ప్రజలలో బౌద్ధాన్ని ఆచరించారని ఊహ చేయవచ్చు. 

దేశం నలుచెరగులా విస్తరించిన బౌద్ధం పన్నెండో శతాబ్దానికల్లా  దాదాపు క్షీణించింది. అదేకాలంలో ఆదరణకు నోచుకొంటున్న వైష్ణవం బుద్ధుడిని విష్ణుమూర్తి అవతారంగా కలుపుకొని ఒక పురాణపురుషునిగా చేసుకొంది.  కానీ ఈ ప్రయత్నం రామ, కృష్ణావతారాలలాగా ప్రసిద్ధిచెందలేదు. 

బుద్ధుని అనంతరం వ్రాసిన ఉపనిషత్తులు, పురాణాలు, సంస్కృత, ప్రాకృత కావ్యాలు బుద్ధుని గురించి పెద్దగా చెప్పలేదు. బౌద్ధ పండితుల రచనల వ్రాతప్రతులు ఒక్కటీ  లభించలేదు, కనీసం ఆయారచనలలోంచి ఆలంకారిక ఉదాహరణలు అలంకార శాస్త్ర గ్రంధాలలోకికూడా ఎక్కలేదు.   బుద్ధచరిత, సౌందరానంద, మరి కొన్ని బౌద్ధ గ్రంధాలు తప్ప – బౌద్ధ సన్యాసుల జీవనం, సంఘ నిర్మాణం, బుద్ధిస్ట్ ఆర్ట్, బుద్ధుని బోధనల పై పండిత చర్చలు, బుద్ధుని కాలపు విశేషాలు లాంటివి అన్నీ వ్రాతప్రతులతో సహా భారతదేశంలో 12 వ శతాబ్దానికి వచ్చేసరికే  కాలగర్భంలో కలిసిపోయాయి.  

యూరోపియన్ చరిత్రకారులు James Prinsep, Alexander Cunningham, Henry Olcott  లాంటి వారు టిబెట్, సిలోన్, జపాన్ లాంటి దేశాలలోని పాళి భాషలో ఉన్న బుద్ధుని రచనలను సేకరించి ఇంగ్లీషులోకి అనువదించి ప్రపంచానికి పరిచయం చేసారు. 

ఆ తరువాత శ్రీలంకు చెందిన Anāgārika Dharmapāla ఇంకా Sarat Chandra Das, Satish Chandra Vudyabhushan, Hara Prasad Sastri, Lakshmi Narasu వంటి భారతీయులు విదేశాలలోఉన్న బౌద్ధ రచనలను సేకరించి అనువదించే మహా క్రతువులో పాలుపంచుకొన్నారు.  

1908 లో మెట్రిక్యులేషన్ పాస్ అయినందుకు డా. బి.ఆర్. అంబేద్కర్ కు  బుద్ధుని జీవితంపై Krishnaji Arjun Keluskar వ్రాసిన పుస్తకం బహుమతిగా ఇవ్వబడింది. వీరందరి కృషి కారణంగా 12 వ శతాబ్దంలో అంతర్ధానమైన బౌద్ధం 20వ శతాబ్దం వచ్చేసరికి భారతీయులకే కాక మొత్తం ప్రపంచానికి తెలిసింది.
***
.
బౌద్ధం ఎందుకు కనుమరుగైందో తెలిపే చారిత్రిక ఆధారాలు పెద్దగా కనిపించవు. ఏంజరిగిందో చెప్పటానికి  భారతదేశంలో  బౌద్ధానికి చెందిన ఒక్క వ్రాతప్రతి లభించలేదు. టిబెట్, చైనా, శ్రీలంకలలో లభించిన పాలి గ్రంధాల అనువాదాలే నేటి బౌద్ధ సాహిత్యం అంతా.    ప్రముఖ ఇండాలజిస్టు A.L. Basham  బౌద్ధం క్షీణించటాన్ని ఇలా విశ్లేషించాడు

1. ఊచకోతలు ప్రధానకారణం కాదు
2. అప్పటికి ఉన్న విశ్వాసాలు సంస్కరించబడి “హిందూమతం”  పేరిట స్థిరీకరించబడటం
3. వైష్ణవం, శైవం క్రమేపీ ఇతర దేవతారాధనలు అన్నీ ఒకే గొడుగు క్రిందకు తీసుకురావటం
4. విస్త్రుతమైన ప్రచారం, శంకరాచార్యునిచే వ్యవస్థీకృత నిర్మాణం దానికి లభించిన రాజాదరణ
5. అప్పటికే క్షీణిస్తున్న బౌద్ధంపై యుద్ధోన్మాదంలో ముస్లిములు చేసిన దాడులు ఆఖరి అస్త్రంగా పరిణమించాయి.
.

