నేటి సమాజానికి అవసరమైన బౌద్ధం
నేటి సమాజానికి అవసరమైన బౌద్ధం
బౌద్ధం ఒక మతం కాదు. అది ఒక జీవన విధానం. వాస్తవానికి బౌద్ధం అనే పదం లేదు. ధర్మం మాత్రమే
వుంది. బుద్ధుడు శీలాన్ని ఆధారంగా చేసుకొని ధర్మం బోధించాడు. ఇది మనసును శాంతంగా వుంచుతుంది.
మూడు వేల సంవత్సరాల క్రితం (క్రీ.పూ. 500) యజ్ఞయాగాదులు విపరీతంగా జరుగుతుండేవి. ఆ
యజ్ఞయాగాదుల్లో జంతుబలి తప్పనిసరిగా వుండేది. భగవంతుని సేవించటానికి భక్తిని ప్రదర్శించటానికి, కోరికలు
నెరవేర్చుకోవటానికి వేలాది జంతువులను బలిచ్చేవారు. ఇప్పటిలాగా పూలు, పండ్లు, తియ్యని తినుబండారాలు
పెట్టేవారు కాదు. ఆ సందర్భంలో జరిగే హింసాత్మకతో కూడిన ప్రార్ధనలను, కర్మకాండలను
బుద్ధుడు తీవ్రంగా వ్యతిరేకించాడు.
బుద్దుడు హింసకు బదులుగా మానవీయ లక్షణాలను ప్రతిపాదించాడు. ఇతరుల
పట్ల దయ, కరుణ, ప్రేమవుండాలని చెప్పాడు. మనిషి మనిషిగా మనుగడ సాగించడానికి
పంచశీల బోధించాడు. ఆయన బోధనలు సమాజం సజావుగా నడవడానికి, మనిషి తన
ఔన్నత్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి.
బుద్ధుడు బోధించిన పంచశీల :
1 జీవహింస చేయకపోవడం
2. దొంగతనము చేయకపోవడం
3. వ్యభిచరించక పోవడం
4. అసత్యం చెప్పకపోవడం
5. మత్తు పదార్థాలను, మద్యాన్ని సేవించకపోవడం.
బుద్దుడు మానవతావాది. మానవున్ని కేంద్రంగా చేసుకొని మనిషి ఆనందంగా నివసించడానికి కావలసిన సామాజిక వాతావరణాన్ని కల్పించాలన్నాడు. బుద్ధుడు మనిషికి సంబందించిన నాలుగు ఆర్యసత్యాలు (నోబుల్
ట్రూత్స్) చెప్పాడు. అవి
1. మనిషికి దు:ఖం ఉంది.
2 దుఃఖానికి కారణం ఉంది
3. దుఃఖ నివారణ ఉంది.
4 దుఃఖ నివారణ మార్గం ఉంది.
బుద్ధుడు దు:ఖమంటే ఏమిటో వివరించాడు.
జన్మదు:ఖం, ముసలితనం దు:ఖం, రోగం దు:ఖం, మరణం దు: ఖం, అప్రియమైన వాటితో సంగమం దుఃఖం, ప్రియమైన వాటి నుండి విడిపోవడం దు:ఖం, కోరినది లభించకపోతే దుఃఖం, కోరికలంతా దు:ఖమే. మనుషులు దు:ఖంతో, కష్టాలతో, పేదరికంతో సతమతమవుతూ జీవిస్తున్నారనేది ఆయన రెండో భావన. ప్రపంచమంతా దు:ఖమయం. ఈ దు:ఖాన్ని ప్రపంచం నుండి తొలగించడం ఎలాగన్నదే ఆయన ధర్మం. మరేది ఆయన ధర్మం (మతం) కాదు. ప్రస్తుత ప్రపంచీకరణలో దు:ఖం అంటే మానసిక సంఘర్షణగానూ లేదా మానసిక వ్యాకులతగానూ మనం తీసుకోవచ్చు. దీన్ని నివారించటానికి బౌద్ధం ఆచరణాత్మక సమ్యక్ మార్గాలను ఎనిమిదింటిని (అష్టాంగ) చూపింది. ఇక్కడ సమ్యక్ అనగా మంచి అని అర్థం.
అష్టాంగమార్గాలు :
1) సమ్యక్ దృష్టి (రైట్ వ్యూస్) : అవిద్య నాశనమే సమ్యక్ దృష్టి లక్ష్యం. పూజాకర్మకాండల మీద విశ్వాసం పదలమంటుంది.
శాపాల పవిత్రతను విశ్వసించవద్దంటుంది. ప్రాకృతిక శక్తులను, మూఢనమ్మకాలను వదిలివేయమంటుంది. అనుభవం
మీదగాని, వాస్తవిక విషయాలమీద గానీ ఆధారపడని అన్ని రకాల ఊహాసిద్ధాంతాలను త్యజించమంటుంది.
2) సమ్యక్ సంకల్పం (రైట్ డిటర్మినేషన్) : ఇది దృఢంగా నిశ్చయించుకోవడానికి మార్గాన్ని చెబుతుంది.
1) కోరికలకుకల్లెంవేయాలి 2) ఇంద్రియలోలుడు కాకుండా భోగలాలసత నుంచి బయటపడాలి.3) ద్వేషభావం మానుకోవాలి4) ఏ ప్రాణికి ఏవిధమైన హాని చేయరాదు.
3) సమ్యక్ భాషణం (రైట్ స్పీచ్) : ఇది ఇలా బోధిస్తుంది... 1) ఎల్లప్పుడూ నిజాన్ని చెప్పాలి.
2) అబద్ధం చెప్పరాదు.
3) ఇతరుల గురించి చెడుగా మాట్లాడరాదు.
4) అపవాదులు వేయరాదు. 5) తోటివారిని తిట్టరాదు, కోపగించుకోరాదు.
6) అందరితో మర్యాదగా, దయతో ఉండాలి. 7) వ్యర్థ సంభాషణ చేయరాదు. ఏది మాట్లాడినా అర్థవంతంగా ఉండాలి.
4) సమ్యక్ ఆచరణ (రైట్ యాక్షన్) : ఇది సరైన ప్రవర్తనను బోధిస్తుంది.
1) ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలి.
2) ఇతరుల హక్కులను గుర్తించాలి.
5) సమ్యక్ జీవనం (రైట్ లైవ్లిహుడ్) : ఇది వ్యక్తికి, సమాజానికి నిజమైన ఆనందాన్ని కలుగజేస్తుంది.
1) జీవించడానికి
సరైన వృత్తిని అవలంబించాలి 2) ప్రాణికోటికి బాధ కలిగించే బానిసల వ్యాపారం, ఆయుధాలను, జంతువులను,
మద్యం, మాంసం విక్రయించే వ్యాపారాలు చేయకూడదు.
3) చేస్తున్న వృత్తిలో, వ్యాపారాలలో వంచన, అవినీతి,మోసం మొదలైనవి చేయరాదు.
6) సమ్యక్ కృషి (రైట్ ఎఫోర్ట్) : ఇది నాలుగు పనులు చేస్తుంది, మనస్సుకు శిక్షణ నిస్తుంది.ఆ నాలుగు ఏవంటే
1) మనసులో చెడు
తలంపులను ఇంద్రియ నిగ్రహంతో రాకుండా చేయడం 2) ఒకవేళ వస్తే వాటిని అణచివేయడం
3) మానసిక
దౌర్బల్యాలను అరికట్టి మనసును ప్రక్షాళన చేయడం, 4) మంచి ఆలోచనలను, మంచి విషయాలను పెంపొందించడం.
7) సమ్యక్ చైతన్యం (రైట్ కాన్షియస్ నెస్) : ఇది సరైన జాగరూకత, సరైన ఆలోచనలు ఉండాలని చెబుతుంది.
1)మనస్సు ఎప్పుడూ మేల్కొని ఉండటం, నిర్మలంగా ఉంచుకోవడం
2) మోహవికారాదులు కలుగకుండా చూసుకోవడం
3) దురాశకు దూరంగా ఉండటం
8) సమ్యక్ నిమగ్నత (రైట్ మెడిటేషన్) : ఇది మనస్సును ఏకాగ్రత సాధించడానికి శిక్షణ ఇస్తుంది. మంచి పనుల
గురించి ఆలోచించడానికి అది మనస్సుకు శిక్షణ ఇస్తుంది. చెడుపనులు, చెడు ఆలోచనలవైపు పోకుండా నిరోధిస్తుంది,
బుద్ధుడు బోధించిన అష్టాంగమార్గాలు, పంచశీల ధర్మాల ఆధారంగా బౌద్ధం ఇప్పటికీ నడుస్తోంది. బుద్ధుడు
తను చెప్పే ధర్మాలన్నింటిని ఆనాటి ప్రజల భాషైన పాళీ భాషలో ప్రచారం చేశాడు. ఆనాటి పాళీభాషలో తెలుగువారువాడే చాలా పదాలు ఉన్నాయని భాషాశాస్త్రవేత్తలు చెపుతున్నారు.
బుద్ధుడు హేతువాది, గొప్ప విజ్ఞాని, బుద్ధుడు చెప్పిన విషయాలు ఆధునిక విజ్ఞానం చెప్పే సూత్రాలకు ఏమాత్రం
తీసిపోవు. ఈ విశ్వం ఎలాంటి అతీంద్రియ శక్తుల సహాయం లేకుండానే నడుస్తోందని చెప్పాడు. ప్రపంచంలో ప్రతిదీ
ఒకదానితో మరొకటి ఆధారపడి నడుస్తోందని చెప్పాడు. ప్రపంచంలో ప్రతిదీ ఒకదానితో మరొకటి సంబంధాలు
కలిగి వుంది. ఈ సంబంధాల అల్లికలో ఎలాంటి ప్రాకృతిక శక్తుల జోక్యానికి అవకాశం లేదన్నాడు. ఇంద్రజాలానికి,
మహేంద్రజాలానికి మంత్రతంత్రాలకు చోటు లేదన్నాడు. ఈ విజ్ఞానాన్ని థేరవాదం పాటిస్తున్నది.
బుద్ధుడు ఈనాడు శాస్త్ర విజ్ఞానం చెప్తున్న విషయాలను ఆ రోజుల్లోనే చెప్పడం ఆయన జ్ఞానానికి నిదర్శనం.
ఆయన చెప్పినవి ప్రధానంగా
1. ఈ ప్రపంచం ప్రతిక్షణం మారుతూ వుంటుంది. ఈ మారే ప్రపంచం వెనుక మారనిది ఏదీలేదు.
2 ఈ ప్రపంచానికి వెలుపల దీనికి ఆధారమైనది, ఆశ్రయమైంది మరొకటి లేదు. ఈ ప్రపంచం సర్వసమృద్ధం.
సర్వస్వతంత్రం, తనకుతానే ఆధారమైంది.
3. ప్రతిదీ ఉన్నది" అనేది ఒక కొస అయితే ప్రతిదీ లేదనేది మరో కొస అవుతుంది. అసలు సత్యం ఈ రెండు కోసల మధ్యన ఉన్నది.
4. ప్రతిదీ తన రూపాన్ని పోగొట్టుకుంటుంది. ప్రతి ఒక ప్రవాహం. నది ప్రవహిస్తున్నట్లు ఈ విశ్వం విస్తతమవుతున్నది.
బుద్ధుని నిర్వాణం తరువాత (మరణానంతరం) బుద్ధుడు మళ్ళీ జన్మిస్తాడనే వారు మహాయానులుగా, నిర్వాణమే అంతిమమనే వారుథేరవాదులు (హీనయానులు)గా విడిపోయారు. వీరిద్దరూ కాకుండా అనేక తాంత్రిక విద్యలను వేదాంతమైన ఉపనిషత్తులసారాంశాన్ని బౌద్ధంలో ఉపయోగించే వారు కూడా తయారయ్యారు. వీరిని వజ్రయానులంటారు. వీరు టిబెట్ బౌద్ధులు(దలైలామా వర్గీయులు).బౌద్ధం మెల్లగా మత రూపాన్ని తీసుకుంది. బుద్ధున్ని దేవునిగా చేశారు.
మతం అనేది మూడవ శతాబ్దంలో ఏర్పడిన భావన. 10,11 శతాబ్దంలో ప్రతిదీ మతరూపాన్ని తీసుకుంది,
అలాగే హిందూమతం, బౌద్ధమతాలు ఏర్పడ్డాయి. రామాయణం కథ, బౌద్ధ జాతక కథల్లో ఉంది. ఈ కథను వాల్మీకిరామాయణ కావ్యంగా మలిచాడు. అది హిందువుల ఇతిహాస గ్రంథమైంది.
కళింగ యుద్ధంలో జరిగిన మారణ హోమం తరువాత ఆశోకునికి బౌద్ధులద్వారా ఎదురైన అనేక సంఘటనల ద్వారా యుద్ధమంటే అసహ్యంవేసి బౌద్ధంస్వీకరించాడు. బౌద్ధధర్మం ఆచరణయోగ్యమైనదిగా అశోకుడు భావించాడు. బుద్ధుడు బోధించిన కారుణ్యమార్గం, అహింస, సరైన కృషి, పంచశీల మొదలైన ధర్మాలను వివిధ శాసనాల ద్వారా శిలాఫలకాలద్వారా స్థూపాలద్వారా దేశవ్యాప్తంగానూ, ఇతరదేశాల్లోనూ ప్రచారం చేయించాడు. క్రీ.శ. 3వ శతాబ్దంలో మధ్యప్రదేశ్ లోని రాయిసేన్ జిల్లాలోని సాంచి పట్టణంలో ఆశోకుడు నిర్మించిన స్థూపం ఇందుకు ఉదాహరణ. సాంచిలోగల అశోక స్తంభం పై
నాలుగు తలల సింహం గుర్తునే భారత ప్రభుత్వం తన రాజముద్రకు చిహ్నంగా ఉపయోగిస్తున్నది.
అశోకుని ధర్మచక్రం బౌద్ధధర్మంపై ఆధారపడి తయారుచేయబడింది. ఈ ధర్మచక్రం అనేక విలువలకు చిహ్నంగా తయారుచేశారు.
ఇది వారణాసి సమీపంలో వున్న సారనాథ్ లో ఒక స్థూపంపై అశోకుడునిర్మించాడు. బుద్ధుడు తాను పొందిన జ్ఞానాన్ని తన పాత శిష్యులు ఆస్పాజీ,
మహానామా, కొండన్న, బద్దియా, వప్పా అనే ఐదు మందికి ఇక్కడేమొట్టమొదటగా బోధించాడు. బుద్ధుని ధర్మచక్రం ఇక్కడే ప్రారంభమైందన్నదానికి గుర్తుగా అశోక ధర్మచక్రం ఏర్పాటైంది. ఈ చక్రం మనదేశ సార్వభౌమాధికారానికి చిహ్నంగా నిలిచివుంది.
బౌద్ధధర్మాలకు ఆకర్షితుడైన అశోకుడు ప్రపంచంలో శాంతి, సౌభ్రాతృత్వాలను నెలకొల్పేందుకు బౌద్ధ ధర్మాలను ప్రచారం చేసేందుకు తన కుమార్తె సంఘమిత్రను శ్రీలంకకు పంపాడు. స్నేహపూర్వకమైన చర్యల ద్వారానే స్నేహభావం
పెరుగుతుందని గుర్తించిన అశోకుడు బౌద్ధ ధర్మాన్ని కేవలం వ్యాప్తి చేయడం కంటే ఎక్కువగా ఆచరణాత్మక సేవాకార్యక్రమాలు
ఎన్నో ప్రజాసంక్షేమ చర్యలు అశోకుడు చేపట్టి ప్రపంచంలోనే అతి గొప్ప చక్రవర్తిగా పేరుపొందాడు. బుద్ధునితరువాత అశోకబుద్దగా కీర్తింపబడ్డాడు.
బౌద్ధం మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తే నదీపరీవాహక ప్రాంతంలో అభివృద్ధి చెందింది. కర్నూలు నుంచి
అమరావతి దాకా కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో బౌద్ధం అభివృద్ధి చెందింది. రాజుల తరువాత వ్యాపారస్థులు బౌద్దాన్ని ఎక్కువగా స్వీకరించారు. జలమార్గం ద్వారా ప్రయాణించే అనేక మంది వ్యాపారస్థులు అనేక దేశాల్లో బౌద్ధాన్ని ఎక్కువగా వ్యాప్తి చేశారు.
అమరావతిలో ఆచార్య నాగార్జునుని ద్వారా మహాయాన సంప్రదాయం వర్ధిల్లింది. బుద్ధుడు అమరావతిలో కాలచక్రబోధించినట్లు టిబెట్ బౌద్ధులు భావిస్తారు. ఆ రోజుల్లోనే అమరావతిలో విశ్వవిద్యాలయం కూడా వుండింది.
ధరణికోట (ధాన్యకటకం), ఆంధ్రనగరి పేర్లతో ఆ రోజుల్లో అమరావతి వుండేది. అక్కడ వున్న ఆరామం కారణంగా ఆరామవతి అనేవారు. కాలక్రమంలో అమరావతిగా మారిపోయింది. ఇక్కడ వున్న బౌద్ధ స్థూపం వజ్రయాన
సంప్రదాయానికి గుర్తుగా చెపుతారు. ఆంధ్రరాష్ట్రంలో శాతవాహనులు బౌద్ధాన్ని బాగా ప్రోత్సహించారు.
తరువాత కాలంలో బౌద్ధం తన ప్రాభవాన్ని కోల్పోయింది. భారతదేశం నుండి బౌద్ధాన్ని తరిమివేయడానికి బ్రాహ్మణవర్గం తీవ్రంగా కృషి చేసింది. వేదకాలం నుండి యజ్ఞయాగాదుల్లో చేస్తున్న బలులను ఆపేశారు.
ముందు నుంచి భుజిస్తున్న మాంసాహారాన్ని మానివేసి శాఖాహారులుగా మారారు. బౌద్ధం చెప్పిన కరుణ, దయ, మైత్రిలను
హిందూ మతంలోకి తీసుకొచ్చారు. బుద్ధున్ని దేవునిగా చేసి దశావతారాల్లో చేర్చారు. అదే సమయంలో బౌద్ధంలో బుద్ధుని ధర్మాల స్థానంలో అనేక మాంత్రిక చర్యలు, హిందూమతంలో ఉన్న అనేక మూఢనమ్మకాలు, భోగలాలసత బౌద్ధం లోకి ప్రవేశించాయి.గుప్తుల కాలంలో హిందూ మతానికి ప్రాధాన్యత ఇచ్చి బౌద్ధ భిక్షువుల పై అనేక రకమైన దాడులు జరిగాయి. ఇలా క్రమక్రమంగా బౌద్ధం భారతదేశంనుండి నిష్క్రమించింది.కానీ అది ఇతర దేశాలకు ముఖ్యంగా చైనా జపాన్ బర్మా శ్రీలంక థాయిలాండ్ దేశాలకు బాగా విస్తరించింది.
భారతదేశం నుండి బౌద్ధాన్ని తరిమివేయడంతో భారతదేశం తన ఆత్మనుకోల్పోయిందని గురజాడ అన్నారు. 1956 నాటికి బౌద్ధమతం భారతదేశంలో
నామమాత్రంగా ఉండేది.
బి.ఆర్.అంబేద్కర్, ఏడు లక్షల మందితో బౌద్ధమతం స్వీకరించడంతో భారతదేశంలో
బౌద్ధమత విస్తరణ మళ్లీ మొదలైంది. 1990 నాటికి ఆంధ్రలో బౌద్ధ సాహిత్యం విస్తృతం అయింది. 2000 నుంచి బౌద్ధంపై ప్రజలలో ఆసక్తి పెరిగింది. నేడు బౌద్ధంపై విస్తారమైన సాహిత్యం వుంది. ధర్మదీపం ఫౌండేషన్ బౌద్ధ సాహిత్యాన్ని విశేషంగా వ్యాప్తి చేస్తోంది. బుద్ధ భూమి అనే పత్రిక రాష్ట్రంలో వెలువడుతోంది. ఆంధ్ర రాష్ట్రంలో బౌద్ధ ధర్మాల విస్తరణకు అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఆంజనేయరెడ్డి, బొర్రా గోవర్ధన్ గార్ల కృషి చెప్పుకోదగింది.
