బుద్ధుడు కనుగొన్న విశ్వ మహాసత్యాలు


*త్రిరత్నాలు అనబడే మూడు విశ్వ మహాసత్యాలు.*

*త్రిరత్నాలనగా అనిత్యం, అనాత్మం, దుక్ఖం - దుక్ఖ నిరోధం అని పిలువబడే మూడు విశ్వసత్యాలు. ఈ విశ్వం అంతా యీ మూడింటితో నిండి వున్నది. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.*

*బుద్ధభగవానులవారు మానవాళికి అందించిన "అనిత్యం" అనే విశ్వసత్యం ప్రకారం, యీ విశ్వంలో శాశ్వతంగా వుండేది ఏదీ లేదు. ప్రతీదీ నిరంతరం మార్పు చెందుతూనే వుంటుంది. ఏదీ నిలకడగా వుండదు. ఇదే అనిత్య మహాసత్యం.*

*విశ్వానికి సంబంధించి ఎప్పటికీ తిరుగులేని సత్యం యిది. ఈ అనిత్య సత్యాన్ని బాగా ఎరుక పరుచుకోవడానికీ, అనుభూతం చేసుకోవడానికీ 'కాలం' బాగా ఉపయోగ పడుతుంది. పరిశీలిస్తూ వుంటే గాలి, నీరు, అగ్ని, మట్టి, ఆకాశం అనే మహా ఖాళీ ప్రదేశం.. వీటితో నిండిన జీవులు, నిర్జీవులతో సహా సర్వ ప్రపంచం అంతా నిముష నిముషానికీ ఏదో ఒక మార్పుతో, కదలికలతో, ధ్వనులతో, చైతన్యంతో, మార్పులతో కనిపిస్తుంది. అనుభూతమవుతుంది. మనలోనూ, మన ఎదురుగానూ ప్రతిక్షణం పుడుతూ మారిపోతూ నశించి పోతున్న భావనలు, దృశ్యాలు, శబ్దాలు, వెలుగులు, గాలులు ఒకదాని తరువాత ఒకటి నిరంతరంగా, అప్రతిహతంగా జరిగిపోతూ వుంటాయి. కేవలం భౌతికదృష్టితోనే సాధకుడు యీ మార్పుల్ని గమనించవచ్చు. ప్రతీ ఘటన యొక్క, ప్రతీ శబ్దం, ప్రతీ దృశ్యం, ప్రతీ గాలి యొక్క తీరులు, చలనాలు, పుట్టుక పెరుగుదల, అంతం, మార్పులు అన్నీ గోచరిస్తాయి. ఏ నిమిషమూ మరొక నిమిషం లాగా వుండదు. కేవలం సాక్షీభూతంగా వుంటే చాలు. రాత్రి, పగలు, ఉషా సంధ్యలు, రుతువులు వెలుగు చీకట్లు... చావు పుట్టుకలు ఎన్ని మార్పులు మనచుట్టూ?! క్షణక్షణం మార్పులమయమే.*

*మన చుట్టూ వున్న, అప్రతిహతంగా సాగిపోతున్న యీ అనిత్య సత్యాన్ని పరికించి, బాగా అర్ధం చేసుకుంటే;*

*(1). మనం దుక్ఖిస్తున్న దుక్ఖం, మనం అడ్డంకుగా భావిస్తున్న అడ్డంకు, మనం సమస్య అనుకుంటున్న సమస్య ఏదీ శాశ్వతం కాదనీ, ఏదీ అలాగే వుండిపోదనీ, విశ్వం యొక్క కాలం యొక్క అనిత్య మహా ప్రవాహంలో ప్రతీదీ మారిపోతూ వుంటుందనీ, క్రమేపీ తన రూపాన్నే కోల్పోతూ వుంటుందనీ బాగా అర్థం అవుతుంది. మానవ ప్రజ్ఞతో,కృషితో మన ఎదురుగా ప్రపంచంలో మరింత త్వరగా మార్పులు సాధించవచ్చని కూడా చక్కగా అర్ధం అవుతుంది. దాంతో మార్పులు వేగవంతం అయ్యేలా, సమస్యల్ని కాలానికో, వేరే ఎవరికో విడిచిపెట్టకుండా, మనం చేయవలసిన పనులు మనం మొదట చేసి, చక్కటి ఫలితాలు సాధించగలుగుతాము. వాన వస్తుందనో, ఎవరో పోస్తారనో భావించి వాడిపోయిన మొక్కను దాని మానాన దానిని వదిలివేయకుండ, మనమే స్వయంగా యిన్ని నీళ్ళు తెచ్చిపోసి, పైన చక్కగా జల్లి ఆ మొక్క పచ్చదనం. జీవం నింపుకుంటుంటే చూసి చాలా ఆనందిస్తాము.ఇలా మానవ కృషి ద్వారా మన ఎదురుగా వున్న ఆ చిట్టి మొక్క వాడి పోకుండా, దాని దుక్ఖాన్ని పరిమార్చి, ఆ మొక్కలో నూత్న మార్పులకు కారణం అవుతున్నాము. అనిత్యం అనే మహాసత్యాన్ని యీ విధంగా మన చేతులలోకి తీసుకుని, కొత్త మార్పులకి దోహదం పలుకుతున్నాము. అనిత్య సూత్రాన్ని మనకు అనుకూలంగా మార్చుకోగలుగుతున్నాము.*

*(2).ఇక నెమ్మదిగా, యీ వాడిపోతున్న మొక్క స్థానంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని పెట్టుకుని, అనిత్యం, యింకా మిగిలిన ధర్మాల సహాయంతో చైతన్య పూరితమైన మార్పులు తీసుకురాగలుగుతాము. అనిత్య మహాసత్యాన్ని బాగా అర్ధం చేసుకుంటే మనం మానవ ప్రజ్ఞ యొక్క ఆవశ్యకత బాగా అర్ధం చేసుకుని మనలోనూ, బయటా కూడా మంచి మార్పుల్ని తెచ్చుకోగలుగుతాం. ఈ సత్యాన్ని మన జీవితంలో భాగంగా అర్ధం చేసుకొనగలుగుతాం. అర్ధం చేసుకోవలసింది ఒక్కటే, ఏదీ నిలకడగా వుండదు, ఏదీ. శాశ్వతంగా వుండదు. మనిషి పూనికతో ఏ మార్పునైనా వేగవంతం చేయవచ్చు.*

*రచయిత : 🖋️డి.నటరాజ్ శాక్య*

*సేకరణ : ✍️అరియ నాగసేన బోధి*

Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు