గౌతమ బుద్దునిగా పేరు గాంచిన బుద్దుని అసలు పేరు సిద్దార్థ్. ఇతను సాధారణ శకం కు పూర్వం 563 లో జన్మించి 483 లో మరణించాడు. అంటే బుద్దుడు మొత్తం 80 ఏళ్ళు జీవించాడు.
తండ్రి శుద్ధోధనుడు, తల్లి మాయాదేవి.మాయాదేవి, కోళియన్ దేశపు రాకుమారి. సిద్ధార్ధుడు కపిలవస్తు నగరానికి చెందిన లుంబినిలో జన్మించాడు. భౌగోళికంగా ఈ ప్రాంతం ప్రస్తుత నేపాల్ దేశంలో ఉంది. కానీ చారిత్రకంగా ఈ ప్రాంతం ప్రాచీన భారతదేశంలోకి వస్తుంది.ర్భావతిగానున్న మాయాదేవి ప్రసవానికి తన తండ్రిగారింటికి బయలుదేరింది. ప్రయాణ మార్గ మధ్యంలో లుంబిని అనే ప్రాంతంలో ఒక సాల వృక్షం క్రింద ఒక మగ బిడ్డను ప్రసవించింది. అనేక ఆధారాలను బట్టి ప్రసవ సమయంలోగాని లేదా మగబిడ్డ జన్మించిన కొద్ది రోజుల తర్వాత గానీ మాయాదేవి మరణించినదని తెలుస్తోంది. అలా పుట్టిన బిడ్డకి సిద్ధార్థుడ ని నామకరణం చేశారు. సిద్ధార్దుడనగా అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడని అర్ధం. సిద్ధార్దుడు తన పినతల్లి అయిన మహా ప్రజాపతి( గౌతమి)పెంపకంలో పెరుగుతాడు. గౌతమి పెంచినందువల్ల అతన్ని
గౌతముడన్నారు. సిద్దార్డ్ 16 ఏళ్ల వయసు వచ్చే సరికి యశోధర ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు పుట్టాడు.అతనికి రాహుల్ అని నామకరణం చేశారు.
కొందరు చరిత్ర కారుల ప్రకారం శుద్ధోధనుడు ఒక శాక్యుల తెగకు నాయకుడు. సిద్ధార్దుడు బాల్యం నుంచి రాకుమరుడిగా విలాస వంతమైన జీవితం గడిపాడు. శుద్ధోధనుడు, సిద్ధార్దుని గొప్ప చక్రవర్తిని చేయాలనే ధ్యేయంతో అతడికి ఎలాంటి తాత్విక విషయాలు గాని సామాన్య ప్రజల కష్ట సుఖాలు గాని తెలియకుండా పెంచాడు.శుద్ధోధనుడు, తన కుమారునకు కావలసిన రాజ భోగాలనన్నింటినీ సమకూర్చినప్పటికీ సిద్ధార్దుడు ప్రాపంచిక సుఖాలను అనుభవించడం జీవిత పరమ లక్ష్యం కాదని భావిస్తూ ఉండేవాడు. ఇతనికి అర్కబంధువు, గౌతముడు, మాయాదేవీసుతుడు, మునీంద్రుడు, శాక్యముని, శాక్యసింహుడు, శౌద్ధోదని, సర్వార్థసిద్ధుడు, సిద్ధార్థుడు. అను పలు పేర్లతో పిలవబడేవాడు.
సిద్ధార్థుడు రాజ్య పరిత్యాగం చేసి సమాజాన్ని అర్థం చేసుకోవడానికి సత్యాన్వేషణ ప్రారంభించాడు. ఆనేక సంవత్సరాల పాటు తీవ్రంగా ధ్యానం చేసి చివరకు రావి చెట్టు క్రింద కూచుని తనకు తానుగా ఒక తాత్విక చింతన ను సంపాదించాడు. ఆయన సాధించిన జ్ఞాన సంపదే బౌద్ద దర్శనంగా ఆవిష్కరించింది.
బుద్ధుని తాత్వికత ఆనాటి వైదిక మత ప్రయోజనాలకు వ్యతిరేకమైనది. ప్రజలు బౌద్ధం ను ఇష్టపడి దానిని తాము జీవిత విధానం గా మార్చుకున్నారు.వైదిక క్రతువులైన యజ్ఞయాగాదులు,ఆవు,గుర్రం,ఇతర పశువుల ను యజ్ఞవాటికలలో వధించడం ఆగిపోయింది. దాంతో వైదిక కర్మ కాండలు ఆగిపోయాయి. గత్యంతరం లేక కొందరు, బౌద్ధ తాత్వికత ను అర్థం చేసుకుని మరికొందరు బౌద్ధం స్వీకరించారు.
బుద్ధుని పరినిర్వాణం(మరణం) తరువాత కొద్ది కాలానికే బౌద్ధులు ప్రథమంగా సమావేశమయ్యారు . బుద్ధుని అమూల్య బోధనలను గ్రంథస్తం చేయాలని ఆ సమావేశం నిర్ణయించింది. ఆ నాటి బౌద్ధులు తాము బుద్దుని ద్వారా విన్నవాటిని చెప్పగా అందరూ ఏకీభవించిన వాటిని రాశారు. వాటిని మూడు భాగాలుగా విభజించారు. సుత్త పిటకం అనీ, మరొక శిష్యుడు ఉపాలి చెప్పిన విషయాలు వినయ పిటకం అనీ ప్రసిద్ధి చెందాయి.[18]సుత్త పిటకంలో బుద్ధుని సూక్తులు ఉన్నాయి. వినయ పిటకంలో బౌద్ధ సంఘంలో ఉండేవారి లక్షణాల గురించి చెప్పబడింది (భిక్షువుల ధర్మాలు). రెండవ బౌద్ధ మండలి తరువాత బౌద్ధంలో వివిధ శాఖలు పొడసూపనారంభించాయని పరిశోధకులు భావిస్తున్నారు.[19] అశోకుని తరువాతనే ఈ శాఖా భేదాలు బలవంతమయ్యాయని కొందరి అభిప్రాయం.
అశోకుడు పాటలీ పుత్ర నగరంలో మూడవ బౌద్ధ మండలిని నిర్వహింప జేశాడు. అయితే కొందరు అబౌద్ధులను సంఘంలోంచి వెలివేసి, సంఘాన్ని ఏకీకృతం చేసినట్లు మాత్రమే అశోకుని శాసనాలు చెబుతున్నాయి. స్థవిరులు అనబడే వారు, మహాసాంఘికులు అనబడేవారు "వినయం" గురించి గట్టిగా ఒకరినొకరు వ్యతిరేకించారు. సంఘంలో ఉండవలసిన వారి అర్హతల గురించి ఈ విభేదాలు పొడసూపాయి. కొంత కాలం ఒకే సంఘారామంలో ఇరు వర్గాలవారు కలసి ఉండి ఉండవచ్చును. కాని సుమారు సా.శ. 100 నాటికి వారు వేరు కుంపట్లు పెట్టుకొని ఉంటారు.[20] స్థవిరులలోంచి వచ్చిన మరొక శాఖ థేరవాదంగా పరిణమించింది. స్థవిరులు సంఘం అర్హతలుగా ప్రతిపాదించిన నియమాలు మరీ కఠినంగా ఉన్నాయని మహాసాంఘికులు అభిప్రాయపడ్డారు.[21]
బుద్దుని తరువాత 300 సంవత్సరాలకు అశోకుడు అధికారంలోకి వచ్చాడు.ఈ కాలంలో వైతుల్యకులుగా పిలువబడే వైదికులు(వైదిక మతం బ్రాహ్మణ భావజాలంతో కూడుకున్నది)
బౌద్ధ భిక్షువులుగా బౌద్ద సంఘంలో చేరి బుద్ధుని బోధనలను వక్రీకరించారు. వైతుల్య పిటిక అనేది వీరి సృష్టే. సంస్కృతంలో రాయబడిన ఆ గ్రంథం వైదిక మత ప్రయోజనాలను కాపాడటానికి ఉద్దేశించబడింది. మహా సాంఘిక శాఖకు మధుర బ్రాహ్మణుడైన మహాదేవుడు ఆద్యుడు. వీరు భౌతిక ప్రపంచ వాస్తవికతను తిరస్కరించారు. ఇది బుద్ధుని బోధనలకు వ్యతిరేకం. వీరు బుద్ధుడు ఒక పురాణ పురుషుడు అన్నారు. బ్రహ్మ దేవుని ఆదేశం ప్రకారమే బుద్ధుడు లోకంలో ధర్మాన్ని బోధించాడని ప్రచారం చేశారు. మహా సాంఘికులు సంస్కృతంలో రచించిన 'మహవస్తు' గ్రంథంలో పౌరాణిక వారసత్వాన్ని బుద్ధుడి జాతక కథలలో చొప్పించారు. బౌద్ధ సంఘం నుండి బహిష్కృతులైన మహా సాంఘికులు త్రిపిటక గ్రంథాలలో మార్పులు చేశారు. అభిదమ్మ పిటకలోని బుద్ధుని బోధనలను తొలగించారు. బుద్ధుని భూమిమీద భగవంతుని అవతారంగా చిత్రించారు.
