ధమ్మచక్కప్పవత్తన(Wheel of the Law)
బుద్ధుడు సారనాథ్ లోని హరిణవనం (జింకలవనం)లో తొలిసారిగా ఐదుగురు భిక్ఖువులకు చేసిన ఉపన్యాసాన్ని ధమ్మచక్కప్పవత్తన సూత్రం అన్నారు. ఈ ఉపన్యాసంలోనే భగవాన్ బుద్ధుడు "మధ్యేమార్గాన్ని",అరియ సత్యాలను బోధించారు. పాళీ భాషలో "ధమ్మచక్కప్పవత్తన"ను తెలుగులో ధర్మచక్రప్రవర్తన"గా పిలుస్తారు. అనగా సదాచార
మార్గం,సత్య మార్గం అని కూడా భావించవచ్చు. బౌద్ధంలో ధమ్మచక్కప్పవత్తనం అనగా జ్ఞాన సంస్థాపనాన్ని వివరించుట అని అర్థం. ధమ్మచక్కప్పవత్తన అనగా ధమ్మ చక్రాన్ని తిప్పడం లేదా స్థాపించుట అని చెప్పొచ్చు. ధమ్మచక్కప్పవత్తననే ఇంగ్లీష్ లో Wheel of Law అని అంటారు.
భగవాన్ బుద్ధుడు బోధించిన ధర్మానికి
చక్రం ఒక చిహ్నంగా భావిస్తారు. ఈ ధమ్మచక్రానికి ఎనిమిది ఆకులు(Spokes)ఉంటాయి.బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గానికి ఈ ఆకులు కూడా చిహ్నాలే. ధమ్మచక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది.
సిద్ధార్థుడు తన 29వ సంవత్సరాల వయస్సులో ఇల్లు విడిచి ఆషాఢ పౌర్ణమి నాడు పరివ్రాజకుడైనాడు.తన 35వ సంవత్సరాల వయస్సులో ఆషాడ పౌర్ణమి నాడే సారనాథ్ లోని జింకల వనంలో ఐదుగురు భిక్ఖువులకు తాను కనుగొన్న నూతన ధమ్మాన్ని బోధించారు. ఈ ఐదుగురు శిష్యులను పంచవర్గీయ భిక్ఖువులు అంటారు.
పంచవర్గీయ భిక్ఖువులెవరు?(భిక్షువులు)
బుద్ధుని శిష్యులు మొదట ఐదుగురు.వీళ్ళు బుద్ధునితో పాటు సత్యాన్వేషణ కోసం సాధన చేసిన వాళ్ళు.అయితే బుద్ధుడు పూర్తిగా చిక్కి శల్యమై పోతోన్న దశలో సత్యాన్ని తెలుసుకొని సుజాత అనే స్త్రీ ఇచ్చిన భిక్ష తినడంతో బుద్ధుడు
తన దీక్షను విరమించాడని భావించి
ఐదుగురు బుద్ధుణ్ణి అపార్థం చేసుకుని బుద్ధుణ్ణి వదిలి వెళ్లపోతారు.ఆ ఐదుగురు శిష్యులు ఎవరనగా...
1.కొండన్న(కౌండిన్య)
2.అశ్వజిత్
3.కాశ్యప
4.మహానామ
5.భద్రక
బుద్ధుడు తాను కనుగొన్న నూతన ధమ్మాన్ని(ధర్మాన్ని) ప్రజలకు చెప్పాలని నిర్ణయం తీసుకుంటాడు. తన పూర్వ గురువైన మేధావి, శాస్త్ర పరిజ్ఞానం గల అలారకాలామునికి బోధించాాలని ఆయన దగ్గర కు వెళతాడు.
ఆయన అప్పటికే మరణించారని తెలుసుకుంటాడు.మరో గొప్ప వ్యక్తి ఉద్దకరామపుత్రునిికి బోధించాలని భావించగా ఆయన నిర్యాణం చెందివుంటాడు.
తనతో ఒకప్పుడు తపస్సు చేసిన ఐదుగురు భిక్ఖువులకు కాశీ పట్టణంలో ఉన్నారని తెలుసుకుని
తన సిద్ధాంతాన్ని చెప్పాలని బయలుదేరతాడు బుద్ధుడు.దారిలో ఉపకుడు అనే జైన మతానికి చెందిన భిక్ఖువు కనిపించారు.బుద్ధుడు తనకు సంబోధి కలిగిందని జైన భిక్ఖు ఉపకునికి చెప్పగా ఉపకుడు నమ్మడు."సంబోధి కలిగితే, కలిగిందేమోలే!" అనుకుంటూ తన దారిన తను వెళ్ళిపోతాడతను.దీంతో బుద్ధుడు "ఇతర మార్గాలకు చెందిన వాళ్ళకు తన మార్గం చెప్పడం వలన ఫలితం లేదు" అని బుద్ధుడు భావిస్తాడు. బుద్ధుడు సారనాథ్ లోని జింకలవనం లో తనకు సేవలు చేసిన పంచవర్గీయ భిక్ఖువులకు తన ధమ్మాన్ని బోధించాలని వారిని వెదుకుతూ వెళతాడు. ఐదుగురు భిక్ఖువులు బుద్ధుని రాకను గమనించి ఎలాంటి ఆదరసత్కారాలు చూపకూడదని గట్టి నిర్ణయం తీసుకుంటారు. అయినప్పటికీ బుద్ధుడు వాళ్ళని సమీపించి వారితో "నేనొక నూతన ధమ్మాన్ని కనుగొన్నాను" అని చెబుతారు.
"ఓ గౌతమా!నీవు కఠినమైన తపస్సు మానేసి అన్నపానాల రుచులకు అలవాటు పడ్డావు.అలాంటిది నీకు ఎలా సంబోధి కలిగింది" అని ప్రశ్నిస్తారు.
బుద్ధుడు "నేనెప్పుడైనా తెలియంది తెలుసు అని నటించానా!నటించలేదనే నమ్మకం నాపై ఉంటేనే నా మాటలను వినండి,గొప్ప మార్గాన్ని నేను తెలుసుకున్నాను.మీరు కూడా ఈ మార్గంలో నడిస్తే మీకు సులువుగా విముక్తి లభిస్తుంది" అని చెపుతాడు.
"సరే! చెప్పండి. వింటాం. మీమీద మాకు నమ్మకం ఉంది" అన్నారా ఆ ఐదుగురు.
బుద్ధుడు వాళ్లనుద్ధేశించి
"ఓ భిక్ఖువులారా! సన్యాసులు రెండు విషయాలలో చిక్కుకోరాదు.ఒకటి కామభోగాలలోనే సుఖం ఉందని అనుకుని ఇంద్రియ సుఖాల కోసం ఆరాటపడుతూ బ్రతకడం.ఇది హేయమైనది. కామభోగాలకు అంతు అంటూ ఉండదు.నికృష్ట మైనది.అజ్ఞానులు మాత్రమే ఈ కామభోగాలలోనే ఆనందం ఉందని భావిస్తున్నారు. వినాశనానికి దారితీసేది కామభోగలాలసత.కాబట్టి ఇది మంచిది కాదు.రేపు ఉంటామో లేదో తెలీదు కాబట్టి ఇప్పుడు తినడం ,తాగడం ద్వారా సుఖంగా గడిపేయాలని అనుకోవడం మంచిది కాదు.కామం అగ్ని లాంటిది.స్వార్థం వదిలిపెట్టి కామానికి లోనుకాకుండా ఉండాలి.కోరికలు మనల్ని కలుషితం చేయరాదు. సుఖాల కోసం ప్రాకులాట వలన మనిషి దిగజారుతాడు.కనీస అవసరాలు తీర్చుకోవడంలో తప్పులేదు.మానసిక కోరికలు అత్యంత ప్రమాదం.ఇవి మనల్ని బానిసలుగా చేస్తాయి. శరీరాన్ని కాపాడుకోవడానికి, ఆరోగ్యంగా జీవించడానికి మనం కృషి చేయాలి.శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా మంచిగా ఆలోచన చేయగలుగుతాం.
