బౌద్ధం మహిళల గురించి ఏం చెప్పింది?
భారతదేశంలో బౌద్ధ తాత్విక విప్లవం అనేక మార్పులను తీసుకు వచ్చింది. అందులో ప్రధానంగా స్త్రీల వ్యక్తిత్వ నిర్మాణానికి బౌద్ధం చేసిన కృషి చారిత్రాత్మకమైంది.
బౌద్ధాన్ని అశోకుడు స్వీకరించిన తర్వాత అది తాత్విక దశ నుంచి సామాజిక దశకు విస్తరించింది.భారతదేశం బౌద్ధ భూమిగాను, విముక్తి మార్గంగాను ఆనాడు గోచరించింది. క్రీ.పూ. 5 వ శతాబ్దం నుంచి క్రీ.శ. 8 వ శతాబ్దం వరకు బౌద్ధ సంస్కృతి తన అహింసా సిద్ధాంత ఆచరణని భారతదేశంలో ప్రతిఫలింపచేయగలిగింది.ఈ మొత్తం కృషిలో స్త్రీలదే ప్రధాన పాత్ర. సిద్దార్ధ- యశోధరల వివాహాన్ని బట్టి ఆనాడు బాల్య వివాహాలు లేవు. వారిద్దరు సమ వయస్కులని కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు. వివాహాన్ని బౌద్ధులు ఆదిలో పవిత్రమైందిగా ఎంచలేదు. వివాహాన్ని సామాజిక, ఆర్థిక ఒప్పందంగానే భావించారు.* *అవసరమైనప్పుడు విడిపోయి బౌద్ధ బిక్షువులుగా చేరవచ్చు. ఒకసారి బుద్దుణ్ణి పెంచిన మహాప్రజాపతి గౌతమి బౌద్ధ మతంలో చేరాలని నిశ్చయించుకుని...బుద్దుణ్ణి ఆశ్రమంలో చేర్చుకోమని ప్రాధేయపడుతుంది.* *అయితే బుద్దుడు నిరాకరిస్తాడు. దాంతో బుద్దుడి శిష్యుడైన ఆనందుణ్ణి అడుగుతుంది. ఆనందుడు ఆమె తరపున వాదిస్తాడు. 'నీవు పెంచిన తల్లికే ఆశ్రమంలో స్థానం ఇవ్వకుండా నిర్యాణం ఎలా పొందగలవని' ప్రశ్నిస్తాడు. చివరకు బుద్దుడు ఆ తల్లికి ఆశ్రమ ప్రవేశాన్ని కలిగించాడు. ఆ సందర్భంలో ఆనందునితో బుద్దుడు 'స్త్రీల ప్రవేశం లేకపోతే బౌద్ద మతం వెయ్యి సంవత్సరాలు జీవించగలదని, స్త్రీల ప్రవేశంతో 500 సంవత్సరాల కంటే జీవించదని' చెప్పాడు. అయితే అందుకు విరుద్ధంగా బుద్దుడు మరణించి 2500 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ బౌద్ధం బతికే ఉంది.*
*బుద్దుడు తన జీవిత కాలంలో స్త్రీల పట్ల కొన్ని సమయాల్లో వైముఖ్యతను ప్రకటించాడు. బౌద్ద బిక్షువులకు ''స్త్రీలను వీలున్నంత వరకు చూడవద్దని, చూడవలసి వస్తే మాట్లాడవద్దని, మాట్లాడవలసి వస్తే జాగ్రత్తగా మెలగమని బుద్దుడు ప్రబోధించాడు.* *అయితే తన సమకాలీన స్త్రీల పట్ల దయతో ప్రవర్తించేవాడు. పురుషులు స్త్రీలతో ముఖాముఖి మాట్లాడేవారు. స్త్రీలు మాత్రం దూతల ద్వారా తమ విషయాలను చెప్పుకొనేవారు. కొన్ని సందర్భాల్లో బుద్దుని అనుయాయుల్లో కూడా స్త్రీల పట్ల తక్కువ భావం ఉండేది. బుద్దుడు చనిపోయినప్పుడు స్త్రీల కన్నీటితో తడవడం వల్ల ఆయన శరీరం అపవిత్రం అయిందని బౌద్ద బిక్షవులు ఆనందుని విమర్శించారు.*
*అయితే ఆ కాలంలో మన దేశంలో 'సతి' దూరాచారం కనిపించలేదు. భర్త మరణించిన తరువాత భార్యపై వైదిక సంస్కృతి రుద్దిన మూఢాచారాలన్నింటినీ బౌద్దం వ్యతిరేకించింది.* *ప్రారంభంలో కంటే రానురాను స్త్రీ సమత్వం అభివృద్ధి చెందింది. ఎందరో ఉన్నత వర్గాల స్త్రీలు ఆస్తులు, అంతస్తులు, సంసార బంధాలను వదలి బౌద్ద దీక్షను స్వీకరించారు.* *వైశాలి సైన్యాధికారి మేనకోడలు సిన్హా వంటి వారెందరో బౌద్ద మతాన్ని స్వీకరించారు. అశోకుని కుమార్తె సంఘమిత్ర బౌద్ద సన్యాసినిగా ఎందరికో మార్గదర్శికమై సింహళంలోనే నిర్యాణం పొందింది. సౌందర్య లాలసత్వంలో నిగ్రహాన్ని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన ఎందరో స్త్రీలకు సరైన మార్గాన్ని చూపి జీవితానికి లక్ష్యాన్ని, గమ్యాన్ని ఏర్పరచింది బౌద్దం. ప్రత్యేకించి వివాహం పట్ల బౌద్దం స్త్రీని గురించి ఆలోచించిన పద్ధతి స్త్రీ ఆత్మగౌరవానికి దోహదం చేసే రీతిలో వుంది. ఆ రోజుల్లో బహుళ ప్రచారంలో ఉన్న పరదా పద్ధతిని బౌద్దం నిరసించింది. స్త్రీల శీల రక్షణ ముఖ్యంగా వారి మానసిక బలంపై ఆధారపడి ఉంటుందేకాని, పరదాల పద్ధతి వల్ల కాదని బౌద్దం నమ్మింది. యశోధర ముసుగు లేకుండా ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ఎన్నో విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. దానికి సమాధానంగా స్త్రీల మానసిక బలాన్ని ఉత్తేజపరుస్తూ ముసుగు పద్ధతిని నిరిసించింది. బౌద్దం బహు భార్యత్వాన్ని, బహు భర్తృత్వాన్ని నిరసించింది. టిబెట్, చైనాలలో కూడా బౌద్దం ఈ పద్ధతినే ప్రచారం చేసింది. మూడు రకాలైన వివాహ పద్ధతులను బౌద్దం ప్రవేశపెట్టింది. పెద్దల ఆమోదంతో జరిగేవి, మధ్యవర్తుల సహకారంతో జరిగేవి, ప్రేమ వివాహాలు. వివాహంలో స్త్రీ, పురుషుల పరస్పర అవగాహనకే ప్రాధాన్యత. మైనరుకు కూడా పెళ్ళి చేసుకునే హక్కు ఉంది కాని నిర్ణీత సమయం లోపల పెద్దలు అభ్యంతరం పెట్టవచ్చు. 20 సంవత్సరాలు వచ్చిన ఆడవాళ్లకు అప్పటి వరకు తల్లిదండ్రులు వివాహం చేయకపోతే వారే సత్వంత్రించి వివాహం చేసుకొనే హక్కును బౌద్దం కలిగించింది. అది చట్ట సమ్మతం, సంఘ సమ్మతం కూడా అవ్వడం గమనించవలసిన విషయం. స్త్రీ పునర్వివాహానికి అర్హురాలుగా బౌద్దం ప్రకటించింది. భర్త బౌద్ద సన్యాసం తీసుకొన్నప్పుడు అతని మనస్సులో మార్పు రావడానికి ఒక వారం రోజుల వరకు సమయం ఇచ్చి ఆమె పునర్వివాహం చేసుకొనడానికి అవకాశం ఇచ్చింది. వితంతువులు, విడాకులు పుచ్చుకున్న స్త్రీలు కూడా పునర్వివాహానికి అర్హులని బౌద్ద సంఘం ప్రకటించింది. దీనిని బట్టి వివాహ విషయంలో స్త్రీకి బౌద్ద రాజ్యాలు పూర్తి స్వేచ్ఛను చట్టబద్ధంగా కలిగించినట్లు స్పష్టమవుతుంది.* *పురుషులతో పాటుగా సమత్వాన్ని పొందటానికి ఆనాటి స్త్రీని బౌద్దం సన్నద్ధం చేసిన తీరు సమున్నతమైనది.*
*కాలం గడిచేకొద్దీ బౌద్దం స్త్రీని సరైన దృక్పథంలో అర్థం చేసుకొంది. స్త్రీకి సమత్వాన్ని సమకూర్చింది. స్త్రీ బానిసత్వ విముక్తికై ఎలుగెత్తి పిలుపునిచ్చింది. అయితే బౌద్దం భారతదేశంలో కనుమరుగయ్యేకొద్దీ స్త్రీకి సంకెళ్ళు బిగుసుకున్నాయి. వైదిక సంస్కృతే హిందూ మతంగా పరిణామం చెంది అసమ సమాజానికి ఉక్కు కవచాలు పూన్చింది. ఈ సమాజంలో స్త్రీ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు మరలా తిరోగమించాయి. వర్ణ వ్యవస్థను, పితృస్వామిక వ్యవస్థను, స్త్రీ బానిసత్వాన్ని పునరుద్ధరించారు. హిందూ ధర్మశాస్త్ర కర్తలైన గౌతముడు, మనువు, పరాశరుడు మొదలగువారు ఈ విషకర్మలో ప్రధానపాత్ర వహించారు. వీరి విషపూరిత ధర్మశాస్త్రాలను పరిశీలించటం ద్వారా వైదిక సంస్కృతి స్వభావం మనకు స్పష్టమవుతుంది. 'ఈ భూమి మీద ఏదీ శాశ్వతం కాదు. ప్రతిదీ పరిణామం చెందుతుందని' బుద్దుడు సూత్రీకరించాడు. రాహూల్ సాంకృత్యాయన్ బుద్దుని పరిణామవాదాన్నే అనిత్యవాదం అని పేర్కొన్నాడు.*
*బౌద్ధంలో స్త్రీ సాంస్కృతిక ఉద్యమం ప్రపంచవ్యాప్తమైంది. స్త్రీ ఒక బౌద్దాన్నే కాదు. జైన ఉద్యమాన్ని, సాంఖ్య ఉద్యమాన్ని, స్వాతంత్రోద్యమాన్ని, కమ్యూనిస్టు ఉద్యమాన్ని భారతదేశంలో విస్తృతం చేసింది. స్త్రీ మాతృభావన కలిగినటువంటింది. దళిత ఉద్యమంలోనైతే స్త్రీయే ప్రధాన పాత్ర వహించింది. తల్లిగా, అక్కగా, చెల్లెలుగా, భార్యగానే కాక ఒక ఉద్యమకారిణిగా ఆమె త్యాగపూరితమైన పాత్ర వహించగలుగుతుంది. ఇప్పటికే ఇంటా బయటా మహిళదే మహౌజ్వలమైన పాత్ర. వర్ణాధిక్య భావననను బలహీనపర్చాలంటే అశోకునిలాగా ఉద్యమాల్లో స్త్రీలకు ప్రధాన పాత్రను ఇవ్వవలసి ఉంది. భారతదేశంలోని అన్ని ఉద్యమాలు ఏదో ఒక మేరకు పురుష ప్రాధాన్యంగా నడుస్తున్నాయి. స్త్రీలకు తప్పక సగభాగం కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడు ఉద్యమంలో తల్లితనం వస్తుంది. కుల నిర్మూలనా భావజాలం అభివృద్ధి చెందుతుంది. శిల్పం, చిత్రలేఖనం, గానం, సాహిత్యం, రచన ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చెందుతాయి. వైదిక భావజాలంలో కుటుంబం ఉంటే సాంస్కృతిక విప్లవాన్ని తీసుకురాలేం. బౌద్ధంలో స్త్రీ వాదం బలంగా ఉంది. కరుణ, ప్రేమ, ప్రజ్ఞ ఇవన్నీ కూడా స్త్రీకి సహజమైన గుణాలు. వీటినే బౌద్ధం సామాజిక, సాంస్కృతిక, తాత్విక విప్లవంగా మార్చింది. అందుకే బౌద్ధ స్త్రీ సాంస్కృతిక విప్లవం వర్ణాధిక్య భావనకు ప్రత్యామ్నాయం. ఆ దిశగా భారతీయ సమాజం నడవాలి.
Comments
Post a Comment