జాతక కథల నేపథ్యం
బుద్ధుని నిర్వాణం (మరణం) తరువాత మగధ రాజధాని రాజగృహలో క్రీ.పూ. 483లో బౌద్ధ బిక్షువులతో మొదటి సంగీతి (సమావేశం) మహాకాశ్యప అధ్యక్షతన జరిపారు. ఈ సమావేశంలో ఆనందుడు, ఉపాలి మొదలైన
బౌద్ధ బిక్షువులు పాల్గొన్నారు. బుద్ధుని బోధనలు విన్నవారందరూ తాము విన్న వాటిని చెప్పగా వాటినన్నింటిని క్రోడీకరించి రెండు గ్రంధాలుగా తీసుకువచ్చారు. ఆవి (1) సుత్తపిటక (2) వినయపిటక . (తాటాకు గ్రంథాలను ఉంచే పెట్టెను పిటక అని పాళీ భాషలో అంటారు)
వందేళ్ళ తరువాత మళ్లీ రెండవ సంగీతి ఏర్పాటైంది. క్రీ.పూ. 247లో అశోకుని కాలంలో అశోకుడు, మొగ్గలిపుత్తతిస్స మొదలైన వారందరూ పాల్గొన్న మూడవ సంగీతి జరిగింది. ఆ సమావేశంలో మూడో గ్రంథం 'అభిదమ్మ పిటక' తయారైంది. వినయ, సుత్త, అభిదమ్మ... ఈ మూడింటిని "త్రిపిటకాలు' అంటారు.
బౌద్ధ సాహిత్యం మూడు భాగాలైన త్రిపీటకాలలో ఉంది. మొదటి భాగం సుత్తపిటక. సుత్త అంటే సూత్రాలు.పిటక అంటే పెట్టే లేదా గంప. ఇందులో ఐదు నికాయలు (భాగాలు) ఉన్నాయి. దీనిలో బుద్ధుని ఉపన్యాసాలు, సంవాదాలు ఉంటాయి.
రెండో భాగం వినయపిటక. ఇందులో బిక్షువుల నియమాలు, క్రమశిక్షణ ఉంటాయి. దీనిలో మూడు భాగాలున్నాయి. (1) సుత్త విభాగ (2) ఖండిక (3) పరివార.
మూడవ భాగం అభిదమ్మ పిటక.ఇందులో వివిధ మనోవైజ్ఞానిక విషయా లున్నాయి. తాత్విక భావజాలాలున్నాయి. దీనిలో 7 భాగాలున్నాయి.
(1) ధమ్మసంగణి (2) విభంగ (3) కథావత్తు (4) పులపరాత్తి (5) ధాతుకధ (6) యమక (7) పత్తాన. ఈ మూడు గ్రంథాలేకాక 'మిళింద ప్రశ్నలు' అనే గ్రంథం ఉంది. ఇందులో గ్రీకు రాజు మిళిందునికి బౌద్ధ పండితుడు నాగసేనునికి మధ్య జరిగిన సంవాదం ఉంటుంది.
సుత్త పిటకలో బుద్ధుని బోధనలు, వినయపిటకలో ఆచార వ్యవహారాలు, అభిదమ్మ పిటకలో బుద్ధుని తాత్విక భావజాలాలున్నాయి.
బుద్ధుని బోధనలున్న సుత్తపిటకలో చివరి అధ్యాయం పేరు 'బుద్ధ నికాయా'. ఇందులో 423 కథలు, 547 జాతక కథలు 'ధమ్మపాద' పేరుతో ఉన్నాయి. వీటిని క్రీ.పూ. 300- క్రీ.శ. 400 మధ్యలో పాళీభాషలో రాయబడినాయి . ఇందులో మనిషి పాటించాల్సిన నీతినియమాలు, ధర్మాలు, త్యాగంతో పాటు చక్కని సందేశం ఉంటాయి. ఈ కథలన్నీ వారణాసి చుట్టూ అల్లబడినాయి.
క్రీ.శ. 100లో కనిష్కుని కాలంలో కుందల వనంలో నాలుగవ బౌద్ధ సంగీతి జరిగింది. దీనికి వసుమిత్రుడుఅధ్యక్షునిగా, అశ్వఘోషుడు ఉపాధ్యక్షునిగా ఉన్నారు. 500 మందిబౌద్ధభిక్షువులు పాల్గొన్నారు. వీరంతా త్రిపీటికాలపైనా, ఇతర బౌద్ధ సాహిత్యంపై చర్చ చేసి “మహావైభాషిక శాస్త్ర' పేరుతో గ్రంథాన్ని వెలువరించారు.
దీనిని బౌద్ధ సాహిత్యంలో విజ్ఞాన సారస్వతంగా పండితులు గుర్తించారు. సుత్తపిటకలోని బుద్ధనికాయంలో జాతక కథలు 547 ఉన్నాయి. ఈ కథలను బుద్ధఘోషుడు, మహేంద్రుడు శ్రీలంకకు తీసుకెళ్లి అనురాధపురంలో మహావిహారలో మహా స్థవిర సంఘపాలుని వద్ద అధ్యయనం చేసినారు.
వీటిని పాళీభాషలో రచించారు.
బుద్ధుని మరణానంతరం బుద్ధుడు మళ్లీ మళ్లీ జన్మిస్తాడని కొందరు బౌద్ధ బిక్షువులు భావించారు. వీరు మహాయాములయ్యారు. వీరు బుద్ధుడు దేవుడు లేడని, ఆత్మ లేదని ఖండితంగా చెప్పలేదని కొందరు వాదించారు.