బౌద్ధం మీద దాడి చెయ్యటానికి పాతవైదిక మతం నూతన బ్రాహ్మణ మతంగా రూపుదిద్దుకున్నది. భగవద్గీత నూతన బ్రాహ్మణ మతానికి ప్రమాణంగా నిలిచింది. భిన్న శాఖలకు చెందిన బ్రాహ్మణుల మధ్య సమన్వయం సాధించింది. విష్ణు పురాణం, మత్స్యపురాణం బుద్ధుడిని విష్ణువు అవతారంగా పేర్కొన్నాయి. బుద్ధుడిని తమ దేవుళ్ళలో ఒకడిగా మార్చి బ్రాహ్మణీకరించారు. నూతన బ్రాహ్మణమతం సంస్కృత భాషను దేవ భాషప్రచారంచేసి ప్రాచుర్యం కల్పించింది. నూతన బ్రాహ్మణ మతం వ్యాపించటానికి వారు కల్పించిన పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీత మొదలైన సాహిత్యం తోడ్పడింది.
బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం
———————————————————
భారతదేశంలో బౌద్ధం క్షీణించడానికి కొన్ని శతాబ్దాల కాలం పట్టింది. పైగా అది అనేక కారణాల వల్ల కూడా క్షీణిస్తూ వచ్చింది. గుప్తకాలం (320-650సీ.ఈ) పరిసమాప్తమైన తర్వాత, బౌద్ధ సంఘాలకు ఆర్థిక వనరులు తగ్గుతూ వచ్చాయి. అప్పుడు ఉన్న చిన్న చిన్న రాజ్యాల పరిపాలకులు హిందూ సంస్థలకు, బ్రాహ్మణులకు సహాయం అందిస్తూ ఉండేవారు. దానితో శైవులు, వైష్ణవులు బలపడుతూ వచ్చారు. రాజకీయంగా కూడా వారి పెత్తనం కొనసాగడం ప్రారంభమైంది. మరో వైపు బౌద్ధారామాల మీద బౌద్ధ భిక్కుల అజమాయిషి తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత కాలంలో 7-8 శతాబ్దాలలో వచ్చిన కర్కోటక, ప్రతిహర, రాష్ట్రకూట, పాండ్య, పల్లవ వంశాల రాజకుటుంబాలన్నీ హిందూ ధర్మం వైపు, బ్రాహ్మణవాదం వైపు మొగ్గుచూపాయి. అందువల్ల బౌద్ధారామాలు మార్చుకోవడం, బౌద్ధ విగ్రహాలు మార్చుకోవడం తేలికైంది. అంతకు ముందు వెయ్యి సంవత్సరాలుగా విస్తరించిన బౌద్ధం క్రమంగా బలహీన పడుతూ వచ్చింది.
భారతదేశపు ఉత్తర ప్రాంతం నుంచి హుణులు, మంగోలులు, పర్షియన్‌లు చొరబడ్డారు. ఢిల్లీ సల్తనత్ జనరల్ మహ్మద్‌బిన్ భక్తియార్ ఖిల్జీ బెంగాల్ బీహార్‌లలో ఇస్లాంను వ్యాపింపచేశాడు. నలంద, విక్రమశిల, ఒదంతపురి లాంటి వన్నీ ధ్వంసం చేశాడు. బౌద్ధ భిక్షువులను, మరోవైపు బ్రాహ్మణుల్ని కూడా అతి కిరాతకంగా చంపించాడు. ఆ ప్రాంతాలలో తనను తానే రాజుగా ప్రకటించుకున్నాడు.515సీ.ఈ.లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, ఉత్తర భారతదేశంలో చాలా భాగం హుణుడైన మిహిరకులుడి పరిపాలనలో ఉండేది. ఇతను బౌద్ధారామాలు, మొనస్ట్రీలు నాశనం చేయించాడు. 10-12 శతాబ్దాల మధ్య ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ముస్లిం చొరబాటుదారులు భారతదేశానికి వచ్చారు. వారికి విగ్రహారాధన సరిపడదు గనక, కనిపించిన బౌద్ధ విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేస్తూ పోయారు.
రాతి కట్టడంతో బలిష్టంగా ఉన్న నలందా విశ్వవిద్యాలయాన్ని ముస్లిం సైనికులు ఏదో కోట అనుకుని ముట్టడించారు. అందులో ఉన్న బౌద్ధ భిక్షువుల్ని బ్రాహ్మణులుగా భావించారు. అందరినీ నిర్దాక్షిణ్యంగా చంపారు. భక్తియార్ ఖిల్జీ దాడులకు తట్టుకోలేక బౌద్ధ భిక్షువుల్లో కొందరు టిబెట్‌కు, మరి కొందరు దక్షిణ భారతదేశానికి పారిపోయారు. పర్షియన్ యాత్రికుడు అల్ బిరుని జ్ఞాపకాలలో ఇలాంటి ఉదంతాలు నమోదై ఉన్నాయి. విలియం బోన్‌స్టన్, పీటర్ హార్వేలు కూడా ఆనాటి చారిత్రక సంఘటనల్ని నమోదు చేశారు. ఈ విధంగా బహిర్గతంగా ఇతర దేశీయుల దాడుల వల్ల కలిగిన నష్టం కోలుకోలేనిది. అయితే దానికంటే అధికంగా అంతర్గతంగా శతాబ్దాలపాటు వైదిక మత గురువులు చేసిన దాడులు, కుట్ర పూరితమైన వక్రీకరణలు బౌద్ధానికి ఎంతో నష్టం కలిగించాయి. వారే బౌద్ధం పునాదులపై తమ వైదిక ధర్మాన్ని స్థిరపరస్తూ వచ్చారు.
బుద్ధుణ్ణి తమ దశావతారాల్లో చేర్చుకోవడం ఒకటయితే, బౌద్ధారామా లన్నింటినీ ధ్వంసం చేయించి దేవాలయాలుగా మార్చుకోవడం రెండవది. బుద్ధుడి విగ్రహాల రూపురేఖలు మార్చి హిందూ దేవతా విగ్రహాలుగా తీర్చిదిద్దుకోవడం మూడవది. బౌద్ధం విధానాల్ని అనుకరిస్తూ, సామాన్య జనాన్ని ప్రభావితం చేస్తూ - క్రమంగా వారిని మూఢ భక్తిలోకి లాగడం నాలుగవది. సమాజంలో మూఢ విశ్వాసాల్ని విస్తరింపజేస్తూ, కులాలు వర్ణాలుగా జనాన్ని విడగొట్టడం ఐదవది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వీరి వారసులు 'భారత రాజ్యాంగం' స్థానంలో అధికారికంగా మనుస్మృతిని అమలు చేయాలని చూస్తున్నారు. ప్రజలు అది గమనించాలి!
