బౌద్ధం _ మానసిక వికాసం

      సరికొత్త జీవన విధానానమంటే ఏమిటో ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవాడానికి బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గాలు పంచశీల దోహదపడతాయి. ఈ ఆదర్శాన్ని ఎలా ఆచరణలో పెట్టాలన్న అంశాన్ని ఇందులో మీరు చూస్తారు .

       ప్రతి వ్యక్తి నా ఊరు, నా కులం,నా కుటుంబం లాంటి సంకుచిత వలయాన్ని వదిలేసి, బయటకు రావడం ఎలాగో నేర్చుకోవాలి.అందరినీ మీ సొంత మనుషులుగా అంగీకరించడం ఎలాగో నేర్చుకోవాలి.

      ఇతరులతో కలసి జీవించడం వల్ల సమష్టి కృషితో, పూర్తి శ్రద్ధతో ఏ పని అయినా ఎలా పూర్తి చేయాలో నేర్చుకోవాలి.

       మనమందరం కలసికట్టుగా ఈ దేశానికి హాని కరమైన అంశాన్ని ఎదుర్కొనే బలాన్ని సంపాదించుకోవాలి. అలాగే, దేశానికి ఉపయోగపడే కార్యాలను సాధించాలి.

ఆనందంగా ఉండండి
      మనిషి ఆనందంగా ఉండటానికి ఏమి చేయాలో తెలీక రోజూ కామెడీ సినిమాలను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. కొంత మందైతే గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ క్రుంగిపోతూ వుంటారు. సంతోషమనేది ఇతరులతో
పంచుకుంటే వస్తుంది. ఒక దీపంతో వేల దీపాలను వెలిగించవచ్చు. అలాగే ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటే ఏ మాత్రం తగ్గిపోదని బుద్ధుడు చెప్పినాడు. తనకున్న దాంట్లో సంతృప్తి చెందనివాడు ఏనాడూ సంతోషంగా ఉండలేడన్నాడు.
     ఆనందమంటే పుష్కలంగా ఉండటం కాదని పుష్కలంగా ఇవ్వటమని ఆయన బోధించాడు.

ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
    బుద్ధుడు మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చాడు. ప్రతి వ్యక్తి తన ఆరోగ్యానికి తానే రచయిత అన్నాడు బుద్ధుడు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోకుండా మనస్సును పరిశుభ్రంగా దృఢంగా ఉంచుకోవడం సాధ్యం కాదన్నాడు. గతాన్ని తలపోస్తూ భవిష్యత్తుపై
బెంగ పెట్టుకొని కష్టాలొస్తాయోమోనని భయపడుతూ ఉంటే మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఉండలేమన్నాడు.
వర్తమానం పై దృష్టి పెట్టి, ఆనందంగా జీవిస్తూ ఉంటే ఆరోగ్యంగా జీవించవచ్చునని ఆయన బోధించాడు.
      ఆరోగ్యం బాగుండాలంటే, మీరు తినే ఆహారం పట్ల తగినంత జాగ్రత్త వహించడం ఎంతో అవసరం. కనపడిన ప్రతిదీ తినకుండా విచక్షణ పాటించాలి.
      ‌ రోజూ కావాల్సినంత విశ్రాంతి తీసుకోవాలి. ప్రతి రోజూ సుమారు 7 నుండి 8 గంటల సేపు నిద్రపోవాలి. అప్పుడే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించ గలరు.

  ప్రతి రోజూ క్రమం తప్పకుండా అరగంట నుండి గంట సేపు వ్యాయామం చేయాలి. ఇందులో కనీసం పదిహేను నిమిషాలు ప్రాణాయామం చేయాలి. 15 నిమిషాలు ధ్యానం చేయాలి. తక్కిన కాలంలో శారీరక వ్యాయామం చేయాలి.

     మొక్కల నుండి లభించే ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. సోయా,
చిక్కుళ్ళు, డ్రైఫ్రూట్స్, పచ్చిబఠాణీలు మొదలైన వాటిలో ప్రోటీన్లు లభిస్తాయి. తరచుగా చిరుధాన్యాలు ముఖ్యంగా పెసలు, రాగులు, జొన్నలు, సజ్జలు, ఉలవలు మొదలైనవి తప్పనిసరిగా ఆహారంలో ఉండేటట్లు తీసుకోవాలి.
 ‌‌ ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను తరచూ తీసుకోవాలి. ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న చేపలు, అవిసె గింజలు, వాల్నట్స్ మొదలైనవి తీసుకోవాలి.
    బరువు పెరగకుండా చూసుకోవాలి. బిఎంఐ (బాడీమాస్ ఇండెక్స్) 25 ఉం డటం సరైనది. ఇది 30 కన్నా ఎక్కువ అయితే అధికబరువు ఉన్నట్లు. నడుము కొలత మగవారికి 40", స్త్రీలకు 37” కన్నా మించితే గుండెపోటు, మధుమేహం లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
  ‌ మద్యం, మత్తు పదార్థాలైన డ్రగ్స్, క్యాన్సర్సు కలిగించే పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, గుట్కా లాంటి వాటికి దూరంగా ఉండాలి.

పరిశుభ్రత పాటించాలి 

    ‌చక్కగా, పరిశుభ్రంగా ఉండడమనేది సభ్యత, సంస్కారమున్న వ్యక్తుల ప్రధాన లక్షణాల్లో ఒకటి. స్వచ్ఛత, పరిశుభ్రత అనేవి మీరు పాటించే ఆచారాల కంటే ముఖ్యమైనవి.
మీ ఇంట్లో వస్తువులు వల్లలు పరుపులు కుర్చీలు మొదలైన సామాగ్రి గదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. మీ వస్తువులను చక్కగా ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోవాలి. మీ గదిలో మీ ఇంటిలో కాలు పెట్టిన ఎవరైనా సరే మీరు మంచి అభిరుచి గల వ్యక్తి అని గుర్తించేలా చూసుకోవాలి. మీరు ఒక్కరే పరిశుభ్రత పాఠశాల చాలదు మీ ఇంటిలోని వారు సైతం అదేవిధంగా పరిశుభ్రంగా ఉండేందుకు సాయపడాలి. మీ ఇంటి ప్రాంగణాన్ని అందంగా ఆకర్షణీయంగా ఉంచుకోవాలి.

ఆచరణే ప్రధానం

      బుద్దుడు ఆచరణకు మార్గదర్శి. ఆచరణే ప్రధానమని ఆయన పలుమార్లు హెచ్చరించాడు.
        ఎంత మంచి విషయాలు చదివినా, ఎంత గొప్ప విషయాలు మాట్లాడినా, ఎంత మంచి ఆలోచనలు చేసినా వాటిని ఆచరించకపోతే ఏమి ప్రయోజనమని ఆయన సమాజాన్ని హెచ్చరించాడు. 

ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలి

        ఒకసారి ఆలోచనలపై అదుపు సాధించగల శక్తి సంపాదిస్తే అప్పుడు నీకెవరి సహాయం, అవసరం ఉండదన్నాడు.
చివరకు తల్లిదండ్రుల సహాయం కూడా.చెడు ఆలోచనలను నియంత్రించుకోవడానికి విపశ్యనా ధ్యానం మంచి సహాయకారి.
         మన ఆలోచనల ఫలితంగానే మన జీవితం తయారవుతుంది. గడచిన కాలంలో వచ్చిన ఆలోచనల ఫలితమే నేడున్న పరిస్థితికి కారణం. నేటి ఆలోచనలే రేపటి భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నాడు.
       అందువల్ల ఈ రోజు మనం చేయగలిగే పనులను సరైన ఆలోచనలతో చేయగలిగితే రేపు సహజంగానే మంచిగా ఉంటుంది. 



మాటలు, ప్రవర్తన హుందాగా ఉండాలి.

