బౌద్ధ ధర్మాల దర్పణం 'బౌద్ధ ధర్మసారం'


            బౌద్ధంపై ఇంతవరకు వచ్చిన పుస్తకాలలో అత్యుత్తమమైనదని అంబేద్కర్ కొనియాడిన గ్రంధం
'బౌద్ధధర్మసారం'. ఈ గ్రంధాన్ని ఆంగ్లంలో వెలువరించిన ప్రధమ తెలుగు రచయిత లక్ష్మినరసు,
ఆయన బౌద్ధాన్ని ఆధునిక శాస్త్ర విజ్ఞానపు వెలుగులో పాఠకులకు అర్థమయ్యే విధంగా రాసినాడు.
           లక్ష్మినరసు భౌతికశాస్త్ర ఆచార్యులుగా మద్రాసు క్రిష్టియన్ కాలేజీలో పనిచేశారు. ఆయన ఈ గ్రంధాన్ని 1911లో రచించారు. ఈ గ్రంధాన్ని ఎంతో అర్ధవంతంగా చక్కని సరళమైన తెలుగులోకి
అనువదించాడు చంద్రశేఖర్, బౌద్ధ ధర్మాలను, బౌద్ధంలో వున్న సుగుణాలను, మనిషి పరివర్తన చెందడంలో బౌద్ధ ధర్మం ఉపయోగపడే విధానాన్ని ముఖ్యంగా బౌద్ధంలో వున్న విశిష్ట లక్షణాలను శాస్త్రీయంగా వివరిస్తాడు రచయిత. ఈ గ్రంధాన్ని చదివిన ఏ పాఠకునికైనా బౌద్ధం పట్ల ఆసక్తి, అనురక్తి ఏర్పడటం సహజం.
           మానవుని కేంద్రంగా చేసుకుని సమాజం సజావుగా నడవడానికి, మనిషి ఆనందంగా
జీవించడానికి ఒక ప్రాపంచిక దృక్పథాన్ని బౌద్ధం అందించిందని రచయిత మనకు చక్కగా వివరిస్తాడు.
         బహుజనుల హితంకోసం, బహుజనుల సుఖం కోసం ధర్మాన్ని ప్రజల భాషలో బోధించాలని బుద్ధుడు తనతోటి బౌద్ధులను కోరాడన్నాడు. మహిమలను, అతీంద్రియ శక్తులను, దైవభావనలను నిరాకరిస్తూ ప్రజలకు జ్ఞానమార్గం బోధించమని బుద్ధుడు చెప్పినట్లు రచయిత మనకు ఎరుకపరుస్తాడు.
         స్త్రీ పురుషుల పట్ల సమభావాన్ని ప్రదర్శిస్తూ, పేద, నిమ్నవర్గాలనే అంతరాలను చూడకుండా
కేవలం 3500 సం||రాల క్రిందటే బుద్ధుడు అర్హతులైన వారందరిని బౌద్ధ సంఘంలోకి చేర్చుకున్నట్లు
రచయిత బుద్ధుని విశిష్ట లక్షణాన్ని తెలియచేశాడు. అంతేగాక బ్రాహ్మణునికి, చండాలునికి మధ్య
వున్న తేడా కూడా బౌద్ధం ఏవిధంగా చూడలేదో వివరించాడు. బుద్ధుడు బౌద్ధ సంఘంలోకి
అంగులీమాలుడనే భయంకర నేరస్తున్ని, చండాల యువకుడు సునీతను, బెస్తవాడైన స్వాతిని, పశు
వుల కాపరి నందుని, మంగలి ఉపాలిని చేర్చుకున్నాడు. అలాగే నాట్యకళాకారిణి, ఆమ్రపాలిని, వ్యభిచారిణి విమలను, బానిస కూతురు పూర్ణను, వేటగాని కుమార్తె చంపాను తన బిక్షుణి సంఘంలో చేర్చుకున్నాడు. బౌద్ధ దేశాల్లో స్త్రీలకు ఎలాంటి ఆంక్షలు లేవు. శ్రీలంకలో స్త్రీలకు స్వేచ్ఛ, సమానత్వం చాలాకాలం నుంచే ఉన్నాయి. థాయిలాండ్ లో స్త్రీలు అనేక సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇది బౌద్ధం అందించిన సుగుణమని రచయిత వివరిస్తాడీ గ్రంథంలో.