రెండోది శరీరాన్ని కష్టపెట్టడం ద్వారా కోరికలను చంపుకోవాలని భావించడం.పూర్తిగా శరీరాన్ని శుష్కింపచేసే కఠోర తపస్సు వలన ఎలాంటి ఉపయోగం లేదు. ఇది మామూలు మనిషి కూడా చేయడు.ఇది చాలా బాధతో కూడినది. హీనమైనది.ఇంద్రియ సుఖాలను వదిలిపెట్టిన నిజాయితీ గల సన్యాసి ఈ జీవిత దుక్ఖాల నుండి విముక్తి చెందడానికి అత్యంత బాధతో కూడిన కఠోర తపస్సు చేస్తాడు. ఇది నిరుపయోగమైనది. ఈ తపస్సు బాధను పెంచుతుంది తప్పితే తగ్గించలేదు" అని బుద్ధుడు చెప్పాడు.
బుద్ధుడు ఈ రెంటినీ పూర్తిగా వదిలిపెట్టి మధ్యే మార్గాన్ని కొత్తగా ప్రవేశ పెట్టాడు.దీన్ని "మజ్జిమ పటిపదా" అనంటారు పాళీ భాషలో. ఈ మధ్యే మార్గం వస్తువులను ఉన్నది ఉన్నట్లు చూడమని దానికి ప్రజ్ఞ అవసరమని చెబుతుంది.
బుద్ధుని ఉపన్యాసం శ్రద్ధగా విన్న ఐదుగురు "ఆనాడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఏమేం చేశావు" అని ప్రశ్నించారు.
అప్పుడు బుద్ధుడు " మిమ్మల్ని విడిచిపెట్టిన తర్వాత గయ వెళ్ళి బోధి చెట్టు క్రింద నాలుగు వారాల పాటు ధ్యానం చేశాను. ధ్యానం చేయడం వలన తనకు జ్ఞానోదయం కలిగింది. అప్పుడే ఈ మధ్యే మార్గాన్ని కనిపెట్టాను" అని చెప్పినాడు.
ఆ ఐదుగురు పరివ్రాజకులు ఎంతో ఉత్సాహంతో మధ్యేమార్గాన్ని వివరించమని కోరతారు.
బుద్ధుడు మధ్యేమార్గాన్ని గురించి ఇలా చెప్పారు.
"తన ధమ్మం లో దేవుడు, ఆత్మ అనేవి లేవు.
చనిపోయిన తర్వాత ఏమవుతాడు అనే ప్రశ్న అనవసరం.
కర్మలు, క్రతులకు తన ధమ్మంలో స్థానం లేదు.
భూమిపై మనిషికి మనిషికి మధ్య సత్సంబంధాలు ఉండాలి.
మనిషి దుక్ఖంలో ఉన్నాడు.జన్మ దుక్ఖం. జర(ముసలితనం)దుక్ఖం, మరణ దుక్ఖం ,ఇష్టమైన వాళ్ళు దూరమైపోవడం దుక్ఖం, ఇష్టం లేనివాళ్ళతో జీవించాల్సిరావడం దుక్ఖం,కోరుకున్న వస్తువు దొరకకపోవడం దుక్ఖం.ఒక్కమాటలో చెప్పాలంటే ఐదు ఉపాదాన స్కంధాలు దుక్ఖాలే.కాబట్టి వీటిని ఎలా ఎదుర్కోవాలన్నదే" తన ధమ్మం అని చెప్పారు.
"దుక్ఖానికి పరిష్కారం ఏమిటి? అని శిష్యులు ప్రశ్నించారు.
"నిర్మలమైన జీవనం,సద్ధమ్మ విధానం, సౌశీల్యవంతమైన మార్గం లో పయనిస్తే దుక్ఖం అంతమవడం ఖాయం" అని బుద్ధుడు చెప్పారు.