బుద్ధుడు పునర్జన్మ లేదన్నాడని, బుద్ధుడు నిర్యాణం (మరణం) చెందాడని ఆయనకు మళ్లీ జన్మలేదని ఆయన చెప్పిన ధర్మాలే శాశ్వతాలని భావించిన వారు థేరవాదులయ్యారు. బుద్ధుడు హేతువాది, అనుభవవాది. అందువల్ల బౌద్ధంలో దేవుడు, ఆత్మ, విముక్తి వంటివి లేవని భావించారు.
మహాయానుల ప్రకారం రాయబడిన జాతక కథలు ప్రధానంగా బుద్ధుని జన్మల గురించి చెపుతాయి. ఇందులో గౌతముడు, బుద్ధుడు కావడానికి ముందు 547 జన్మలు ఎత్తినాడని చెప్పినారు. జాతక కథలు 20 నిపాతాలు (భాగాలు)గా వచ్చాయి. ప్రథమ నిపాతంలో 150 కథలున్నాయి. ఇతర నిపాతాల్లో కొన్ని కథలు, ప్రతి
కథలోనూ ఒక శ్లోకం (కవిత) ఉన్నాయి. ఇవన్నీ ఒకే కాలంలో రాయబడినవి కావు. వేర్వేరు బిక్షువులు, వేర్వేరుషకాలాల్లో రాయడం వల్ల ఇలాంటి కథలు వచ్చాయి. మొత్తం మీద 547 కథలున్నాయి. ప్రతి కథలోనూ బుద్ధుని ధర్మోపదేశం ఉంటుంది.
థేరవాద బౌద్ధుల ప్రకారం జాతక కథలు పాళీ బాషలో చెప్పబడిన బుద్ధుని బోధనలు. ఇది సుత్త పిటక గ్రంథంలో కుద్ధక నికాయంలో ఉన్నాయి. వీటిని క్రీ.పూ. 4వ శతాబ్దంలో రచించారు.బహుశా బుద్ధుని తరువాత 50 నుంచి 150 సం॥ల తరువాత పాళీ భాషలో రచించారని చరిత్రకారులు భావిస్తున్నారు.
ఆంధ్రదేశంలో జాతక కథలను వాస్తవ కథలుగా భావించారు. వీటిని అమరావతి, నాగార్జున కొండ, స్థూపాలపై చెక్కినారు. సాంచి, బారహుత స్థూపాల మీద కూడా చెక్కినారు. అజంతా గుహలలో 34 జాతక కథలను క్రీ.పూ. 6వ శతాబ్దంలో చిత్రించారు.
జాతక కథల్లో బుద్ధుడు బోధి సత్వునిగా జన్మించాడు. ఈ బోధిసత్వుడు రాజుగా, తపస్విగా, వృక్ష దేవతగా, బ్రాహ్మణునిగా కనిపిస్తాడు. సింహం, ఏనుగు, గుర్రం, వక్క జన్మలు కూడా ఎత్తినట్లు కథల్లో చెప్పినారు. కథలన్నీ గద్యరూపంలోనూ, కవితల రూపంలోనూ చెప్పినారు. ఇవన్నీ సమాజంలో నైతిక ధర్మాలతో నడవడానికి జంతువుల కథలతో చెప్పేవారు.
పునర్జన్మ గురించి ఊసేలేని బౌద్ధంలో బుద్ధుడు మళ్లీ జన్మలు ఎత్తినట్లు జాతక కథలను అల్లడం వెనుక కారణం పునర్జన్మను విశ్వసించే హిందూ మతాన్ని ఎదుర్కోవడానికి చేసిన పనై ఉంటుందని జయంతి పాపారావు భావించారు. ఆయన పరిశోధన ప్రకారం జాతక కథలు ప్రపంచ సాహిత్యాన్ని ప్రభావితం చేశాయి. డాంటే రాసిన 'డివైన్ కామెడి' కి 'నిమి' జాతక కథే ఆధారమని, పంచతంత్ర కథలకు, నీతిచంద్రిక కథలకూ జాతక కథలే ఆధారమని ఆయన పేర్కొన్నారు. గ్రీకు రచయిత రైస్ డేవిడ్స్ ప్రకారం ఈసప్ ప్రతి కథకూ జాతక కథలే మూల వస్తువులని నిరూపించారు. 8వ శతాబ్దంలో అరబ్బులు జాతక కథలను స్పెయిన్, ఇటలీ దేశాల్లో ప్రచారం చేసినారు.
జాతక కథలు అనేక పేర్లతో ఉన్నాయి. అందులో మచ్చుకు కొన్ని .... కట్టుహారి జాతకం, సురాపాన జాతకం, కురుధమ్మ జాతకం, తెరవణిజ, మహావణిజ జాతకాలు, అపణ్ణక జాతకం, అబ్బంతర జాతకం మొదలైనవి.
జాతక కథల్లో అనేక తెలుగు పదాలున్నాయి. గారవము, బొంద, అయ్యా,అక్క ,అప్ప సామి వంటి
పదాలున్నాయి. ఆ విధంగా తెలుగు భాష తన ప్రాచీనతను బౌద్ధం ద్వారా నిలబెట్టుకుంది.
భారతీయ సాహిత్యంలో విశిష్ట స్థానం పొందిన బౌద్ధ సాహిత్యం అందులోని జాతక కథలు కథాసాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
- పిళ్లా కుమారస్వామి , 9490122229
Comments
Post a Comment