           మానవుని అసలైన లక్ష్యాలు, మానవ శక్తుల వికాసమని అది బౌద్ధం ద్వారా సాధ్యమవుతుందని
రచయిత సవివరంగా చెపుతాడీ గ్రంధంలో. పంచశీల, అష్టాంగ మార్గాలను ఆచరించగలిగిన వ్యక్తి మనస్సు ఎంతో వికాసం చెందుతుంది. నైతికంగా అత్యున్నత స్థాయిలో ఉండగలుగు తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. బుద్ధుడు తన ధర్మాలన్నింటికి నైతికతను ప్రాతిపదికగా తీసుకున్నాడు.
          మూగజీవులను బలివ్వడం కన్నా, ప్రేమతో ఒక జీవిని కాపాడినా గొప్ప ఫలితముందని బౌద్ధం
చెపుతుంది. సరదాకోసం, బలికోసం, యుద్ధం కోసం జరిపే ప్రాణహానిని బౌద్ధం పూర్తిగా నిరాకరించింది.
దురాశాపూరిత వ్యాపారలాభం కోసం చేసే దురాక్రమణ, సామ్రాజ్యవాదం; దొంగతనం,
దోపిడీల కొనసాగింపేనని రచయిత లక్ష్మినరసు స్పష్టంచేస్తాడు. ఇలాంటి దొంగతనాన్ని, దోపిడిని
బౌద్ధం నిషేధించింది. వ్యక్తికి, సమాజానికి “పంచశీల" పూర్తిగా ఆవశ్యకమైనవని రచయిత పాఠకునికి
తేటతెల్లం చేస్తాడు. ఆక్రమసంబంధాలు, అనర్ధదాయకమని బౌద్ధం చెప్పింది. స్వాములు, బాబాల పేరుతో సాగిస్తున్న అనేక లైంగిక కార్యకలాపాలు ధర్మ ప్రవర్తకులను నివ్వెర పరుస్తున్నాయని, వీటిని బౌద్ధం పూర్తిగా వ్యతిరేకిస్తున్నదని రచయిత మనకు స్పష్టం చేస్తాడు. ధర్మమార్గంలో నడిచే వారందరూ ఆమోదయోగ్య మైన సెక్సును పాటించడం అవసరమని బౌద్ధం చెప్పినట్లు రచయిత తెలియజేస్తాడు.
పెళ్ళిళ్ళు ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనే పునాదులపై జరగాలని, కాని నేటి సమాజంలో
కట్నకానుకలు, కుల కట్టుబాట్లు, మత విశ్వాసాల పునాదులపై జరుగుతున్నాయని ఆయన ఆవేదన
వ్యక్తం చేసినాడు. భాగస్వామి ఎంపికలో ఆరోగ్యం, ఆలోచన, హృదయ స్పందనలు ప్రధానమని
రచయిత ఉద్భోదించాడు.
         బౌద్ధం మత్తు పదార్థాల సేవనాన్ని పూర్తిగా నిషేధించింది. భారతదేశంలో సంపూర్ణ మద్యపాన
నిషేధాన్ని పాటించినవారు బౌద్ధులేనని రచయిత లక్ష్మినరసు స్పష్టం చేస్తాడు. కానీ నేడు పాలకులు
మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా భావిస్తూ లక్ష్యాలు నిర్ణయించుకుని ప్రజలను మద్యానికి బానిస
చేస్తుందడం అత్యంత శోచనీయం.
