సంపద దరిద్రం
సంపదలు లేక పోవటం దరిద్రం కాదు - దాన గుణం లేక పోవటం నిజమైన దరిద్రం.
======================
@ ముఖం అందంగా లేక పోవటం వికారం కాదు - మనసులో కల్మషాలు ఉండటమే అతి పెద్ద వికారం.
@ నువ్వు కండలు తిరిగిన గండర గండడుగా వళ్లు పెంచటం గొప్ప కాదు - మనసును దృఢంగా, దుఃఖ రహితంగా ఉంచుకోనటం నిజమైన గొప్ప.
@ పది మంది బాగు కోసం ఏమీ చేయకుండా, నువ్వు నూరు సంవత్సరాలు బతకటం గొప్ప కాదు - పది మంది మేలు కోసం నువ్వు ఎంత కాలం బతికినా నిజంగా అది గొప్ప.
@ ఇల్లు పెద్దదిగా ఉండటం గొప్ప కాదు - మనసు పెద్దదిగా ఉండటం నిజమైన గొప్ప.
@ పిల్లలకు పెద్ద చదువులు చెప్పించటం గొప్ప కాదు - వారికి చదువులతో పాటు, మంచి బుద్దులు నేర్పటం నిజమైన గొప్ప.
@ ఇంట్లో పది మంది పని వాళ్లు ఉండటం గొప్ప కాదు - ఆ పది మంది మనసులో గొప్ప స్థానం పొందటం గొప్ప.
@ బైట వారితో కలుపు గోలుగా ఉండటం అత్త గారి గొప్ప కాదు - ఇంట్లో సొంత కోడలితో కలిసి పోవటం నిజమైన గొప్ప.
@ తల్లిదండ్రుల ప్రేమ పొందటం గొప్ప కాదు - తల్లిదండ్రులతో పాటు, అత్త మామల ప్రేమను పొందటం నిజమైన గొప్ప.
@ నీ ఆస్తులు చూసి, పదవులు చూసి నీకు సత్కారాలు చేయటం గొప్ప కాదు - కేవలం నీ మంచితనం, నీ మానవత్వం చూసి గౌరవిస్తే అది నిజమైన గొప్ప.
@ కుల వేదికలపై నిన్ను కొండంత పొగడటం గొప్ప కాదు - విశ్వ మానవ వేదికపై నిన్ను గౌరవించ టం నిజమైన గొప్ప.
@ నీకు జ్ఞానపీఠ్ అవార్డు రావటం గొప్ప కాదు - నీ జ్ఞానానికి శీలం పునాదిగా ఉండటం నిజమైన గొప్ప.
@ దేవుడి ఉత్సవాలకు నువ్వు లక్షలు ఖర్చు చేయటం గొప్ప కాదు - వృద్ధులను, వికలాంగులను, అనాధ పిల్లలను, పేద విద్యార్థులను మానవత్వంతో ఆదుకోవటం నిజమైన గొప్ప.
@ నువ్వు మత విద్వేషాలను రగిలించటంలో పెద్ద నాయకుడిగా ఉండటం గొప్ప కాదు - నువ్వు మత విద్వేషాలను చల్లార్చే శాంతి ప్రబోధకునిగా ఉండటం నిజమైన గొప్ప.
@ నువ్వు నీ దేశాన్ని మాత్రమే ప్రేమించటం గొప్ప కాదు - సకల దేశాలను తన అంగాలుగా భావించే భూమాతను, ఆ భూమాత బిడ్డలైన విశ్వ మానవులను ప్రేమించటం నిజమైన గొప్ప.
@ నువ్వు ధర్మం గురించి శతాధిక గ్రంథాలు రాయటం, వేలాది ప్రసంగాలు చేయటం గొప్ప కాదు - వాటికి అనుగుణంగా జీవించటం నిజమైన గొప్ప.
మైత్రితో
మీ
కృష్ణార్జునరావు,
మంగళగిరి బుద్ధ విహార.
సెల్: 98481 99098.
ది. 05- 12- 2024.
🌹🌻🌹🌻🌹🌻🌹
Comments
Post a Comment