బౌద్ధమత భవిష్యత్తుFuture of Buddhism

బుద్ధుని బోధనలను ఆమోదించినప్పుడే
హిందువులు బాగుపడతారని భావించేవాళ్లు నిరాశతో కూరుకుపోతున్నారు . భారతదేశంలో బౌద్ధమతం తిరిగి పునరుద్ధరించబడే అవకాశాలు కనిపించడం లేదనేదే వారి నిరాశకు కారణం . అయితే నేను ఆ నిరాశలో పాలుపంచుకో దలచుకో లేదు . ― బోధిసత్వ డా౹౹ బి.ఆర్.అంబేద్కర్.
ప్రతిమతం లోనూ రెండు రకాల వైఖరులతో రెండు వర్గాలుగా చీలిపోయి ఉన్నారు. ఈ వైఖరి హిందువుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది.తమ మతం పట్ల అనుసరించే వైఖరిని బట్టి హిందువుల్లో రెండు వర్గాల వాళ్లున్నారు. వారిలో అన్నిమతాలు నిజమైనవే అని భావించేవాళ్లు ఒకరకం.
హిందువులతో పాటు ఇతర మతపెద్దలు కూడా ఈ నినాదంతో గొంతు కలుపు తుంటారు . అయితే అన్ని మతాలూ నిజమైనవే అన్న సిద్ధాంతం కంటే తప్పుడు సిద్ధాంతం మరొకటి లేదు. ఇతర మతస్థులకు మద్ధతుగా కొందరు హిందువులు ఈ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. ఇక మరికొందరు హిందువులు తమ మతంలో ఏదో లోపం వుందని గుర్తిస్తున్నారు. అయితే వాళ్లు బాహాటంగా వ్యక్తం చేసేందుకు సిద్ధంగా లేరు. వారి ఇబ్బందిని మనం అర్థంచేసుకోవచ్చు.
మతం అనేది ఒక వ్యక్తి యొక్క సామాజిక వారసత్వం. ఆ వ్యక్తి జీవితం , గౌరవ మర్యాదలు దానితో ముడిపడి వుంటాయి. మతాన్ని వదలుకోవడం అంత సులువైన విషయం కాదు . తప్పో ఒప్పో "నా దేశం" అనుకోవడం లోంచే దేశభక్తి పుడుతుంది. అలాగే "నా మతం" అనే భావన కూడా.
చాలామంది హిందువులు తమ మతాన్ని వదులు కోవడం కంటే అనేక మార్గాల ద్వారా దానినుంచి తప్పించుకోవాలని చూస్తుంటారు. కొందరు ' అన్ని మతాలూ తప్పుల తడకే ' అన్న భావనతో సరిపెట్టుకుంటున్నారు. అలాంటప్పుడు మతం గురించి ఆలోచించడమే అనవసరం అన్నది వారి భావన.
ఇలాంటి భావాలే బౌద్ధమతాన్ని బహిరంగంగా అనుసరించేందుకు వారిని అడ్డుకుంటుంటాయి. ఈ వైఖరి వల్ల ఒనగూడే ఫలితం ఒక్కటే. హిందూమతం జీవితాన్ని నియంత్రించే శక్తిగా విస్తరిస్తుంది. ఒకరకమైన శూన్యం హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేస్తుంది. అప్పుడు హిందువులు ఒక సానుకూల వైఖరిని అవలంభించక తప్పదు. అలా జరిగినప్పుడు వాళ్లు ఇతరత్రా కాకుండా బౌద్ధం వైపుకు మళ్లగలుగుతారు.
ఇదొక్కటే ఆశా కిరణం కాదు. ఇతర వైపులనుంచి కూడా ఆశాజనకమైన అంశాలు కనిపిస్తున్నాయి
అణగారిన బడుగు వర్గాలకు మతం ' మానసిక, నైతిక ' ఉపశమనం కలిగించక పోతే ఆ మతం కుప్పకూలి పోతుంది.
ఒక ప్రశ్నకు ప్రతి మతం సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది. అణగారిన, బడుగు వర్గాల వారికి మతం ఎలాంటి మానసిక, నైతిక ఉపశమనాన్ని కలిగిస్తుంది ? ఏమీ కలిగించకపోతే ఆ మతం కుప్పకూలిపోతుంది. కోట్లాది వెనుకబడిన తరగతుల వారికీ , షెడ్యూల్డ్ కులాల వారికి హిందూ మతం ఏమైనా మానసిక, నైతిక ఉపశమనాన్ని కలిగించగలుగుతుందా ? లేదు. వారికి ఎలాంటి మానసిక, నైతిక ఉపశమనాన్ని కలిగించకపోయినా వాళ్లు హిందూమతంలోనే పడివుంటారని హిందువులు ఆశిస్తున్నారా? అలాంటి ఆశలేమైనా వుంటే అవన్నీ అడియాసలే అవుతాయి. హిందూ మతం ఓ అగ్ని పర్వతం మీద వుంది. ఆ అగ్ని పర్వతం ఆరిపోయినట్టు కనిపిస్తుండవచ్చు. కానీ ఆరిపోలేదు. శక్తివంతులైన కోట్లాది బడుగువర్గాల ప్రజలకు తమ అణగారిన స్థితి గురించిన చైతన్యం కలిగినప్పుడు, ప్రత్యేకించి తాము హిందూమతం యొక్క సామాజిక సిద్ధాంతం మూలంగానే అణగారి పోయామన్న స్పృహ కలిగినప్పుడు ఆ అగ్నిపర్వతం తిరిగి కుతకుతలాడుతుంది. రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవమతం,క్రైస్తవేతర మతాన్ని (పాగనిజం) నిర్మూలించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుచేసుకోవాలి.
అక్కడి ప్రజలు ఆ పాత మతం తమకు ఎలాంటి మానసిక, నైతిక ఉపశమనాన్ని కలిగించలేదని గ్రహించినప్పుడు దానిని తక్షణమే విసర్జించి క్రైస్తవమతాన్ని స్వీకరించారు. రోమ్ లో జరిగిందే ఇండియాలోనూ తప్పక జరుగుతుంది. హిందూ ప్రజానీకం చైతన్యవంతులై నప్పుడు తప్పక బౌద్ధమతం వైపునకే మళ్లుతారు .
–డా౹౹ బి.ఆర్.అంబేద్కర్
Comments
Post a Comment