            సమాజంలో మంచి పనులు చేయడం ద్వారా దుఃఖవిముక్తి పొందడానికి మార్గాన్ని
ఏర్పరుచుకోవచ్చని బౌద్ధం చెబుతుందంటాడు రచయిత. మంచి పనులు చేయడం నియమబద్ద
జీవితం ద్వారా సాధ్యమవుతుందని చెపుతాడు రచయిత. ముఖ్యంగా సోమరితనాన్ని, కోపాన్ని
బౌద్ధాన్ని ఆచరించడం ద్వారా వదలిపెట్టగలడని రచయిత స్పష్టంచేస్తాడు. ఆత్మనిగ్రహం ఏర్పడి
కోపంనశించి ప్రేమగా వుంటారంటాడు. సుఖలాలస తగదని, పంచశీల జీవితం తగినదని బోధిస్తాడు
రచయిత.
           రచయిత స్వతహాగా భౌతికశాస్త్ర ఆచార్యుడు కావడంవల్ల బౌద్ధం చెప్పే శాస్త్ర విజ్ఞాన
విషయాలను వివరిస్తూ అనేక విజ్ఞానాంశాలను తెలియజేస్తాడు. హేతువాద భావాలకు ప్రాతిపదికైన
కార్యాకారణ సంబంధాన్ని వివరించాడు. ప్రతి పదార్థం మార్పుచెందుతుందన్న విషయాన్ని బౌద్ధం
చెప్పిందన్నాడు. మార్క్స్ దానిని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి పదార్ధంలో మార్పు అంతర్గత,
బాహ్య ఘర్షణ కారణాలవల్ల జరుగుతుందన్నాడు. ప్రపంచంలో ప్రతిదీ ఇంకోదానితో పరస్పర
సంబంధం కలిగి వుంటుందని బౌద్ధం చెపుతుంద న్నాడు. ఐన్ స్టీన్ సిద్ధాంతం దీనిని నేడు
ధృవపరుస్తోంది. ఇలా బౌద్ధంలోని అనేక వైజ్ఞానిక విషయాలను చర్చిస్తాడు రచయిత.
         మనిషి తన ప్రవర్తనను నియంత్రించు కోవడానికి బుద్ధుడు ఎనిమిది మార్గాలను సూచించాడు.
            ఈ మార్గాలతో పాటు బుద్ధుడు విపస్సన ధ్యానాన్ని ప్రవేశపెట్టాడు. మన ఆలోచనలను సంకల్పం ద్వారా నియంత్రించుకోవడానికి ఈ ధ్యానం ఉపకరిస్తుందని రచయిత వివరించాడు. అందువల్ల
బౌద్ధంలో ఈ ధ్యానానికి ప్రముఖ స్థానం ఉంది. బౌద్ధం పలాయనవాదం కాదు. నిరాశావాదం అంతకంటే కాదు. ఇది కోరికలను త్వజించమంటుంది. అంటే అభివృద్ధిని ఆపేయమని కాదు.
          కొన్ని నియమాలను (పంచశీల) పాటించడం ద్వారా జీవనాన్ని గడపమంటుంది. అంతే. మనిషి
తన్నుతాను ప్రక్షాళన చేసుకోవడానికి, తన పై తాను అదుపు సాధించుకోవడానికి అనువైన ధర్మం
బౌద్ధమని రచయిత లక్ష్మినరసు మనకు సోదాహరణంగా వివరిస్తాడీ గ్రంథంలో.
        సమాజానికి శక్తినిచ్చే న్యాయం, ప్రేమ, సహనం, మైత్రి, దయ సోదర భావం మొదలైన గుణాలను అలవర్చుకోవడానికి బౌద్ధధర్మం ఎంతగానో ఉపకరిస్తుందన్నది వాస్తవం. బౌద్ధ  ధర్మంపై ప్రతి పాఠకుడు అవగాహన పెంచుకోవడానికి ఈ గ్రంథం సహాయపడుతుందనడంలో సందేహం లేదు. డా||అంబేద్కర్ చెప్పినట్లు ప్రతి ఒక్కరూ చదువవలసినదీ గ్రంథం.

పిళ్లా కుమారస్వామి
సెల్:9490122229

Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు