బౌద్ధధర్మ సారం
లక్ష్మీనరసు రాసిన "బౌద్ధధర్మ సారం" పుస్తకం
ఆధారంగా
బౌద్ధం హేతువాద భావనలపై నిర్మించబడింది. బౌద్ధం పూర్తిగా భౌతికవాదం పై నిలబడింది. మాయలను,
అతీంద్రియ శక్తులను పూర్తిగా నిరాకరించింది. మానవతీతమైన దైవశక్తిని తిరస్కరించింది. మానవుని కేంద్రంగా
చేసుకొని సమాజం సజావుగా నడవడానికి మనిషి ఆనందంగా జీవించడానికి ఒక ప్రాపంచిక దృక్పథాన్ని
అందించింది బౌద్ధం. ఆత్మ, పరమాత్మ మోక్షం లాంటి విషయాలను పక్కన పెట్టింది. బహుజనుల హితం కోసం,
బహుజనుల సుఖం కోసం ధర్మాన్ని బోధంచాలని బుద్ధుడు తన శిష్యులను కోరాడు.
బౌద్ధంలో మరొక సుగుణం సమతాభావం. సమతా వాదం ఇరవై శతాబ్దంలో వచ్చిన భావన, బుద్ధుడు
3500 సంవత్సరాల క్రిందటే సమతావాద భావాలను ప్రవేశపెట్టాడు. స్త్రీ పురుషుల మధ్య తారతమ్యాలను గాని,
పేదరికాన్ని గాని, అగ్రవర్ణ నిమ్నవర్గ మనే అంతరాలుగాని చూడలేదు. అలాంటి బేధభావాలు లేకుండా తన
సంఘంలో చేరేవాందరిని సమానంగా చూశాడు. అందరిని చూడమన్నాడు. అందువల్లనే తాలి బౌద్ధాన్ని ఆదిమ
కమ్యూనిజమని చరిత్రకారులు భావిస్తారు.
ఈ ప్రపంచం శాశ్వతం కాదని, ప్రపంచంలో ప్రతిదీ మార్పు చెందుతుందని బుద్ధుడు చెప్పాడు. ఈ విషయాన్నే
మార్క్స్ ప్రపంచంలో మారనిదల్లా మార్పేనని చెప్పినాడు. కాకపోతే ప్రపంచంలోని ప్రతిమార్పు రెండు విరుద్ధ
శక్తుల ఘర్షణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని మార్క్స్ శాస్త్రీయ నిర్ధారణ చేశాడు. బుద్ధుడు చెప్పిన మార్పు
ప్రకారం పాత సమాజం మారి కొత్త సమాజం వస్తుందనే అర్థాన్ని బుద్ధుడు చెప్పినట్లుగా మనం అర్థంచేసుకోవచ్చు.
మానవుని అసలైన లక్ష్యం మానవశక్తుల వికాసం.
ఈ లక్ష్యాన్ని బౌద్ధం మనకు అందిస్తుందనేది నిర్వివాదాంశం. మానవశక్తుల వికాసానికి బౌద్ధం మానసిక నైతికభావాలను పెంపొందించుటలో శ్రద్ధ వహించింది. బుద్ధుడు తన ధర్మాలన్నింటికి నైతికతను ప్రాతిపదికగాతీసుకున్నారు. ఒకరు వంద సంవత్సరాలు బ్రతికి వేల కొలది మూగజీవులను దేవతలకు బలిచ్చినా, ఇదే ప్రేమతో
ఒక్క జీవి ప్రాణాన్ని కాపాడిన ఫలితాన్ని అతనికి ఇవ్వలేవని బౌద్ధధర్మం చెపుతుంది. మనిషిని, అతని చెడు
ఆలోచనలు, కుటిల చర్యలు మలినపరుస్తాయి. అంతేగాని కేవలం మాంసాహారం తినడం ద్వారా మలినమైపోదని
బౌద్ధం స్పష్టం చేసింది. సరదా కోసం, బలికోసం, యుద్ధం కోసం జరిగే ప్రాణహానిని బౌద్ధం పూర్తిగా నిరాకరించింది.
దొంగతనాన్ని, దోపిడిని బౌద్ధం విషేధించింది. దోపిడిని వ్యతిరేకించింది. దురాశాపూరితమైన వ్యాపారలాభం,
దురాక్రమణ చేసే సామ్రాజ్యవాదం, దొంగతనం, దోపిడీల కొనసాగింపే.
తమ వ్యాపార లాభాల కోసం సంపన్న దేశాలు ప్రపంచీకరణను వర్ధమాన పేదదేశాలపై రుద్దోచుకుంటున్నాయి.దీనిని బౌద్ధం ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. కాకపోతే బౌద్ధ దేశాలుగా ఉన్న థాయ్ లాండ్, శ్రీలంకమొదలైన దేశాలు ప్రపంచీకరణ దోపిడిని ప్రతిఘటించకపోవడం శోచనీయం.
అక్రమ సంబంధాలు అనర్ధదాయకమని బౌద్ధమే గాక అన్ని మతాలు చెప్పినాయి. మత ధర్మాలు ఎంతోఘోషించినా అక్రమ సంబంధాలు నేడు సర్వవ్యాపితమైపోయాయి. మానవ సంబంధాలన్ని డబ్బు సంబంధాలుగా
మారిపోవడమే దీనికి కారణం. పెళ్ళిళ్ళు ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనే పునాదులపై కాకుండా కట్నకానుకలు,కులసంబంధమైన, మతపరమైన పునాదులపైన జరుగుతుండడమే ఈ అక్రమ సంబంధాలకు కారణం. మానవాళిమనుగడవివాహం ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యం కోసం భాగస్వామి ఎంపికలో ఆరోగ్యం, ఆలోచన, హృదయస్పందనకు నేడు
చోటు లేకుండా పోయింది.స్వాములు, బాబాలు చేసే లైంగిక కార్యకలాపాలు
ధర్మ ప్రవర్తకులను నివ్వెరపరుస్తున్నాయి. ధర్మమార్గంలో నడిచేవారందరూ ఆమోదయోగ్యమైన సెక్సును పాటించడం
అవసరమని బౌద్ధం చెప్పింది.
మత్తు పదార్థాలను సేవించరాదని చెపుతుంది. బౌద్ధం. భారతదేశంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్నిపాటించినవారు బౌద్ధులే. నేడు మద్యాన్ని ప్రభుత్వాలే ఒక ఆదాయవనరుగా భావించి విపరీతంగా లక్ష్యాలనునిర్ణయించుకొని మద్యాన్ని విక్రయిస్తున్నాయి. అలాగే చాలా బౌద్ధదేశాల్లో కూడా మద్యం విక్రయం అపారంగా ఉంది. ఇది ఎంతో విస్మయాన్ని కలిగించే అంశం. బౌద్ధం సమాజానికి, పాలకులకు సమానంగా ఈ ధర్మాన్నిచెప్పింది.
సత్యాన్ని విదక్షణతో చెప్పు కాని ఎల్లప్పుడు సత్యాన్నే పలుకు, అమరత్వం కంటే సత్యాన్ని ప్రేమించు. నీకుప్రమాదకరమైనా ఇతరులకు ప్రయోజనకరంగా వుంటే నిజాన్ని నిర్భయంగా చెప్పు' అని బౌద్ధ ధర్మం చెపుతుంది.
మనుధర్మం మాత్రం 'కామ సుఖాల్ని పొందటానికి, బ్రాహ్మణుని రక్షణ కోసం అబద్దాలాడవచ్చని చెప్పింది'. వెయ్యిఅబద్ధాలాడైనా వివాహం జరిపించమని చెప్పింది. ఇది నైతిక సూత్రాల ఉల్లంఘనే.
