ఆనందమంటే తృప్తిగా తినడమేనా?
మనిషి ఆనందంగా ఉండటానికి ఏమి చేయాలో తెలీక రోజూ కామెడీ సినిమాలను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. కొంత మందైతే గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ క్రుంగిపోతూ వుంటారు. సంతోషమనేది ఇతరులతో
పంచుకుంటే వస్తుంది. ఒక దీపంతో వేల దీపాలను వెలిగించవచ్చు. అలాగే ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటే ఏ మాత్రం తగ్గిపోదని బుద్ధుడు చెప్పినాడు. తనకున్న దాంట్లో సంతృప్తి చెందనివాడు ఏనాడూ సంతోషంగా ఉండలేడన్నాడు.
ఆనందమంటే పుష్కలంగా ఉండటం కాదని పుష్కలంగా ఇవ్వటమని ఆయన బోధించాడు.
బుద్ధుడు మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చాడు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోకుండా మనస్సును పరిశుభ్రంగా దృఢంగా ఉంచుకోవడం సాధ్యం కాదన్నాడు. గతాన్ని తలపోస్తూ భవిష్యత్తుపై
బెంగ పెట్టుకొని కష్టాలొస్తాయోమోనని భయపడుతూ ఉంటే మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఉండలేమన్నాడు.
వర్తమానం పై దృష్టి పెట్టి, ఆనందంగా జీవిస్తూ ఉంటే ఆరోగ్యంగా జీవించవచ్చునని ఆయన బోధించాడు.
బుద్ధుడు బోధించిన అష్టాంగమార్గాలన్ని మన ఆలోచనల్ని సరైనదారిలో ఉంచేందుకు తోడ్పడేవే. బుద్ధుడు కేవలం విజ్ఞానాన్ని బోధించే వ్యక్తికాదు. ఆయన ఆచరణకు మార్గదర్శి. ఆచరణే ప్రధానమని పలుమార్లు హెచ్చరించాడు.
ఎంత మంచి విషయాలు చదివినా, ఎంత గొప్ప విషయాలు మాట్లాడినా, ఎంత మంచి ఆలోచనలు చేసినా వాటిని ఆచరించకపోతే ఏమి ప్రయోజనమని ఆయన సమాజాన్ని హెచ్చరించాడు. ఆలోచనలను అదుపులో ఉంచుకోమన్నాడు.
ఒకసారి ఆలోచనలపై అదుపు సాధించగల శక్తి సంపాదిస్తే అప్పుడు నీకెవరి సహాయం, అవసరం ఉండదన్నాడు.
చివరకు తల్లిదండ్రుల సహాయం కూడా.చెడు ఆలోచనలను నియంత్రించుకోవడానికి అష్టాంగ మార్గాలు తోడ్పడతాయి. దీనికి విపశ్యనా ధ్యానం మంచి సహాయకారి.
మన ఆలోచనల ఫలితంగానే మన జీవితం తయారవుతుంది. గడచిన కాలంలో వచ్చిన ఆలోచనల ఫలితమే నేడున్న పరిస్థితికి కారణం. నేటి ఆలోచనలే రేపటి భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నాడు.
అందువల్ల ఈ రోజు మనం చేయగలిగే పనులను సరైన ఆలోచనలతో చేయగలిగితే రేపు సహజంగానే మంచిగా ఉంటుంది. ఆ
మనిషి గురించి తెలిపేది అతని మాటలవల్ల, అతని చేష్టలవల్ల. మాట కత్తికన్నా పదునైనది. అందుకే బుద్ధుడంటాడు ఒకచోట.'నాలుక ఒక పదునైన చాకు లాంటిది. అది రక్తం కారకుండా మనిషిని చంపేయగలదు'
అని. పదాలకున్న శక్తి అపరిమితం. అవి మనసును విరిచేయగలవు. లేదా మనసును పరిమళింపచేయగలవు.
పదాలు దయాపూరితమై సత్యమైతే అవి ప్రపంచాన్ని మార్చగలవు. అందుకే వేమన తన పద్యంలో ఇలా అంటాడు
'ఇనుము విరిగినేని యిమ్మారు ముమ్మారు | కాల్చియతుకవచ్చు క్రమముగాను | మనను విరిగినేని
మరికూర్చవచ్చునా | విశ్వదాభిరామ వినురవేమ" అందుకే మనం మాట్లాడే మాటలను, పదాలను జాగ్రత్తగా వాడాలి. మంచిమాటలు మంచిగానూ, చెడు మాటలు చెడుగానూ ప్రభావితం చేస్తాయంటాడు బుద్ధుడు.

చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు.
ReplyDeleteబి.రవి చంద్ర రెడ్డి