మధ్యేమార్గాన్ని అనుసరించడానికి ఎనిమిది మార్గాలున్నాయి. ఆ ఎనిమిది మార్గాలనే అష్టాంగ మార్గం అంటారు.
అష్టాంగ మార్గం:
ఇందులో ఎనిమిది అంగాలు ఉన్నాయి...
1.సమ్యక్ దృష్టి( సరైన ఆలోచనా మార్గం)
2.సమ్యక్ సంకల్పం( సరైన సంకల్పం)
3.సమ్యక్ వాణి( సరైన పలుకులు)
4.సమ్యక్ కర్మ( సరైన పని)
5.సమ్యక్ జీవనం( సరైన జీవనశైలి)
6.సమ్యక్ వ్యాయామం( సరైన కృషి)
7.సమ్యక్ స్మృతి( సరైన స్మృతి)
8.సమ్యక్ సమాధి( సరైన ధ్యానం)
"ఈ అష్టాంగ మార్గాన్ని అనుసరించడం వలన దుక్ఖాన్ని తొలగించుకోవచ్చు" అన్నాడు బుద్దుడు.
ఈ ఉపదేశాన్ని విన్న ఐదుగురు భిక్ఖువులు తమ పాత మార్గాన్ని వదిలిపెట్టి బుద్ధుని మార్గాన్ని అనుసరించారు.తొలుతగా కొండన్న బుద్ధుని ఉపన్యాసాన్ని అర్థం చేసుకోగా తర్వాత నాలుగు రోజులకు మిగిలిన నలుగురు భిక్ఖువులు అర్థం చేసుకున్నారు. ఐదవ రోజున తథాగత బుద్ధుడు అనాత్మ సందేశాన్ని ఇచ్చారు.
అనాత్మ సిద్ధాంతం:
పాళీ భాషలో ఈ సిద్దాంతాన్ని "అనత్త లక్ఖన సుత్త" అంటారు. అంటే అనాత్మ లక్షణ సూత్రం అని అర్థం. మనిషి శరీరం మట్టి, నీరు ,అగ్ని, వాయువులతో నిర్మితమైనది.అనగా మనిషి శరీరం పంచస్కంధాలతో నిర్మితమైనది. ఈ ఐదు పంచ స్కంధాలలో దేనిలోనూ ,ఎక్కడా కూడా ఆత్మ అంటూ ఏదీ ఉండదు అని బుద్ధుడు చెప్పారు. ఇది విన్న కొండన్న బోధి పొందారు.
బుద్ధుడు రెండు అంత్యాలను,మధ్యే మార్గాన్ని చెప్పిన తర్వాత నాలుగు ఆర్య సత్యాలను వివరించారు.
చతురార్య సత్యాలు:(నాలుగు అరియ సత్యాలు)
పాళీ భాషలో "అరియ సచ్చాని" అంటే అత్యంత గొప్పవారు అనంటారు. పాళీ భాషలో 'సచ్చ' నే సత్యం అంటారు. అరియ అనగా శ్రేష్ఠుడు అని అర్థం. (దీనినే విదేశాల నుండి వలసొచ్చిన బ్రాహ్మణులు తమను తాము శ్రేష్ఠమైన వారిగా చెప్పుకోవాలని పాళీలో ఉన్న అరియను తీసుకుని ఆర్యులు అని చెప్పుకున్నారు.) మానవ జీవితానికి సంబంధించిన నాలుగు సత్యాలను బుద్ధుడు బోధించారు.
అరియ అంటే క్లేశాలను క్షాళనం చేసుకున్న వారని. అరియ "వస్తువును ఉన్నది ఉన్నట్లు" చూస్తాడు.తన భావాలను దానిపై రుద్దాడు.
బౌద్ధ సారమంతా చతురార్య సత్యాలలో ఉంది. చతురార్య సత్యాలు నాలుగు.
1.దుక్ఖం సత్యం
2.దుక్ఖ సముదయం సత్యం
3.దుక్ఖ నిరోధం
4.దుక్ఖ నిరోధ మార్గం
మొదటిది అరియ సచ్చ దుక్ఖం:
జన్మించడం,ముసలితనం,జబ్బు పడడం,
మరణం దుక్ఖమే.ఇష్టమైన వాళ్ళు దూరమవడం ,ఇష్టం లేనివారితో జీవించాల్సిరావడం, కోరిన వస్తువులు దక్కకపోవడం దుక్ఖానికి కారణాలు.
రెండోది అరియ సచ్చ దుక్ఖానికి మూలం తృష్ణ:
అన్నీ తృష్ణ వలనే కలుగుతాయి.ఇది చెప్పేదే మంటే దుక్ఖం , పునర్భవం(Rebirth) తృష్ణ వలనే ఏర్పడతాయని.
మూడోది అరియ సచ్చ దుక్ఖ నిరోధం:
తృష్ణ ను పారవేయడం,దాని నుంచి దూరంగా ఉండటం,ముక్తి పొందడం.
నాలుగోది అరియ సచ్చ దుక్ఖనిరోధగామి:
దుక్ఖాన్ని తొలగించుకోవడానికి అష్టాంగ మార్గం ఒకటి ఉంది అని చెప్పేది.
బుద్ధుని ఈ ధమ్మచక్కప్పవత్తనకు సారనాథ్ లో అశోకుడు క్రీ.పూ.3 వ శతాబ్దంలో స్ధూపాన్ని, అశోక ధమ్మ చక్రాన్ని,నాలుగు సింహాల శిల్పాన్ని శాశ్వత స్ఫూర్తిని కలిగించాలని ఏర్పాటు చేశారు. ధమ్మచక్కప్పవత్తన లో అశోకుని పాత్ర విశిష్టమైనది.అశోకుడు ధమ్మచక్కప్పవత్తనను అనుసరించడం వలనే రెండవ బుద్ధునిగా పేరు తెచ్చుకున్నారు.
ధమ్మచక్కప్పవత్తన లో అంబేడ్కర్
1956 అక్టోబర్ 14 న నవబుద్దుడుగా పేరొందిన అంబేడ్కర్ సుమారు ఆరు లక్షల మంది తన అనుచరులతో బౌద్ధ ధమ్మ దీక్షను స్వీకరించారు.ఇది ధమ్మచక్కప్పవత్తనలో సువర్ణాధ్యాయం.బోధిసత్వ అంబేడ్కర్ స్ఫూర్తితో ప్రపంచంలోని చాలా దేశాలు బౌద్ధాన్ని అధ్యయనం చేస్తుంటే మన దేశంలోని ప్రజలు మాత్రం ఇంకా కట్టుకథలనే పట్టుకుని వేళ్ళాడుతున్నారు. దళితులు క్రైస్తవ మతంలో ఉంటూ అది తప్ప ఇంకేం వినే పరిస్థితిలో లేరు.జపాన్ లోని బురాకుమిన్లు,హంగేరిలోని రోమాలు అంబేడ్కర్ స్ఫూర్తితో బౌద్ధాన్ని స్వీకరించారు.ఇంకా ప్రపంచ వ్యాప్తంగా అనేకులు బౌద్ధాన్ని స్వీకరిస్తున్నారు. విదేశాలలోని అనేకులు బౌద్ధాన్ని అనుసరించి అంబేడ్కర్ స్ఫూర్తితో బౌద్ధ భిక్ఖువులుగా మారి లోక కల్యాణం కోసం కృషి చేస్తున్నారు.ప్రపంచ వ్యాప్తంగా సుమారు 200కోట్లకు పైగా బౌద్ధులు ఉన్నారు.
ఆషాడ పౌర్ణమిని ధమ్మచక్కప్పవత్తన రోజుగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
సద్ధమ్మం చిరకాలం వర్థిల్లాలి
భవతు సబ్బ మంగలమ్
___అరియ నాగసేన బోధి
నమో బుద్ధాయ.. ధన్యవాదాలు మీకు
ReplyDelete