బౌద్ధంలో కుల వివక్షత లేదు, లింగ వివక్షత అసలేలేదు. స్త్రీలను పురుషులతో పాటు సమానంగా చూసింది బౌద్ధం. అలాగే బ్రాహ్మణునికి, చండాలునికి మధ్య ఉన్న తేడాలు కూడా బౌద్ధం చూడలేదు. బుద్ధుడు తాను చెప్పిన ధర్మానికి అనుగుణంగా తన బౌద్ధ సంఘంలోకి ఆంగులీమాలుడనే భయంకర నేరస్థుడ్ని, చండాల యువకుడుసునీతను, బెస్త వాడైన స్వాతిని, పశువుల కాపరి నందుని, మంగలి ఉపాలిని చేర్చుకున్నాడు. అలాగే నాట్య కళాకారిణి
ఆమ్రపాలిని, వ్యభిచారిణి విమలను, బానిసకూతురు పూర్ణను, వేటగాని కుమార్తె రంపాను తన బిక్షుణి సంఘంలో
చేర్చుకున్నాడు. బౌద్ధ దేశాల్లో స్త్రీలకు ఎలాంటి ఆంక్షలు లేవు. శ్రీలంకలో స్త్రీలకు స్వేచ్ఛ, సమానత్వాలు చాలాకాలం నుంచే వున్నాయి. థాయిలాండ్ లో స్త్రీ లు అనేక సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
ఇది బౌద్ధం అందించిచన గొప్ప సుగుణం. మన దేశంలో బౌద్ధ ప్రభావం అంతరించడం వల్ల నిచ్చెనమెట్ల కులవ్యవస్థ,లింగవివక్ష ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
నైతికతకు అసలైన ప్రమాణం మానవ జీవితమే కావాలి. అంతేకాని వేదాల్లో చెప్పినారనో, స్మృతుల్లోచెప్పినారనో, నైతికతను నిర్ణయించరాదని బౌద్ధం చెపుతుంది. బౌద్ధంలో నైతికత వ్యక్తి కేంద్రమైనది. ఆచరణలో
దాని ప్రతిఫలం పరోపకారం. ఇతరులను ప్రేమించటానికి, మనిషికి సహజాతంగా ఉన్న మానవీయ గుణాన్నిపెంపొందించటానికి నైతికత దోహదం చేస్తుంది. ప్రజ్ఞ ,స్వేచ్ఛ, సౌందర్యంలో పరిపూర్ణత సాధించటమే మనిషి
అంతిమ లక్ష్యం. బౌద్ధంలోని ఆదర్శ మానవత్వం మనిషిలో ఇలాంటి గుణాలను ప్రేరేపిస్తుంది.
మనం చనిపోవటం ఖాయం. కాబట్టి తిని తాగి సుఖాలు అనుభవించుదామని భౌతికవాదులైన చార్వాకులుచెప్పేవారని ప్రాచీన గ్రంథాలు చెపుతున్నాయి. ఈ సుఖవాదాన్ని బౌద్ధం తిరస్కరించింది. నియమబద్ధ జీవితం
ద్వారానే మనిషి సోమరితనాన్ని, కోపాన్ని, వదలిపెట్టగలడని బౌద్ధం చెపుతుంది. ఆత్మనిగ్రహం వస్తుంది. కోపంనశించి ప్రేమగా వుంటారు. అందరిచేత గౌరవింపబడతారు. ప్రపంచం ఏర్పడిన నాటి నుండి ప్రతిదీ ఒకపరిణామక్రమంలో జరిగింది. వానరుడు వరుడుగా మారే క్రమంలో మనిషి తనలోని జంతు లక్షణాలను ఒక్కొక్క
దాన్ని వదులుకుంటూ వైతికతను జీవన సూత్రంగా చేసుకున్నాడు.సమాజంలోమంచి పనులు చేయడం ద్వారా దుఃఖవిముక్తి పొందడానికి మార్గాన్ని ఏర్పరచుకోవచ్చని బౌద్ధం చెప్పుతుంది.
బుద్ధుడు చెప్పిన కొన్ని సత్యాలసారం
- ప్రపంచంలో కనిపించే విషయాలను ఉన్నది ఉన్నట్లుగా చూడాలి. మన స్వంత ఆలోచనలను చొప్పించరాదు,ఆపాదించరాదు. దీనినే మనం వస్తుగత పద్ధతి అని అంటాం. స్వీయమానసిక ధోరణి పనికిరాదు.శాస్త్రీయ ఆలోచనకు ఇది తొలి మెట్టు.
- ప్రకృతిలోని ప్రతిదీ వివిధ కారణాల ద్వారాలనే ఆస్థిత్వంలోకి వస్తుంది. ఇది కార్యాకరణ సంబంధాన్ని తెలియజేస్తుంది. హేతువాద భావాలకు ఇది ప్రాతిపదిక.
- ప్రపంచంలోని ప్రతి వస్తువు మార్పు చెందక తప్పదు. దీనిని మార్క్స్ కొంత మార్పు చేశాడు. వస్తువులోని మార్పు అంతర్గత, బాహ్య ఘర్షణ కారణాల వలన జరుగుతుందన్నాడు.
- జీవాత్మ పరమాత్మ అనేవి లేవు. ఇవి కేవలం భావాలలో ఉన్నవే తప్ప వాస్తవం కాదు.
- అజ్ఞానం (ఆవిద్య) కారణంగానే ప్రజలంతా శారీరక మానసిక దు:ఖాలు అనుభవిస్తున్నారు.
- ఏదో దానంతటదే జరుగదు. ప్రతి మార్పు మరొకదానితో పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. ఐనిస్టీన్ సాపేక్షతాసిద్ధాంతం దీనిని ధృవపరుస్తోంది.
బుద్ధుడు మనిషి ప్రవర్తనను నియంత్రించు కోవడానికి ఎనిమిది మార్గాలను వివరించాడు. అవన్ని పూర్తిగానైతికత మీద ఆధారపడినవే. ఈ మార్గాలతో పాటు ధ్యానాన్ని ప్రవేశపెట్టాడు బుద్ధుడు. దీనిని విపస్సన ధ్యానం అంటారు. ఈ ధ్యానం ఆతీంద్రియ శక్తులను సాధించేందుకు కాదు. మన ఆలోచనలను సంకల్పం
ద్వారా ప్రవర్తనను క్రమబద్ధం చేసుకోవచ్చు. అందువల్ల బౌద్ధంలో ధ్యానానికి ప్రముఖ స్థానం ఉంది.
బుద్ధుడు తాను చెప్పినవే సత్యాలుగా తీసుకోవాలని చెప్పలేదు. ఎవరికి వారు తమ అనుభవం ద్వారాసత్యాన్ని గ్రహించాలన్నాడు. ప్రపంచం శాశ్వతమా ? అశాశ్వతమా ? విశ్వం పరిమితమా ? అపరిమితమా ?లాంటి ప్రశ్నలు మన జీవనయానానికి ఏమాత్రం తోడ్పడవన్నాడు . ఆనాటి సమాజానికి బుద్ధుడు చెప్పింది సరిపోయింది. కాకపోతే విశ్వం గురించి ఏర్పడిన ప్రశ్నలతోనే మానవ విజ్ఞానం, మేధస్సు వికసించింది. సమాజానికి శక్తినిచ్చే న్యాయం, సహనం, ప్రేమ, మైత్రి దయ సోదరభావం మొదలైన గుణాలను అలవర్చుకోవాలని బుద్ధుడు చెప్పాడు.
బౌద్ధం ఒక మతం కాదు. అదొక జీవన విధానం. ఇందులో రెండు పద్ధతులున్నాయి. ఒకటి గృహస్టుగా బౌద్ధాన్ని పాటించడం. మరొకటి బిక్షువుగా మారి బౌద్ధాన్ని పాటించడం. గృహస్తు పంచశీల పాటించాలి. బిక్షువు పంచశీల, అష్టాంగ మార్గాలు పాటించాలి.
బౌద్ధం పలాయనవాదం కాదు. నిరాశావాదం అంతకంటే కాదు. ఇది కోరికలను త్యజించమంటుంది.అంటే అభివృద్ధిని ఆపేయమని చెప్పినట్లు కాదు. కొన్ని నియమాలను పాటించడం ద్వారా జీవనాన్ని గడపమంటుంది.అంతే. మనిషి తన్ను తాను ప్రక్షాళన చేసుకోవడానికి, తనపై తాను అదుపు సాధించుకోవడానికి అనువైన ధర్మం బౌద్ధ ధర్మం.
- పిళ్ళా కుమారస్వామి

Comments
Post a Comment