బౌద్ధం పునాదులపై హిందూ మతాన్ని పునర్నిర్మించిన వాడు ఆదిశంకరుడు. బౌద్ధాన్ని అనుసరించి ఆ పద్ధతులను హిందూమతంలోకి తీసుకొచ్చారు. దశావతారాలను సృష్టించాడు. తెలివిగా బుద్ధుణ్ణి దశావతారాల్లో చేర్చాడు. ఆ విధంగా బౌద్ధులంతా 'హిందూ మతంలోకి రావాలని పథకం వేశాడు. జంతు బలులను ఆపాడు. ప్రసాదం - అంతకు ముందున్న మాంసాన్ని మార్చి శాఖాహారాన్ని ప్రవేశపెట్టాడు. బౌద్ధం పతనం కావడానికి ఆదిశంకరుడొక్కడే కారణం కాదు. ప్రధాన కారణం అతనే అయినా, ఇంకా ఇతర కారణాలు కూడా ఎన్నో ఉన్నాయి. బౌద్ధ భిక్కులు, బౌద్ధ సన్యాసులు విలాసాలకు అలవాటు పడి, బౌద్ధాన్ని మాయమంత్రాల ప్రభావంలోకి నెట్టేయడం వల్ల కూడా బౌద్ధం క్షీణిస్తూ వచ్చింది. అలాంటి సమయంలో ఆదిశంకరుడు బౌద్ధులతో వాదిస్తూ, తన వాదనా పటిమతో ఓడిస్తూ, రాజుల సహాయంతో వారిని చంపిస్తూ - నిద్రాణమై ఉన్న హిందూ మతాన్ని లేపి, తిరిగి నిలబెట్టాడు. కేవలం 32 సంవత్సరాలు జీవించిన ఆది శంకరుడి ప్రభావం హిందూ మతంపై అమితంగా ఉంది. స్మార్తులు, సంతులు ఆయన నెలకొల్పిన సంప్రదాయాలను ఆచరిస్తారు.
దశనమి సంప్రదాయం, షణ్మత విధానం, పంచయతన విధానం ఆయన ఏర్పరిచినవే. ఆదిశంకరాచార్య కేరళలోని కలడి అనే గ్రామంలో నంబూద్రి బ్రాహ్మణ దంపతులకు పుట్టాడు. తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి పెంపకంలో పెరిగి పెద్దవాడయ్యాడు. ఉపనయనం జరిపించిన తర్వాత ఆ తల్లి, కుమారుణ్ణి సన్యాసి కమ్మని పంపించింది. బాల శంకరుడు నర్మద - ఓంకారేశ్వర్ పరిసరాల్లో గోవింద భగవత్పాదులను కలుసుకుని, అతడికి శిష్యుడయ్యాడు. ఆ తర్వాత గంగానది ఒడ్డున కాశీలో, హిమాలయాల్లో, బద్రీనాథ్‌లో గడుపుతూ - అన్ని చోట్లా మీమాంస చేసేవాడు. అంటే ధార్మిక విషయాలు చర్చించేవాడు. ఆ రోజుల్లో ఇలాంటి చర్చలు ప్రజల మధ్య, ఒక్కోసారి రాజాస్థానాలలో జరుగుతూ ఉండేవి.
ఉపనిషత్తులు, భగవద్గీతపై ఆయన చేసిన విశ్లేషణలు జనాన్ని బాగా ఆకర్షించేవని చెపుతారు. బ్రహ్మచారులు, సన్యాసులు నివసించేది మఠం. అక్కడ దేవుణ్ణి ప్రతిష్టించిన తర్వాత అది పీఠమౌతుంది. శంకరుడు నాలుగు మూలలా నాలుగు మఠాలను స్థాపించాడు. వీటినే చతుర్మఠాలని అన్నారు. హిందూమతాన్ని పునర్జీవింపజేయడానికి ఆయన నెలకొల్పిన నిర్వహణ క్రమం వందల సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తోంది.