భారతదేశంలో క్రీపూ. రెండో శతాబ్దంలోని పుష్యమిత్రశుంగుడి నుంచి ఆరోశతాబ్దంలోని – Mihirakula వరకూ బౌద్ధమతాన్ని వివిధ దశలలో హింసాత్మకంగా అణచివేసినట్లు పదహారవ శతాబ్దానికి చెందిన టిబెట్ బౌద్ధగురువు తారానాథుని రచనల ద్వారా తెలుస్తున్నది.  ఇదే తరహా ఊచకోతలు ఆ తరువాత హిందూమతంపై కూడా జరిగాయి.   కనుక ఒక్క ఊచకోతలవల్లే బౌద్ధం కనుమరుగు అయి ఉండకపోవచ్చు.  
***

సూర్యుడు, గణేశుడు, పార్వతిదేవి, శివుడు, విష్ణువు మొదలైనవారు పంచదేవతలని, వీరిని ప్రధాన దేవతలుగా  ఆరాధించటాన్ని పంచాయతన పూజావిధానం అంటారు. ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్యుడు ప్రవేశపెట్టినట్లు చెప్పే, ఈ పంచాయతన పూజావిధానం ద్వారా వివిధ ఆరాధనాపద్దతులు ఏకం అవ్వటంతో బలమైన హిందుమత భావన  కలిగింది. 

శంకరాచార్యుడు అఖండ భారతావని అంతా తిరిగి హిందుధర్మాన్ని ప్రచారం చేసి, అనేకచోట్ల పండిత చర్చలు జరిపి ఆలయాలు స్థాపించి-హిందూమతానికి ఒక వ్యవస్థీకృత రూపాన్ని తీసుకొచ్చాడు.
***
.
ఏడో శతాబ్దం వరకూ రాజులు బౌద్ధాన్ని, జైనాన్ని హిందూమతాన్ని సమాదరించారు.  క్రమేపీ హిందూమతం పట్ల ఆదరణ పెరిగింది. దీనికి కారణం … రాజ్యానికి కావల్సిన  వెట్టిచాకిరీ చేసే వర్గం ఒకటి హిందూమతం ఏర్పరచిన కులవ్యవస్థ వలన చాలా సులువుగా అందుబాటులోకి వచ్చింది. ఉత్పత్తి వర్గాలుగా ఈ బహుజన సమూహం సమాజ ఆర్ధిక అభివృద్ధికి ఉపయోగపడింది. ఇదంతా సంపదను తేరగా అనుభవించే పాలకులకు లాభించే వ్యవహారం.
.  
అంతే కాక హిందూమతం రాజుకి దేవునితో సమానమైన స్థానాన్ని కట్టబెట్టింది.  కొన్ని  జాతక కథలలో రాజు తప్పు చేస్తే ప్రజలు తిరగబడి అతడిని చంపివేసినట్లు ఉండటాన్ని బట్టి బౌద్ధమతంలో రాజుకు సర్వాధికారాలు లేవని అర్ధమౌతుంది.  

తమిళ ప్రాచీన కావ్యం శిలపధికారంలో నెడుంజెళియన్ అనే రాజు తప్పుడు తీర్పు ఇచ్చినందుకు మరణించటమే కాక అతని రాజ్యం నాశనమైనట్లు చెప్పటం ద్వారా,  రాజు ధర్మానికి కట్టుబడి లేకపోతే నాశనం అవుతాడు అనే భావనను హిందూవేతర మతాలు  ప్రచారంచేసాయి.   

 బౌద్ధ, జైనాలలో రాజు సర్వస్వంగ పరిత్యాగి.  హిందూ రాజుకు అలాంటి పరిమితులు లేవు భోగలాలసుడుగా  ఉండొచ్చు. అది రజోగుణం.  సర్వశక్తిసంపన్నుడు.  దైవాంశ సంభూతుడు.   ఈ అంశాలన్నీ కూడా హిందూమతానికి రాజాదరణ లభించటానికి కారణం కావొచ్చు.
***
.
బుద్ధుని సంఘారామం తమ పోషణ కొరకు ధనికులపై ఎక్కువగా ఆధారపడేది.  బౌద్ధమతం పట్టణాలలో బాగా విస్తరించింది. దీనికి పోషకులు వ్యాపారులు.  విదేశీవ్యాపారం తగ్గిపోవటంతో వ్యాపారవర్గాల ప్రాభవం తగ్గిపోయింది. క్రమేపీ భూస్వామ్యవాదం పెరిగింది.   ఈ క్రమంలో హిందూమతం – పంచాంగం ద్వారా వానలు పడే కాలాన్ని చెబుతూ, విత్తనాలు ఎప్పుడు జల్లాలి, కోతలు ఎప్పుడు కోయాలి అనే అంశాలకు ముహుర్తాలు పెడుతూ వ్యవసాయాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకొంది.  ఆ విధంగా హిందుమతం  గ్రామీణ ఫ్యూడల్ వ్యవస్థను బలోపేతం చేసి తన అదుపాజ్ఞలలో. ఉంచుకొంది. 
.
ఇక పట్టణాలలో బౌద్ధ ఆరామాలకు రాజాదరణ, వ్యాపారుల ఆదరణతగ్గి, నిర్వహణకొరకు నిధులు కరువై రకరకాల హీన పద్దతులకు పాల్పడవలసి వచ్చింది.  .....



బొల్లోజు బాబా

Comments

Popular posts from this blog

బౌద్ధ సాహిత్యం

Story of Punnika

త్రిపిటకాలు