నీకు నువ్వే సరైన జీవన మార్గాన్ని ఎన్నుకోవాలి.
ప్రపంచంలో శాశ్వతంగా నిలిచేదేదైనా ఉంటుందంటే అది వాక్కు ఒక్కటే. ఒకసారి ప్రపంచంలోకి వచ్చిన వాక్కు వెనక్కు తీసుకోవడానికి వీలుకాదు. బుద్ధునికి వాక్కు విలువ తెలుసు కాబట్టే ఆయన ఎంతో సహనంతో, సంయమనంతో ప్రతి విషయాన్ని విడమరచి చెప్పినాడు. అవసరం లేనిచోట మౌనం పాటించారు.
భూమిపై మానవుని కర్తవ్యమేమిలో బుద్ధుడు చెప్పినంతగా మరెవరూ చెప్పలేదు. కారణం మనిషి కేంద్రంగా చేసుకొని మానవ జీవితాన్ని గురించి ఆలోచించడం వల్లనే. సమాజంపై బుద్ధుని కున్న ప్రేమ ఆపారమైనది. మనిషి జీవిత లక్ష్యం ఏమంటే దానిని గుర్తించడమేనని చెప్పినాడు. తరువాత ఆ లక్ష్యానికి తన హృదయాన్ని అంకితం
చేయమన్నాడు. ప్రతి ఒక్కరికి ఎవరో వచ్చి మార్గాన్ని సూచించరు. తనే స్వయంగా తెలుసుకోవాలన్నారు. నీకు నువ్వే సరైన జీవన మార్గాన్ని ఎన్నుకోవాలన్నారు. దీనినే మహా కవి శ్రీశ్రీ ' ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి
మోసపోకుమా ! నిజం మరచి నిదురపోకుమా" అని ఒక పాట రాసినాడు.
ఎవరైతే తన మార్గాన్ని కనుగొంటాడో
అతడు ఇతరులకు కూడా మార్గాన్ని సూచించ గలడన్నాడు. ఇది నిజమే కదా ! ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని, గమ్యాన్ని గుర్తించడం చాలా కష్టమైనది. ఒక్కసారి గమ్యాన్ని గుర్తిస్తే, దానిని పూర్తి చేయగలనని నమ్మితే, తప్పకుండా గమ్యాన్ని
చేరగలగుతాడని బుద్ధుడు చెప్పినాడు. విజేతలుగా నిలిచిన వారందరూ దీనినే ధృవీకరిస్తున్నారు. ఉదాహరణకు సచిన్ టెండుల్కర్ తన చిన్నతనంలోనే క్రిిికెట్ లోప్రపంచ కప్ సాధించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నాడు, సాధించాడు. తన నలభయ్యోయేటనే తాననుకున్నట్లే రిటైరయ్యాడు.
లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం తెలియక కాదు, చాలా మందికి తెలుసు. సమస్యల్లా మనసుండకపోవడంమని అంటాడు బుద్ధుడు. ఇంకొక కారణం కూడా గుర్తించారాయన. ఒక వ్యక్తికి ప్రయాణంలో రెండు తప్పులు జరిగే అవకాశాలున్నాయన్నాడు. ఒకటి ప్రయాణం చివరి వరకు సాగించకపోవడం వల్ల. రెండవది అసలు మొదలు పెట్టకపోవడం వల్ల. చాలా మంది బౌద్ధంలో చేరినవారు ప్రారంభంలో ఏదో సాధించాలనుకుంటారు. మధ్యలో అన్నీ వదిలి పెట్టేస్తారు. అలాగే జీవితంలో ఏదో లక్ష్యాన్ని సాధించాలని బయలుదేరిన వారు మధ్యలో మనసు మార్చుకొని మళ్లీ కొత్త లక్ష్యాలను నిర్ణయించుకుంటూ ఉంటారు. చీటికిమాటికి లక్ష్యాలను మార్చుకొనేవారు లక్ష్యాలకు సంబంధించిన మార్గాలను మార్చుకునేవారు లక్ష్యాన్ని అందుకోలేరని బుద్ధుడు చక్కగా బోధించాడు.
వేమన బుద్ధుని భావాలను పద్యరూపంలో చెప్పిన ప్రజాకవి. 'పట్టుపట్టరాదు, పట్టి విడువరాదు, పట్టినేని బిగియబట్టవలెను, పట్టి విడుచుటకన్నా పడిచచ్చుటే మేలు, విశ్వదాభిరామ వినురవేమా" అంటూ లక్ష్యాన్ని చేరుకోవడానికి బుద్ధుడు చెప్పిన ఆచరణాత్మక విధానాన్ని వేమన తన పద్యంలో చెపుతాడు.
Comments
Post a Comment