     ఒక వ్యక్తి గురించి తెలిసేది అతని మాటలవల్ల, అతని చేష్టలవల్ల. మాట కత్తికన్నా పదునైనది. అందుకే బుద్ధుడంటాడు ఒకచోట.'నాలుక ఒక పదునైన చాకు లాంటిది. అది రక్తం కారకుండా మనిషిని చంపేయగలదు'
అని. పదాలకున్న శక్తి అపరిమితం. అవి మనసును విరిచేయగలవు. లేదా మనసును పరిమళింపచేయగలవు.
పదాలు దయాపూరితమై సత్యమైతే అవి ప్రపంచాన్ని మార్చగలవు. అందుకే వేమన తన పద్యంలో ఇలా అంటాడు
'ఇనుము విరిగినేని యిమ్మారు ముమ్మారు | కాల్చియతుకవచ్చు క్రమముగాను | మనను విరిగినేని
మరికూర్చవచ్చునా | విశ్వదాభిరామ వినురవేమ" అందుకే మనం మాట్లాడే మాటలను, పదాలను జాగ్రత్తగా వాడాలి. మంచిమాటలు మంచిగానూ, చెడు మాటలు చెడుగానూ ప్రభావితం చేస్తాయంటాడు బుద్ధుడు.
    ‌మీరు ఎంతో తెలివిగలవారై ఉండవచ్చు. శీలవంతులై ఉండవచ్చు. అయినప్పటికీ, మీరు గనక ఇతరులతో ఆహ్లాదకరంగా, సక్రమంగా ప్రవర్తించనట్లయితే, మిమ్మల్ని ఎవరూ గౌరవించరు. ప్రేమించరు. ఇతరుల సహాయ సహకారాలు లేనిదే బతకడం సాధ్యం కాదు. కాబట్టి, ఎవరితోనూ ఎన్నడూ దురుసుగా ప్రవర్తించరాదు. ఎవరూ మిమ్మల్ని చూసి అపరిచితుడని అనుకోవడానికి వీలు లేనట్లుగా, ఇతరులతో మీ ప్రవర్తన ఉండాలి.
మీ కన్నా పై వాళ్ళ పట్ల, పెద్దవాళ్ళ పట్ల గౌరవం చూపాలి.సేవకులతోనూ, శ్రామికులతోనూ స్నేహంతో మెలగాలి.మీకు చేతనైన మేరకు ఇతరులకు సహాయపడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఏ పని చేయడాన్నయినా సరే చిన్నతనంగా భావించవద్దు. చివరకు గదిని ఊడ్వడం, గిన్నెలను కడగడం, బరువులు మోయడం లాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయవద్దు. నామోషీ పడకండి.

మీ ప్రవర్తనను నియంత్రించుకోండి. 

         కోపం గురించి బుద్ధుడు చెప్పినంతగా మరెవరూ చెప్పలేదు. నీవు కోపంతో ఉండటమంటే ఇతరులు చేసే తప్పులు నిన్నుకాల్చేస్తున్నాయని అన్నాడు. నీ కోపాన్ని చూసి ఎవరూ నిన్ను శిక్షించరు. అది నిన్ను శిక్షిస్తుందన్నాడు. నీవు కోపగించు కుంటున్నావంటే నిప్పును చేతిలో పట్టుకొని దాన్ని ఇతరులపైకి వేయాలనుకోవడం వంటిదన్నారు. ఎందుకంటే అది నిన్ను కాల్చేస్తుందన్నాడు.

         కోపగించు కోకుండా ఉండాలంటే ఒక చక్కని మార్గాన్ని సూచించాడు బుద్ధుడు. కోపం ఎప్పుడు వస్తుందంటే ఒక విషయంపై మనలో వ్యతిరేకతా భావం ఏర్పడినప్పుడే. అందువల్ల వ్యతిరేక భావాల్ని మన మనసులో లేకపోతే, లేదా మరచిపోతే కోపం దానంతట అదే మాయమవుతుంది. కోపం ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. 
      ఇతరులను జయించాలన్న ఆలోచనకన్నా తన్నుతాను జయించుకోవడమే గొప్పదన్నాడు. ఈ పని కోపాన్ని నిగ్రహించుకోవడంతోనే మొదలవుతుంది. 
      సుమతి శతకం పద్యకారుడు కూడా ఈ విషయాన్నే తన పద్యంలో ఇలా చెపుతాడు.

'తన కోపమే తనకు శత్రువు, 
తన శాంతమే తనకు రక్ష. 
దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, 
తన దు:ఖమే నరకమండ్రు తధ్యము సుమతీ".

మీ జీవితాన్ని మీరే నిర్మించుకోవాలి.
 
      మనిషి తన జీవిత కాలంలో ఉన్నతుడు కావాలంటే తన చరిత్రను, తన జీవితాన్ని తానే నిర్మించుకోవాలి.ఇతరులపై ఆధారపడ కూడదంటాడు బుద్ధుడు.ఒక పువ్వు ఎలా తానే వికసించి, పరిమళిస్తుందో, అందరికి అందాన్ని, సువాసనను వెదజల్లుతుందో అలాగా మనిషి కూడా తన్నుతాను మార్చుకుంటూ పదిమంది మార్పుకు దోహదం చేయగలగాలని బుద్ధుడు బోధించాడు.
         పిరికివాళ్ళు మృత్యువుకు ముందే పలుమార్లు మరణిస్తారు. ధైర్యవంతులు చావును ఒకేసారి రుచిచూస్తారని అన్నాడు విలియం షేక్స్‌పియర్.
     వేల మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలౌతుందని చైనీయుల సామెత చెపుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని మీ జీవితాన్ని మీరే మలుచుకోవాలి.





నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.

     ప్రపంచంలో శాశ్వతంగా నిలిచేదేదైనా ఉంటుందంటే అది మాట ఒక్కటే. ఒకసారి ప్రపంచంలోకి వచ్చిన మాట వెనక్కు  తీసుకోవడానికి వీలుకాదు. మాట మనిషిని మహనీయుడిని చేస్తుంది. అదే మాట మనిషి పతనావస్థకు దారితీస్తుంది. వాక్కుకు అంతటి అమోఘమైన శక్తి ఉంది. అవతలి వ్యక్తితో స్నేహం చెయ్యాలన్నా, మిత్రుడు శత్రువుగా మారాలన్నా ఒక్క మాట సరిపోతుంది.
బుద్ధునికి మాట విలువ తెలుసు కాబట్టే ఆయన ఎంతో సహనంతో, సంయమనంతో ప్రతి విషయాన్ని విడమరచి చెప్పినాడు. అవసరం లేనిచోట మౌనం పాటించారు.
ఆయన చెప్పిన అష్టాంగమార్గంలో సమ్యక్ వాక్కు ఒకటి.

 సత్యం మృదు ప్రియం వాక్యం
ధీరో హితకరం వదేత్౹
ఆత్మోత్కర్షం తథా నిందాం
పరేషాం పరిమార్జయేత్||

      బుద్దిమంతుడైనవాడు ఎల్లప్పుడూ
సత్యమూ,మృదువూ,హితకరమూ‌ అయిన మాటలనే పలకాలి.తన గొప్పతనాన్ని చెప్పుకోవడం కోసం , ఇతరులను నిందించడం లాంటివి‌ పూర్తిగా విడిచిపెట్టాలి.

నుతజలపూరితంబు లగు నూతులు నూరిటికంటె సూనృత
వ్రత! యొక బావి మేలు; మరి బావులు నూరిటికంటె నొక్కస
త్కృవదిమేలు; తత్కృతు శతంబునకంటె సుతుండు మేలు; తత్సు
త శతకంబు కంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్!
            (ఆంధ్ర మహాభారతం,నన్నయ,ఆది పర్వం)

"వంద మంచినీటి కయ్యలకంటే ఒక బావిమేలు. వంద బావులకంటే ఒక్క జలాశయం మేలు వంద జలాశయాల కంటే ఒక్క క్రతువు మేలు వంద క్రతువుల కంటే ఒక్క కొడుకు మేలు ‌వందమంది కొడుకుల కంటే ఒక మంచిమాట మేలు..."