నేడు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజలు బౌద్ధాన్ని స్వీకరించారు. కాంబోడియా, థాయ్ లాండ్, మయన్మార్, భూటాన్, శ్రీలంక, జపాన్, లావోస్, తైవాన్, సింగపూర్, దక్షిణ కొరియా, వియత్నాం, మలేషియా,మంగోలియా, ఫిలిప్పీన్స్, చైనా, భారత్ దేశాల్లో ప్రజలు బౌద్ధాన్ని అనుసరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవం
తరువాత బౌద్ధం అధిక సంఖ్యలో వుంది.
బౌద్ధాన్ని మతంగా కాక ఆచరణాత్మక ధర్మంగా భావిస్తే వర్తమాన ప్రపంచీకరణ యుగంలో బౌద్ధం చెప్పిన విలువలు, ధర్మాలు విశ్వమానవాళికి అత్యంత అవసరమైనవిగా కనిపిస్తాయి.
వర్తమాన ప్రపంచీకరణ ప్రపంచంలో చాలా మంది ఆనేక మానసిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు.
ఆర్థిక సమస్యలు చుట్టిముట్టినప్పుడు సామాజిక సమస్యలు మీదపడినప్పుడు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
స్త్రీల పై హింస పెరిగింది. సెక్స్ సుఖం, సంపాదనపట్ల లాలస పెరిగింది. భారతదేశంలో నిచ్చెనమెట్ల కులవ్యవస్థఅలాగే ఉండిపోయింది. కుల వ్యవస్థ కారణంగా కుల దురహంకార లు కులాల మధ్య పెళ్లిళ్లు లేకపోవడం కులాల మధ్య సంబంధాలు ఉండడం ఇవన్నీ సమాజ అస్తిరత్వానికి దారితీస్తున్నాయి.కొన్ని కులాల వారిని అణగదొక్కడం ద్వారా ఇతర కులాలు ముందుకు వెళ్ళడం జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా విద్వేషాలు పెరిగి,హింస పెరిగిపోయి అభద్రతాభావం పెరిగిపోయింది. శాంతియుత సహజీవనానికి కరువు ఏర్పడుతోంది. పర్యావరణ విధ్వంసం వల్ల అనేక ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి.
వీటన్నింటికి పరిష్కార మార్గంగా బౌద్ధం మనకు మార్గదర్శనం చేయిస్తుంది. బౌద్ధం చెప్పిన మానవీయ గుణాలన్నీ మనుషుల మధ్య సామరస్యాన్ని పెంపొందిస్తాయి. శాంతియుత సహజీవనానికి తోడ్పడతాయి. స్త్రీ,పురుషులు సమానమని చాటింది. మానవులంతా సమానమని మనుషుల మధ్య ఎలాంటి వివక్షకు తావులేదని చెప్పింది. ఛండాలురుగా దూరం పెట్టిన దళిత కులాల వారిని కూడా గురువులుగా చేసి ఆచరణలో సమాన మానవీయ ధర్మాన్ని చూపించింది. హింస స్థానం లో అహింసకు ప్రాధాన్యత నిచ్చింది. మానవుని ప్రశాంత జీవితానికి అష్టాంగమార్గాలను, పంచశీల విధానాలను బోధించింది.బుద్దుడు చెప్పిన ధర్మాలు నేటి ప్రజాస్వామ్య యుగంలో చాలా చక్కగా ఉపయోగపడతాయి. ప్రపంచీకరణలో వస్తు ప్రపంచం గా మారిన మానవ సమాజంలో మానసిక అశాంతి పోగొట్టడానికి బౌద్ధం చెప్పిన ధర్మాలతో పాటు విపశ్యనాధ్యానం కూడా ఉపకరిస్తుంది.
___పిళ్లా కుమారస్వామి
సెల్:9490122229

Comments
Post a Comment