హిందూమత పునరుద్ధరణకు శంకరాచార్య మాత్రమే కాదు, రామానుజాచార్య కూడా కృషి చేశారు. అయితే దేవుళ్ళు వేరు వేరు కావడం వల్ల శైవులుగా, వైష్ణవులుగా విడిపోయి ఆధిపత్యం కోసం హౌరా హౌరి పోట్లాడుకున్నారు. విశాల దృక్పథం లేని వీరూ వీరి పూర్వీకులూ రాసుకున్న పురాణాల్లో తర్వాతి తరం వారికి ఎదగనితనం స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. కావాలంటే ఆ అతకని పొసగని ఆ కట్టుకథల్లోని అంశాలు మనం కూడా గమనించవచ్చు. ప్రహ్లాదుడు, విభీషణుడు,
పరుశురాముడు చాలా చాలా గొప్పవాళ్ళని భక్తులు భావిస్తుంటారు. వీరి వ్యక్తిత్వాలు గమనిస్తే, మొదటివాడు తండ్రిని చంపించగా, రెండోవాడు అన్నను చంపించాడు. ఇక మూడోవాడు పరుశురాముడు మాత్రం నేరుగా తల్లినే చంపాడు. అలాంటప్పుడు మనకూ, రాగలతరాల వారికి ఇలాంటి వాళ్ళు ఏం ఆదర్శం? సంస్కృతీ, సంప్రదాయాల గూర్చి గొప్పగా టముకు వేసేవారు ఆలోచించాలి. కుటుంబ సంబంధాల్ని, మానవ సంబంధాల్ని నిలుపుకోవడం ఇలాగేనా? డొంకతిరుగుడు వివరణలు ఇవ్వడం మాని, సూటిగా హేతుబద్ధంగా చెప్పగలిగిందేమైనా ఉంటే చెప్పాలి. నేటి సమాజంలో విపరీతంగా నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయంటే జరగవా మరీ? ఇలాంటి ఘనమైన నేర చరిత్రలు చెపుతూ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్నారు కదా? సామాజిక విలువలకు మన పురాణ రచయితలు ఏనాడో తిలోదకాలిచ్చారు. ఎదగని ఆలోచనా ధోరణిలో శతాబ్దాల క్రితం ఆయా రచయితలు ఏవేవో రాశారు.
అవి ఈ కాలానికి, ఈ సమాజానికి ఎంత మాత్రమూ పనికిరావని స్పష్టంగా తెలుస్తూ ఉంది. వారి కంటే ఈ తరంవారు ఎంతో ప్రగతిశీలురు, ప్రపంచ జ్ఞానమున్న మా'నవ'వాదులు! అందువల్ల ఈ కాలానికి అనుగుణంగా విషయాలలో మార్పులు చేసుకోవడం తప్పని సరి అవుతోంది. ద్వందనీతి, ద్వంద ప్రమాణాలు పురాణ సాహిత్యంలో తప్పని సరిగా ఉంటాయి. ఉదాహరణకు దుశ్శాసనుడు సభలో ద్రౌపతి చీరను లాగితే - అది భారత యుద్ధానికి దారి తీసింది. మహిళను అవమానించడం నేరం. బుద్ధీ, జ్ఞానం ఉన్నవాడెవడూ ఆ సంఘటనని సమర్థించడు. అది సరే, మరి శ్రీకృష్ణుడు పట్టపగలు వేల మంది స్త్రీల చీరలు దొంగిలించుకుని వెళ్ళి చెట్టెక్కి కూర్చునేవాడు కదా? పైగా వేణువూదేవాడు. వాళ్ళేమో నగంగా దీనంగా వేడుకునేవారు. (ఇదంతా వాళ్ళు రాసిందే. మనం ఇప్పుడు కల్పించింది కాదు) మరి అక్కడ ఏ యుద్ధమూ జరగలేదు. పైగా భక్తి పారవశ్యంలో అదంతా భాగవతమై కూర్చుంది!
సరస్వతి ఎప్పుడూ, ఎవరికీ అక్షరాలు నేర్పిన దాఖలాలు లేవు. మరి చదువుల తల్లి ఎలా అయ్యింది? లక్ష్మీదేవి ఎవరికీ చిల్లిగవ్వ విదిల్చినట్టు ఆధారం ఎక్కడా నమోదు కాలేదు. సిరిసంపదలన్నీ ఆమే ఇస్తూ ఉందన్న కథనానికి రుజువుందా? పోనీ, గంగా గంగా అంటారు కదా? ఆమె పంటల సాగుకోసం ఏ రైతు కైనా దోసెడు నీళ్ళిచ్చినట్టు ఏ పురాణంలోనూ ఎందుకు లేదూ? దాహం తీర్చడానికి ఏ బాటసారికైనా దోసెడు నీళ్ళిచ్చిందా? దేనికీ ఆధారాలు, రుజువులు లేనప్పుడు ఎందుకీ ఝాటా మాటలు? ఎందుకూ ఎలా వీళ్ళంతా మన దేవతలయ్యారూ? ఇందులో ఏమైనా కుట్రకోణం ఉందా?
- డాక్టర్ దేవరాజు మహారాజు
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
Comments
Post a Comment