నీకు నువ్వే సరైన జీవన మార్గాన్ని ఎన్నుకోవాలి.  

        సమాజంపై బుద్ధుని కున్న ప్రేమ ఆపారమైనది. మనిషి జీవిత లక్ష్యం ఏమంటే దానిని గుర్తించడమేనని చెప్పినాడు. తరువాత ఆ లక్ష్యానికి తన హృదయాన్ని అంకితం
చేయమన్నాడు. ప్రతి ఒక్కరికి ఎవరో వచ్చి మార్గాన్ని సూచించరు. తనే స్వయంగా తెలుసుకోవాలన్నారు. నీకు నువ్వే సరైన జీవన మార్గాన్ని ఎన్నుకోవాలన్నారు. దీనినే మహా కవి శ్రీశ్రీ ' ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా ! నిజం మరచి నిదురపోకుమా" అని ఒక పాట రాసినాడు. 

     ఎవరైతే తన మార్గాన్ని కనుగొంటాడో
అతడు ఇతరులకు కూడా మార్గాన్ని సూచించ గలడన్నాడు. ఇది నిజమే కదా ! ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని, గమ్యాన్ని గుర్తించడం చాలా కష్టమైనది. ఒక్కసారి గమ్యాన్ని గుర్తిస్తే, దానిని పూర్తి చేయగలనని నమ్మితే, తప్పకుండా గమ్యాన్ని చేరగలగుతాడని బుద్ధుడు చెప్పినాడు. విజేతలుగా నిలిచిన వారందరూ దీనినే ధృవీకరిస్తున్నారు. ఉదాహరణకు సచిన్  టెండుల్కర్ తన చిన్నతనంలోనే క్రిిికెట్ లోప్రపంచ కప్ సాధించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నాడు, సాధించాడు. తన నలభయ్యోయేటనే తాననుకున్నట్లే రిటైరయ్యాడు.

        లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం తెలియక కాదు, చాలా మందికి తెలుసు. సమస్యల్లా మనసుండకపోవడంమని అంటాడు బుద్ధుడు. ఇంకొక కారణం కూడా గుర్తించారాయన. ఒక వ్యక్తికి ప్రయాణంలో రెండు తప్పులు జరిగే అవకాశాలున్నాయన్నాడు. ఒకటి ప్రయాణం చివరి వరకు సాగించకపోవడం వల్ల. రెండవది అసలు మొదలు పెట్టకపోవడం వల్ల. చాలా మంది బౌద్ధంలో చేరినవారు ప్రారంభంలో ఏదో సాధించాలనుకుంటారు. మధ్యలో అన్నీ వదిలి పెట్టేస్తారు. అలాగే జీవితంలో ఏదో లక్ష్యాన్ని సాధించాలని బయలుదేరిన వారు మధ్యలో మనసు మార్చుకొని మళ్లీ కొత్త లక్ష్యాలను నిర్ణయించుకుంటూ ఉంటారు. చీటికిమాటికి లక్ష్యాలను మార్చుకొనేవారు లక్ష్యాలకు సంబంధించిన మార్గాలను మార్చుకునేవారు లక్ష్యాన్ని అందుకోలేరని బుద్ధుడు చక్కగా బోధించాడు.

       వేమన బుద్ధుని భావాలను పద్యరూపంలో చెప్పిన ప్రజాకవి. 'పట్టుపట్టరాదు, పట్టి విడువరాదు, పట్టినేని బిగియబట్టవలెను, పట్టి విడుచుటకన్నా పడిచచ్చుటే మేలు, విశ్వదాభిరామ వినురవేమా" అంటూ లక్ష్యాన్ని చేరుకోవడానికి బుద్ధుడు చెప్పిన ఆచరణాత్మక విధానాన్ని వేమన తన పద్యంలో చెపుతాడు.

Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు