బౌద్ధ, జైనధర్మాల శాంతి,అహింసలే భారతదేశ పతనానికి మూలకారణమా?


        pc: manatelangana
బౌద్ధ, జైనధర్మాల శాంతి,అహింస, సమానత్వం
మొదలైన వాటితో కూడివున్నవిధానమే భారతదేశపు పతనానికి మూలకారణమని హిందూ మతతత్వవాదులు ఆరోపిస్తూంటారు.ఇది వాస్తవమేనా?

                ఇటువంటి ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు చరిత్రలో ఏక్కడా కన్పించడం లేదు. బౌద్ధ, జైన ధర్మాల వారి ఉపదేశాలమీద వాటి పరిణామాలమీద హిందూమతవాదులు చేసిన దోషారోపణలకు ధర్మానంద కోశాంబి తమ గ్రంథాలలో సవివరంగా సమాధానాలిచ్చారు. బుద్ధుని మహాపరినిర్వాణం (క్రీస్తుకు పూర్వం 5-12) తరువాత రెండు శతాబ్దాలకు చంద్రగుప్తుడు తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
చంద్రగుప్తుడు జైన ధర్మం స్వీకరించాడని చెప్పబడుతున్నది. కాని గ్రీకులను యీ దేశం నుంచి తరిమిచేసే సమయంలో ఆయనను అహింసా ధర్మం నిరోధించలేదే? ఆయన
పౌత్రుడు అశోకుడు పూర్తిగా బౌద్ధుడయిన తర్వాత కూడా విశాలమైన సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నాడే! మహమ్మద్ ఇబ్నకాసిమ్ క్రీ.శ.712లో సింధు ప్రాంతం మీద
దాడి చేసినప్పుడు పశ్చిమ హిందూ దేశంలో బౌద్ధమతం నామరూపాలులేవు గదా? అక్కడ బ్రాహ్మణ వర్గ ఆధిపత్యం వృద్ధి చెందుతూ వుందిగదా? ఆ స్థితిలో వున్నప్పుడే
ఖలీఫాకు చెందిన ఈ కుర్ర సర్దారు సింధుదేశాన్ని అతిసులభంగా జయించాడు. అక్కడ వున్న హిందూరాజును నిలువునా చంపేశాడు. అతని కుమారైలను తన ఖలీఫాకు
కానుకగా సమర్పించాడు. ముస్లిములు పంజాబు సింధు ప్రాంతాలలోని కొన్ని భాగాలను వశపరచుకొన్న
తరువాత వందసంవత్సరాలకు శంకరాచార్యుడు ఉద్భవించాడు. శూద్రులు వేదాధ్యయనం చేయరాదు. వేద వాక్యం విన్న శూద్రుని చెవులలో సీసంగానీ, లక్కగానీ
కరిగించి పోయాలి. వేదమంత్రాలను గ్రహించిన వాణ్ణి నిలువుగా చంపేయాలి. వేదమంత్రాలు ఉచ్చరించిన వాడి నాలుకను కోసిపారవేయాలి, ఇదీ వారి వేదాంతం.
ముస్లిం నాయకుల దగ్గరనుంచి మన సనాతనులు కొన్ని పాఠాలు నేర్చుకోవలసినది యేమీ లేదా? రాజపుత్రులు చాలా సనాతనులు. వారు అహింసను అసలు దగ్గరకే
చేరనివ్వరు. హింసను ఆరాధించే యీ మహా యోధులను మహమ్మద్ గజనీ తన గుర్రాల కాళ్ళతో తొక్కించి నాశనం చేశాడు. ఇదంతా ఎందువల్ల జరిగింది? రాజపుత్రులు బుద్ధుని అహింసా విధానాన్ని అవలంబించడం చేతనా? 
              మహారాష్ట్రలోని పీష్వా పదవిలో ఎప్పుడూ బ్రాహ్మణులే ఎక్కువగా ఉండే వారు.కడపటి బాజీరావ్ పీష్వా కార్యదీక్షకు ప్రసిద్ధి చెందినవాడు. పీష్వాల పెత్తనంలో హింస
పతాక స్థాయికి చేరుకొన్నట్లుగా కన్పిస్తున్నది. ఇతరులతో జరిగిన యుద్ధాల సంగతి అలావుంచండి. కాని స్వదేశంలోనే పూనాను ఒకసారి దౌలత్ రావ్ సింధియా దోచుకొంటే మరోసారి యశ్వంతరావ్ హెల్కర్ దోచుకొన్నాడు. హింసను
అపరిమితంగా ఆరాధించే ఇటువంటి హింసా భక్తుల సామ్రాజ్యం హిందూదేశమంతటా వ్యాపించి ఉండ వలసిందిగదా! హింసలో వీరికన్న వందరెట్లు మేలు అనిపించే
ఇంగ్లీషువాళ్ళ శరణం లోకి వీరు యెందుకు వెళ్ళవలసి వచ్చింది? ఒకరి తరువాత ఒకరు మరాఠా సర్దారు అందరూ ఇంగ్లీషు వాళ్ళకు ఎందుకు అంకితమయ్యారు?వీళ్ళంతా బుద్ధుని ఉపదేశాలు, మహావీరుని ఉపదేశాలు స్వీకరించిన వాళ్ళు కాదుగదా?
               జపాను పది పన్నెండువందల సంవత్సరాలనుంచి బౌద్ధ ధర్మం అవలంబించిన దేశంగా వుంది. క్రీశ. 1853 లో కమాండర్ పేరీ వారిపైన తుపాకులు ఎక్కుపెట్టడంతోనే వాళ్ళంతా మేల్కొన్నారు. సంఘటితులయ్యారు. బౌద్ధధర్మం వారిని యెందుకు బలహీన పరచలేదు? ఈనాటి వియత్నాం బౌద్ధ ధర్మం అవలంబించిన దేశంగా భావించబడుతూ వుంది. అమెరికా వంటి శక్తివంతమైన శత్రువుతో పోరాడి వారు యెలా విజయం సాధించారు? సాంఘిక, ఆర్థిక న్యాయం కోసం వియత్నాం ప్రజలు ఇంత శౌర్యంతో యెలా పోరాడారు? వారి మార్గానికి బుద్దుని అహింస ఎందుకు అవరోధం కల్పించలేదు?
వీటన్నింటిని బట్టి రుజువు అవుతున్నదేమిటంటే పరాజయానికి కారణం బుస్థితి ఉపదేశాలూ, మహావీరుని ఉపదేశాలూ కాదు. దానికి వేరే కారణం వుంది. భారతదేశం  పరాధీనమయినదనీ, దీనికి కారణం బుద్ధుడు, మహావీరుడు అనీ ఈ కారణంగా
హిందూ మతవాదులు క్షోభపడటం లేదు. బుద్ధుడు, మహావీరుడూ బ్రాహ్మణాధిపత్యాన్ని ప్రాణాలను సైతం లక్ష్యపెట్టకుండా ధిక్కరించి సమానత్వ వాతావరణ
కల్పించడంలోనూ, ధర్మం పేరుతో సామాన్య ప్రజలను పీడించడాన్ని, దోచుకొన్న అరికట్టడంలోనూ సాఫల్యం పొందారు. ఆ కారణంగా హిందూ మతవాదులు
క్షోభపడుతున్నారు.

 (హిందూ మతతత్వం- ఒక పరిశీలన నుండి)
(సేకరణ: పిళ్లా కుమారస్వామి)9490122229

Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు